సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘పచ్చ బంధం’ కాంగ్రెస్ పార్టీలో అలజడి సృష్టిస్తోంది. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశంతో జతకట్టే అవకాశాలున్నాయనే సంకేతాలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులను గందరగోళంలో పడేశాయి. మొదటి నుంచి టీడీపీకి కంచుకోటగా నిలుస్తున్న ఈ జిల్లాలో 2014 ఎన్నికల్లోనూ ఆ పార్టీ ఏడు శాసనసభ స్థానాలను గెలుచుకుంది. ఒక ఎంపీ స్థానాన్ని కూడా కైవసం చేసుకొని ప్రతికూల పరిస్థితుల్లోనూ బలాన్ని చాటింది. ఎల్‌బీనగర్, శేరిలింగపల్లి, మహేశ్వరం, ఇబ్రహీంపట్నం, రాజేంద్రనగర్, కూకట్‌పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాలను టీడీపీ కైవసం చేసుకుంది. అధికార పార్టీ కేవలం నాలుగు సీట్లతో సరిపెట్టుకోగా కాంగ్రెస్ రెండు, బీజేపీ ఒక్క స్థానంలోగెలిచాయి. అయితే, రాష్ట్రంలో మారిన రాజకీయ సమీకరణల నేపథ్యంలో టీడీపీ దాదాపుగా కనుమరుగైంది.
ఏడుగురు ఎమ్మెల్యేలలో ఆరుగురు గులాబీ గూటికి చేరగా.. ఎల్‌బీనగర్ శాసనసభ్యుడు ఆర్.కృష్ణయ్య ఆ పార్టీ అధినాయకత్వంతో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మెజార్టీ ప్రజాప్రతినిధులు కారెక్కడంతో తెలుగు తమ్ముళ్లు కూడా వారినే అనుసరించారు. దీంతో ఆ పార్టీ ప్రస్తుతం ఉనికి కోసం పాకులాడుతోంది. ఈ దశలో టీడీపీకి స్నేహ హస్తం చాచడం ఆత్మహత్యా సదృశ్యమేనని కాంగ్రెస్ పార్టీలో ప్రచారం జరుగుతోంది. కాగా, బలీయశక్తిగా అవతరించిన టీఆర్‌ఎస్‌ను ఢీకొనేందుకు టీడీపీ మైత్రి అవసరమని కాంగ్రెస్ అంచనాకొచ్చినట్లు తెలిసింది. ఏఐసీసీ స్థాయిలో ఈ మేరకు ప్రాథమిక చర్చలు జరగాయని, పొత్తుకు ఇరుపార్టీలు దాదాపుగా అంగీకరించాయని కాంగ్రెస్ ముఖ్య నేత ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈ పొత్తు పొడిస్తే ఎవరికి లాభం.. ఎవరికి నష్టం అనే చర్చ పక్కనపెడితే ఆశావహులకు మాత్రం ఈ వార్త కంటిమీద కునుకులేకుండా చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
ఎవరికి ఎసరు తెస్తుందో..?
తెలుగుదేశం పార్టీ దాదాపుగా నిర్వీర్యమైనప్పటికీ చాలా చోట్ల ఆ పార్టీ సంస్థాగతం గా బలంగా ఉంది. ముఖ్యనేతలు పార్టీని వీడినా క్షేత్రస్థాయి కేడర్ మాత్రం ఇంకా అట్టిపెట్టుకునే ఉంది. టీడీపీ బీజేపీతో తెగదెంపులు చేసుకోవడం కూడా కాంగ్రెస్‌కు కలిసివచ్చింది. వాస్తవానికి కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా టీడీపీ ఆవిర్భవించింది. అయితే, రాష్ట్ర విభజన అనంతరం ఆ పార్టీ ఏపీ రాజకీయాలకే పరిమితైంది. అధినేత చంద్రబాబునాయుడు కూడా ఆ రాష్ట్రానికే ప్రాధాన్యమిస్తున్నారు. దీంతో తెలంగాణలో ఆ పార్టీ నామమాత్రంగా తయారైంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడ కాంగ్రెస్‌తో జతకడితే మంచిదనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. ఏన్డీయే కూటమి నుంచి బయటకు రావడం.. భవిష్యత్తులో యూపీఏలో చేరే అవకాశం ఉన్నందున ‘చేయి’ అందిపుచ్చుకోవడం మంచిదేననే భావన టీడీపీలో వ్యక్తమవుతోంది.
పొత్తు చర్చలు ఫలవంతమైతే సీట్ల సర్దుబాటు ఎలా ఉంటుందనే చర్చ తెరపైకి వస్తోంది. గత ఎన్నికల్లో ఏకంగా ఏడు స్థానాల్లో గెలవడం.. అదీ కాంగ్రెస్‌పైనే విజయం సాధించిన నేపథ్యంలో ఇరుపార్టీల మధ్య సీట్ల కేటాయింపు చిక్కుముడిగా మారే ఆస్కారం లేకపోలేదనే ప్రచారం జరుగుతోంది. పొత్తు కుదుర్చుకుంటున్నందున టీడీపీ పట్టుబట్టే మెజార్టీ సీట్లు కూడా ఇక్కడి నుంచే ఉండే అవకాశముంది. కాస్తో కూస్తో బలం ఉన్నది కూడా ఈ జిల్లాలోనే. మరోవైపు కాంగ్రెస్ కూడా ప్రతి సెగ్మెంట్‌లో బలంగా ఉంది. టీఆర్‌ఎస్‌కు ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తుండడంతో ఈ సారి ఎలాగైనా మెజార్టీ స్థానాలు గెలుచుకోవాలని తహతహలాడుతున్న ఆ పార్టీకి తాజా సంకేతాలు కలవరపరుస్తున్నాయి. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, రాజేంద్రనగర్, మేడ్చల్, కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి, మల్కాజ్‌గిరి, ఎల్‌బీనగర్ స్థానాలకు టీడీపీ పట్టుబట్టే అవకాశముంది. దీంతో టీడీపీ–కాంగ్రెస్ పొత్తు ఎవరి సీట్లకు ఎసరు తెస్తుందోననే ఆందోళన ఆశావహుల్లో కనిపిస్తోంది. అయితే, ఈ పొత్తు చర్చలు అంకుర దశలోనే ఉన్నందున ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధినాయకత్వం భరోసా ఇస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment