'రాజ్యసభ సీటివ్వకుండా నన్ను అవమానించారు'
మెదక్: టీడీపీ నేత, మాజీమంత్రి బాబూమోహన్ టీఆర్‌ఎస్‌లో చేరనున్నారా? ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాలను చూస్తే బాబూ మోహన్ టీఆర్ఎస్ పార్టీలోకి చేరేందుకు ఏర్పాట్లు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుపై బాబూ మోహన్ విమర్శలు గుప్పిస్తున్నారు. తనకు రాజ్యసభ సీటివ్వకుండా తనను అవమానపరచారని ఆదివారం మరోమారు అసహనం వెళ్లగక్కారు. తనకంటే వెనకాల వచ్చిన వారికి రాజ్యసభ సీటిచ్చిన పార్టీ నాయకుడి వైఖరిని తప్పుబట్టారు. ఆయనతో సామాజిక న్యాయం ఎప్పటికీ జరగదని అభిప్రాయపడ్డారు. త్వరలో తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటిస్తానని బాబూమోహన్ తెలిపారు.
టీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఆ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్‌రావు నుంచి ఒక్క ఫోన్‌కాల్ చాలని టీడీపీ నేత శనివారం బాబూమోహన్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా జోగిపేటలో శుక్రవారం ఆయన్ను ‘స్థానిక’టీడీపీ అభ్యర్థులు కలిశారు. ‘అన్నా.. మీరు టీఆర్‌ఎస్‌లోకి వెళుతున్నట్టు వార్తలు వస్తున్నాయి, ఇక మా పరిస్థితి ఏమిటి’ అని ప్రశ్నించగా.. ఆయన పై విధంగా స్పందించారు. తనను ఎమ్మెల్యే చేసింది కేసీఆరేనని, తనపై ఆయనకు సర్వహక్కులు ఉన్నట్లు తెలిపారు. మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహపై పోటీ చేయడం ఖాయమన్నారు.
ఇప్పటికే టీఆర్‌ఎస్ నేతలతో ఆయన సంప్రదింపులు పూర్తయ్యాయని..పార్టీలోకి చేరేందుకు అధ్యక్షుడు కేసీఆర్ నుంచి గ్రీన్ సిగ్నల్ మాత్రమే రావాల్సి ఉందని ఆయన మాటల్ని బట్టి తెలుస్తోంది. ఈనెల 26 తర్వాత ఆయన టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రాధమిక సమాచారం. గతంలో బాబూమోహన్ ఆంధోల్ నుంచి పోటీచేసి 1994, 1999లలో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా కూడా పనిచేశారు. 2004, 2009లో ఎన్నికల్లో ఓడిపోయారు.