బాబుపై బాబుమోహన్ గుస్సా
మాజీ మంత్రి టిడిపి సీనియర్ నేత బాబూమోహన్‌కు అధినేత చంద్రబాబుపై కోపమొచ్చింది. సీరియస్‌నెస్ లేకుండా చంద్రబాబు కామెడీ చేసి తెలుగువారి జీవితాలతో ఆడుకోవడమే బాబుమోహన్ కోపానికి కారణమట. రెండుకళ్లు, కొబ్బరి చిప్పలు, చింత పిక్కలంటూ చంద్రబాబు తన స్థాయిని మరిచి మాట్లాడటం ఆయనకు రుచించలేదని మెదక్ జిల్లా పచ్చ తమ్ముళ్లు గుసగుసలాడుకుంటున్నారు. బాబు అనుసరిస్తున్న అర్థం పర్థం లేని అస్పష్టవైఖరి వల్లే సైకిల్ స్పీడు తగ్గిందని గ్రహించిన బాబూ మోహన్ త్వరలోనే కారు ఎక్కబోతున్నారు.
విలక్షణ కామెడీతో ప్రేక్షకులపై బలమైన ముద్ర వేసిన నటుడు బాబుమోహన్. టిఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర్‌రావు టిడిపిలో ఉన్నప్పుడు ఆయన చొరవతో రాజకీయాల్లోకి వచ్చిన బాబుమోహన్ 1999లో మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ సమయంలో బాబుమోహన్ గెలుపులో కెసిఆర్‌ది కూడా ప్రధాన పాత్రే. టిడిపి అధినేత చంద్రబాబుతో విభేదించి కెసిఆర్ బైటికి పోయినప్పటికీ బాబూమోహన్, కెసిఆర్‌ల మధ్యన స్నేహం మాత్రం అలాగే ఉంది.
విభజనపై స్పష్టమైన వైఖరి తీసుకోకుండా తెలుగు ప్రజల జీవితాల్లో అయోమయం సృష్టిస్తూ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చంద్రబాబు ప్రయత్నించడం బాబూమోహన్‌ను తీవ్రంగా కలచివేసినట్టు సమాచారం. చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతం, కొబ్బరి చిప్పల వేదాంతంతో తనను మించిపోయి కామెడీ చేస్తుండటమే బాబూమోహన్ ఆవేదనకు కారణమట.
చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతంతో సైకిల్ స్పీడు తగ్గిందని...రాను రాను మరిన్ని గడ్డు పరిస్థితులు వస్తాయని భావిస్తున్న బాబూమోహన్ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకునేందుకు త్వరలో కారు ఎక్కుతారని సమాచారం. చాలా కాలంగా మెదక్ జిల్లా ఆందోల్ నియోజవర్గం టిఆర్‌ఎస్ ఇంచార్జి పదవి ఖాళీగా ఉండటం కూడా బాబూమోహన్ రాకకోసమేనని వినికిడి.
టిఆర్‌ఎస్‌ను దళితులు వీడుతున్నారనే ప్రచారం తప్పని చెప్పడానికి కూడా మాజీ మంత్రి బాబూమోహన్ చేరిక ఉపయోగపడుతుందని గులాబీ నేతలు భావిస్తున్నారట. కాంగ్రెస్‌లో టిఆర్‌ఎస్ విలీనం జరిగినా, పొత్తుగానీ పెట్టుకున్నా అప్పుడు ఆందోల్ సీటు బాబూమోహన్‌కు దక్కదు. అలాంటి పరిస్థితే వస్తే భవిష్యత్‌లో ఎమ్మెల్సీ సీటైనా దక్కించుకొని రాజకీయ భవిష్యత్‌ను సుస్థిరం చేసుకోవాలనేది బాబూమోహన్ ఆలోచన అని ఆయన అనుచరులు చెప్పుకొంటున్నారు.