ప్రజల్లోకి వెళదాం!
► అధికార టీఆర్‌ఎస్ కసరత్తు
►ప్రజాక్షేత్రంలో ప్రతిపక్షాలను ఎండగట్టే వ్యూహం
►రైతు సంఘాలు, భూ నిర్వాసితులతో సమావేశాలు
► ప్రాజెక్టులు, భూసేకరణపై వాస్తవాలు చెప్పాలని నిర్ణయం
►సంక్రాంతి తర్వాత సీఎం ‘జనహిత’ కార్యక్రమం
సాక్షి, హైదరాబాద్: ‘‘ప్రతి రాజకీయ పార్టీకి ఐదేళ్ల పదవీ కాలంలో ఒక్క ప్రాజెక్టయినా పూర్తి చేయాలని ఉంటుంది. మేమైనా అంతే. ఒక్కటన్నా పూర్తి చేసి ఎన్నికలకు వెళ్లాలను కుంటుంటే ప్రతిపక్షాలు మాత్రం మా కాళ్లలో కట్టెలు పెడుతున్నాయి. భూసేకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భూసేకరణ జరగకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తాం?’’అని అధికార టీఆర్‌ఎస్‌లోని సీనియర్ నేత, మంత్రి ఇటీవల ప్రశ్నించారు. ఆ నేత మాటలకు తగినట్లుగానే ప్రతిపక్షా లను ప్రజాక్షేత్రంలోనే ఎండగట్టాలని అధికార పార్టీ కృతనిశ్చయంతో ఉంది. ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన భూసేకరణ ప్రభుత్వానికి సవాల్ గా మారింది. భూసేకరణను అడ్డుకునేందుకు ప్రధాన ప్రతిపక్షం నేరుగా 12 కేసులు, పరోక్షంగా మరో 20 కేసులు వెరసి 32 కేసులను వేసిందని మంత్రి హరీశ్‌రావు అసెం బ్లీలో ఆరోపించారు.
ఒకవైపు కాంగ్రెస్, టీడీపీ, మరోవైపు రాజకీయ జేఏసీ ప్రభుత్వ విధానాలను ఎత్తి చూపుతున్నాయి. భూసేక రణకు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన 123 జీఓను హైకోర్టు కూడా ఇటీవల తప్పుబట్టింది. మరోవైపు పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు లేవంటూ చెన్నైలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్‌లో కేసు దాఖలైంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకున్న టీఆర్ ఎస్ నాయకత్వం... ప్రజలకు వాస్తవాలు వివరించాలన్న నిర్ణయానికి వచ్చింది.
నిర్వాసితులతో సమావేశాలు..
సాగునీటి ప్రాజెక్టుల భూసేకరణపై వాస్తవాలను వివరించడం, ప్రతిపక్షాల కుట్రలను భగ్నం చేయడం లక్ష్యంగా రైతు సంఘాలు, భూ నిర్వాసితులతో ఎక్కడికక్కడ సమావేశాలు జరిపేందుకు టీఆర్‌ఎస్ నాయకత్వం ప్రణాళికలు రచిస్తోంది. సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నా ప్రాజెక్టుల నిర్మాణానికి కావాల్సిన భూసేకరణ సమస్యగా మారడం, 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ సాధ్యం కాదని భావించి తెచ్చిన 123 జీవోను వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాలు కోర్టుకెక్కడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
ఈ నేపథ్యంలో భూసేకరణకు అడ్డుపడుతున్న ప్రతిపక్షాలకు ప్రజల్లోనే బుద్ధి చెప్పేలా నిర్వాసితులతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రాజెక్టుల కోసం భూమి ఇవ్వడం ద్వారా ప్రభుత్వం తరఫున చేకూరే లబ్ధి గురించి వివరించనున్నారు. ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యగా ఉన్న ప్రాంతాల్లో సభలు, సమావేశాలు నిర్వహించి అవగాహన కలిగించాలన్న యోచనలో అధికార పార్టీ ఉంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మల్లన్న సాగర్, కాళేశ్వరం ప్రాజెక్టులతోపాటు వివిధ ఇరిగేషన్ ప్రాజెక్టుల ప్రాంతాల్లో ఈ సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రగతి భవన్ లో జనహిత...
సీఎం కేసీఆర్ సంక్రాంతి తర్వాత నేరుగా ప్రజలను కలుసుకునే కార్యక్రమం మొదలు కానుందని టీఆర్‌ఎస్ నేతలు చెబుతున్నారు. కొత్తగా నిర్మించిన సీఎం అధికారిక నివాసం ప్రగతి భవన్ లోనే ‘జనహిత’పేర కార్యక్రమం మొదలవుతుందని, దీనికి సంబంధించి అధినాయకత్వం కసరత్తు చేస్తోందని పార్టీ వర్గాలు చెప్పాయి.