బాబూమోహన్
జోగిపేట, న్యూస్‌లైన్: ‘‘అసలు అందోల్ ఏం జరుగుతోంది...ఎందుకని పార్టీ తరఫున స్థానిక సంస్థలకు పోటీ చేసేందుకు ఎవరూ రావడం లేదు..ఇంతకీ అందోల్‌లో మనం ఉన్నామా...ఉన్నామని భ్రమపడుతున్నామా’’ టీడీపీ నేతలకు వచ్చిన అనుమానమిది. దీంతో ఆ పార్టీ నేతలు కార్యకర్తల నుంచి వివరాలు రాబడుతున్నారు.
ఇంతకీ ఏం జరుగుతుందంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. అయితే తముళ్లు మాత్రం ‘‘మా తప్పేమీ లేదు..అంతా మీరే చేశారు’’ అంటూ నేతల మొహంమీదే చెప్పేస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పి.బాబూమోహన్ వల్లే పార్టీ పరిస్థితి ఇలా తయారైందని విన్నవిస్తున్నారు. దీంతో టీడీపీ ముఖ్య నేతలు ఇదే విషయాన్ని అధినేత చంద్రబాబుకు తెలపగా, ఆయన బాబూమోహన్ వ్యవహార శైలిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
సపాన్‌దేవ్ సమీక్ష
అందోల్ నియోజకవర్గ పరిస్థితులపై ఆరా తీసేందుకు పార్టీ అధిష్టానం టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సపాన్‌దేవ్‌ను ఆదేశించింది. దీంతో శనివారం ఆయన నియోజకవర్గంలోని టీడీపీ మండల అధ్యక్షులు ముఖ్యులను పిలిపించి మాట్లాడినట్లు తెలిసింది. అందోల్, పుల్కల్ మండలాల అధ్యక్షులు మినహా అన్ని మండలాల అధ్యక్షులు సమావేశంలో పాల్గొని బాబూమోహన్‌పై ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
మరోవైపు టీడీపీ జిల్లా ఇన్‌చార్జిగా ఉన్న మాజీమంత్రి మండవ వెంకటేశ్వరరావుసైతం పరిస్థితిని చక్కదిద్దే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే ఆయన, జెడ్పీటీసీ స్థానాలకు నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులకు ఫోన్‌చేసి మరీ ఆదివారం పార్టీ మీకే ‘బీ’ ఫారం ఇస్తుందని చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ పరిస్థితుల్లోనే అందోలు నియోజకవర్గానికి సంబంధించిన పార్టీ వ్యవహారాలపై ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో సమీక్ష నిర్వహిస్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి హాజరు కావాల్సిందిగా అందోల్ ముఖ్యనేతలతోపాటు జహీరాబాద్ పార్లమెంట్ ఇన్‌చార్జి మదన్‌మోహన్‌కు సైతం పార్టీ అగ్రనేతలు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది..బాబూమోహన్ భవిష్యత్ ఎలా ఉండబోతోంది అన్నది తేలనుంది.