సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: గులాబి దళపతి కేసీఆర్, మాజీ మంత్రి, సినీ నటుడు బాబూమోహన్... వీరిద్దరిదీ రెండు దశాబ్ధాల అనుబంధం. ఇద్దరూ టీడీపీతోనే రాజకీయాల్లోకి వచ్చారు. ఆ తర్వాత రాజకీయంగా ప్రత్యర్థులైనా తమ అనుబంధాన్ని కొనసాగించారు. ఈ ఇద్దరు నేతలూ ఒకరినొకరు బావా..అంటే బావా అంటూ సంబోధించుకుంటారు. ఈ మైత్రితోనే బాబూమోహన్ బుధవారం పచ్చపార్టీకి బైబై చెప్పి కేసీఆర్ సమక్షంలో కారెక్కారు. వాస్తవానికి బాబూమోహన్ ఎప్పుడో గులాబీదళంలో చేరాల్సి ఉన్నప్పటికీ రాజకీయ పరిస్థితుల కారణంగా అది సాధ్యం కాలేదు. అయితే మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బావ చెంతకు చేరిన బాబూమోహన్...టీఆర్‌ఎస్ తరఫున జోగిపేట నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు.
బాబూమోహన్‌కోసమే జోగిపేట దత్తత
కేసీఆర్ తన గెలుపు కోసం ఎంత సీరియస్‌గా పని చేస్తారో.. అంతకంటే ఎక్కువగా బాబూమోహన్ గెలుపు కోసం ప్రయత్నించేవారు. 1999లో టీడీపీ తరఫున పోటీలో ఉన్న బాబూమోహన్ ఓడిపోతారని ప్రచారం తీవ్రంగా జరిగింది. అయితే ఎన్నికలు రేపు అనగా... కేసీఆర్ తన నియోజకవర్గం సిద్దిపేటను వదిలేసి, జోగిపేటలో మకాం వేశారు. రాత్రికి రాత్రే పరిస్థితిని తారుమారు చేశారు. బాబూమోహన్‌ను బంపర్ మెజార్టీతో గెలిపించారు. ఆయన మీద అభిమానంతోనే జోగిపేటను కేసీఆర్ దత్తత తీసుకున్నారు. దాదాపు రూ. 100 కోట్లతో నియోజకవర్గంలో అభివ ృద్ధి పనులు చేశారు.
తర్వాత రాజకీయ సమీకరణాలు మారాయి. కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టీఆర్‌ఎస్‌ను స్థాపించారు. అదే సమయంలో అప్పట్లో దివంగత సీఎం వైఎస్సార్ చరిష్మాతో బాబూమోహన్‌పై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ విజయం సాధించారు. పార్టీలు వేరైనా ఇద్దరి మధ్య స్నేహం చెక్కు చెదరలేదు. టీఆర్‌ఎస్ పురిటిగడ్డగా చెప్పుకునే మెదక్ జిల్లాలోని జోగిపేటలో ఆ పార్టీ నుంచి చెప్పుకోదగిన నేత లేకపోవడానికి బాబూమోహన్, కేసీఆర్ సాన్నిహిత్యమే కారణమని ఇక్కడి వారు చెప్పుకుంటారు. బాబూమోహన్‌కు పోటీ ఉండకూడదనే ఆలోచనతోనే టీఆర్‌ఎస్ నుంచి బలమైన నాయకత్వాన్ని కేసీఆర్ ప్రోత్సహించలేదనే బలమైన ప్రచారం ఉంది.
సినీగ్లామర్ జోగిపేటలో పాగా
ఖమ్మం జిల్లాకు చెందిన బాబూమోహన్ సినిమా రంగం నుంచి టీడీపీ తరఫున నేరుగా ఆందోల్ నియోజకవర్గానికి వచ్చారు. ఇక్కడ స్థానికేతరుడు అయినప్పటికీ అప్పట్లో ఆయనకున్న సినీగ్లామర్, కేసీఆర్ అండదండలతో టీడీపీ త రఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఒక పర్యాయం కార్మిక శాఖ మంత్రిగా కూడా పని చేశారు. 2004, 2009 లో వరుసగా రెండుసార్లు పరాజయం చవిచూసిన బాబూమోహన్ ఆర్థికంగా కూడా చితికిపోయారు. అప్పటి నుంచి నియోజకవర్గంతో అంతంతమాత్రంగానే సంబంధాలు కొనసాగిస్తూ వస్తున్నారు. తాజాగా ఆందోల్ నియోజకవర్గంపై మంచి పట్టున్న మాజీ ఎంపీ డాకూరి మాణిక్యరెడ్డి , ఆయన సోదరుడు జైపాల్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లోకి చేరారు. వాళ్లే బాబూమోహన్ను పట్టుబట్టి పార్టీలోకి చేర్చినట్లు సమాచారం.
మరోవైపు టీడీపీలో చోటు చేసుకున్న సంఘటనలు బాబూమోహన్‌ను తీవ్ర మనస్థాపానికి గురిచేసినట్లు తెలుస్తోంది. టీడీపీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులకు బీ-ఫారాలను తన చేతుల మీదుగా ఇవ్వాలని బాబూమోహన్ భావించారు. అయితే పార్టీ మాత్రం అనూహ్యంగా జహీరాబాద్ పార్లమెంటరీ ఇన్‌చార్జి మదన్‌మోహన్‌తో బీ-ఫారాలు అందజేసింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన బాబూమోహన్ టీడీపీకిరాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తీవ్ర అంతర్మథనం అనంతరం ఆయన బావ పంచన చేరారు.
బాబూమోహన్.. బావ చెంతకు
Published Wed, Apr 2 2014 11:56 PM | Last Updated on Wed, Aug 15 2018 9:17 PM
Advertisement