సాక్షి, హైదరాబాద్: రాజకీయ భవిష్యత్తుపై గంపెడాశతో అధికార పార్టీలో చేరిన పలువురు నేతల పరిస్థితి అయోమయంలో పడింది. ముఖ్యంగా టీఆర్‌ఎస్ సిట్టింగులు ఉన్న నియోజకవర్గాల్లో ఇతర పార్టీల నుంచి వచ్చి చేరినవారు ఆందోళనలో మునిగిపోయారు. ఎన్నికల ఏడాది మొదలైనా.. పోటీ చేసే అవకాశంపై ఇప్పటికీ స్పష్టత రాకపోవడంతో వారు ఎటూ తేల్చుకోలేక సతమతం అవుతున్నారు. పార్టీలో చేరే సందర్భంలో తప్ప ఆ తర్వాత టీఆర్‌ఎస్ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావును కలసి మాట్లాడే అవకాశం రాకపోవడం ఆందోళనను మరింత పెంచుతోంది. అటు ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్‌ఎస్‌లో చేరిన నియోజకవర్గాలకు సంబంధించి.. సొంత పార్టీ నేతల్లోనూ గుబులు మొదలైంది. అలా వచ్చిన ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్ ఇస్తే తమ భవిష్య త్తు ఏమిటని వారు ఆందోళనలో మునిగిపోతున్నా రు. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఉండటంతో అటు ఆశావహులకు, ఇటు టీఆర్‌ఎస్‌కూ ఇబ్బందికర పరిస్థితి నెలకొంది.
అవకాశం దక్కేనా?
సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్లిస్తామని టీఆర్‌ఎస్‌ఎల్పీ అంతర్గత సమావేశాల సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్ చెప్పినట్టు ప్రచారం జరిగింది. దాంతో సిట్టింగులు ఉన్న చోట ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతల్లో గందరగోళం నెలకొంది. ఎన్నికలకు చాలా సమయం ఉన్నప్పుడు భరోసా ఇవ్వకపోతే సిట్టింగుల నుంచి ఇబ్బందులు వస్తాయనే అలాంటి ప్రకటనలు చేయాల్సి వస్తుందని అధిష్టానం పెద్దలు సర్దిచెబుతున్నారు. సీఎం ప్రకటనల వల్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో ధీమా పెరుగుతోందని.. తమకు మాత్రం అవమానాలు ఎదురవుతున్నాయని నేతలు వాపోతున్నారు. పార్టీలో కలసి పనిచేసే పరిస్థితి లేకుండా, పార్టీ శ్రేణులను తమతో మాట్లాడనివ్వకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలు వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇది రాజకీయ వైరాన్ని దాటి.. కొన్నిచోట్ల వ్యక్తిగత వైరం దాకా వచ్చిందంటున్నారు. టీఆర్‌ఎస్‌లో చేరే సమయంలో ఇచ్చిన హామీల విషయంపై సీఎంతో మాట్లాడదామంటే అవకాశం రావడం లేదంటున్నారు. ఏదో సందర్భంలో పార్టీ అధినేతను కలసినా ‘మరోసారి కలుద్దామా?’ అంటూ దాటేసేవిధంగా సమాధానం వస్తోందని, కచ్చితమైన హామీ రావడం లేదని వాపోతున్నారు.
గందరగోళమున్న నియోజకవర్గాల్లో కొన్ని..
- భూపాలపల్లి నియోజకవర్గానికి స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ టీడీపీ నుంచి గండ్ర సత్యనారాయణరావు ఇటీవలే టీఆర్‌ఎస్‌లో చేరారు. తనకు ఎమ్మెల్యే టికెట్ లభిస్తుందనే విశ్వాసంతో టీఆర్‌ఎస్‌లో పనిచేస్తున్నారు.
- మహబూబాబాద్ నియోజకవర్గానికి శంకర్‌నాయక్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన కవిత కొంతకాలం కింద టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ నియోజకవర్గంలో తనకే అవకాశం వస్తుందనే ధీమాతో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.
- రెడ్యానాయక్ డోర్నకల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ తరఫున గెలిచి, తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ లెక్కన టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారు. అయితే అదే నియోజకవర్గంలో గతంలో టీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఓడిపోయిన సత్యవతి రాథోడ్‌కు టికెట్ లభించడంపై సందిగ్ధత నెలకొంది.
- వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా సురేఖ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య.. అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రస్తుతం సారయ్య పరిస్థితి అయోమయంగానే ఉందని.. ఆయనతోపాటు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు కూడా ఇక్కడ అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు.
- స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలో మాజీ ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య టీఆర్‌ఎస్‌కు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి లేదా ఆయన కుటుంబ సభ్యులు పోటీ చేయాలని యోచిస్తున్నారు. ఇదే సమయంలో రాజారపు రమేశ్ కూడా అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారు.
- కోరుట్ల నియోజకవర్గంలో కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన జువ్వాడి నర్సింగరావుకు ఈసారి అవకాశంపై స్పష్టత లేకుండా పోయింది.
- చేవెళ్లలో కాంగ్రెస్ నుంచి గెలిచిన కాలె యాదయ్య అనంతరం టీఆర్‌ఎస్‌లో చేరారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా యాదయ్యకే టికెట్ ఇస్తే.. తన పరిస్థితేమిటని అక్కడ టీఆర్‌ఎస్ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయిన కేఎస్ రత్నం తేల్చుకోవాల్సి ఉండనుంది.
- అచ్చంపేటలో టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా గువ్వల బాలరాజు ఉన్నారు. ఇదే నియోజకవర్గం నుంచి పలుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ మంత్రి పి.రాములు ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరారు. రాములుకు టికెట్ అవకాశం వస్తుందో, రాదో తేలలేదు.
- భువనగిరి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి ఉన్నారు. ఇటీవల టీడీపీ నుంచి మాజీమంత్రి ఉమామాధవరెడ్డి, ఆమె తనయుడు సందీప్‌రెడ్డి టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే వారికి ఎలాంటి అవకాశం వస్తుందన్నది తేలలేదు.
- పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్, ఆయన సోదరుడు మాజీ మంత్రి జి.వినోద్‌కుమార్ ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి అవకాశంపైనా స్పష్టత లేదు. ఇవేకాక మరిన్ని నియోజకవర్గా ల్లోనూ ఇటువంటి పరిస్థితి నెలకొని ఉంది.
ఎటూకాకుండా పోతామా?
తమను చేర్చుకున్న సందర్భంలో ఇచ్చిన ఎమ్మెల్యే టికెట్ హామీపై చివరిదాకా తేల్చకపోతే ఇబ్బందికరంగా ఉంటుందని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు అంటున్నారు. చివరి క్షణంలో తమకు ఇవ్వకుండా సిట్టింగ్‌కే టికెట్ ఇస్తే ప్రత్యామ్నాయ అవకాశాలు లేకుండా.. ఎటూకాకుండా పోతామేమోనన్న ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరిగితే ఇంకా ఏడాది మాత్రమే సమయం ఉంది. ఈ తరుణంలో తమ సం‘గతి’ఏమిటన్నది వీలైనంత త్వరగా తేల్చుకోవాలని కొందరు నేతలు యోచిస్తున్నట్టు తెలుస్తోంది. టికెట్ అవకాశం ఉండదనే సంకేతాలు వస్తే కనీసం ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్న ధోరణిలో కొందరు నేతలు ఉన్నట్టు సమాచారం. అయితే పార్టీ అధినేత కేసీఆర్‌పై విశ్వాసముందని, అవకాశం ఇచ్చేదాకా వేచిచూడాలని మరికొందరు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడం వీలుకాకపోతే.. అధికారంలో ఉన్నప్పుడే ఏదో ఒక అవకాశమిస్తే చాలు, పని చేసుకుంటామన్న ధోరణిలో మరికొందరు ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment