సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి పరిస్థితిపై ఆ పార్టీ ముఖ్య నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పాత మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లోని పలు నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ బలహీనంగా ఉందని వివిధ నివేదికలు, సర్వేలు నివేదించినట్టు సమాచారం. దీంతో ఆయా నియోజకవర్గాల్లో బలం పెంచుకోవడంపై పార్టీ అధినాయకత్వం దృష్టి సారించింది. అసలు ఉత్తర తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తిరుగులేదన్న ధీమా ఉంది. సీఎం కేసీఆర్ సొంత జిల్లాపైనా విశ్వాసముంది. హైదరాబాద్, ఖమ్మం జిల్లాల్లోనూ వివిధ పథకాల ప్రభావం, సామాజిక అంశాలు, సెటిలర్లలో పెరిగిన విశ్వాసం వంటివి సానుకూల ఫలితం చూపుతాయని పార్టీ నేతలు చెబుతున్నారు.
గత సాధారణ ఎన్నికల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో కాంగ్రెస్ పెద్దగా ప్రభావం చూపించకపోయినా.. టీడీపీకి కొన్ని అసెంబ్లీ సీట్లు దక్కాయి. అయితే టీడీపీ ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం టీఆర్‌ఎస్‌లో చేరారు. గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిధిలో ఒక్క కొత్తగూడెం మాత్రమే టీఆర్‌ఎస్‌కు దక్కినా.. తర్వాతి పరిణామాల్లో టీఆర్‌ఎస్ తిరుగులేని ఆధిక్యానికి చేరుకుందని నేతలు చెబుతున్నారు. అక్కడి కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీలకు చెందిన ఎంపీ, ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం పరిధిలోని రెండు నియోజకవర్గాలు మినహా మిగతావన్నీ టీఆర్‌ఎస్ అధీనంలోనే ఉన్నాయి. దీంతో హైదరాబాద్, ఖమ్మం జిల్లాలపై టీఆర్‌ఎస్ ముఖ్యులు ధీమాగానే ఉన్నారు.
కొరుకుడు పడని పాలమూరు, నల్లగొండ
మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో టీఆర్‌ఎస్ పరిస్థితి కొంత ప్రతికూలంగా ఉన్నట్టుగా సర్వేలు, నిఘా సంస్థల నివేదికలు చెబుతున్నట్టు టీఆర్‌ఎస్ నేతలు పేర్కొంటున్నారు. రంగారెడ్డిలోనూ పరిస్థితి కొంత ఇబ్బందికరంగానే ఉన్నట్టు చెబుతున్నారు. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సమస్యలను, అవరోధాలను అధిగమించడం పెద్ద కష్టం కాదనే భావనలో టీఆర్‌ఎస్ ముఖ్యులు ఉన్నారు. కానీ ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ను బలోపేతం చేయడమెలా అనేదానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.
నల్లగొండ జిల్లాలో ప్రతిపక్షనేత కె.జానారెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ముఖ్యనేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి వంటివారు కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలుస్తున్నారు. ఈ నేతలు తమ నియోజకవర్గానికే పరిమితం కాకుండా పక్క నియోజకవర్గాల్లోనూ ప్రభావం చూపించే పరిస్థితి ఉంది. ఇక ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనూ ఇదే తరహా పరిస్థితి ఉంది. డి.కె.అరుణ, చిన్నారెడ్డి, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్ వంటివారు కాంగ్రెస్‌లో బలమైన నాయకులుగా ఉండగా.. నాగం జనార్దనరెడ్డి వంటివారు కూడా తోడయ్యారు.
అధికార పార్టీ నేతలున్నా..
ఉమ్మడి మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలోనే అధికార పార్టీకి చెందిన మంత్రులు జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డిలతో పాటు ఎంపీలు జితేందర్‌రెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, బూర నర్సయ్యగౌడ్ వంటి వారు బలంగా ఉన్నారు. మరికొందరు ఎమ్మెల్యేలు కూడా ఉన్నా.. టీఆర్‌ఎస్‌ను అనుకున్న స్థాయిలో విస్తరించలేకపోతున్నారనే నివేదికలు పార్టీ ముఖ్యులను కలవరపెడుతున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి ఇదే పరిస్థితి ఉంటే ఇబ్బందికరంగా ఉంటుందని, దీనిని అధిగమించాలని నిర్ణయించారు. ఈ మేరకు ఈ జిల్లాల్లో పార్టీని బలోపేతం చేసే అవకాశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment