‘టీడీపీలో శ్మశాన వైరాగ్యం అలుముకుంది. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుచేసినా...ఓటమి కళ్లెదుటే కనపడుతుండటంతో కలవరపడుతున్నారు. సొమ్ము.. పరువు పోయి పరాభవం మాత్రం దక్కుతోందని బోరుమంటున్నారు. లోపల శ్మశాన వైరాగ్యంతో విషాదగీతం పాడుకుంటున్నా...పైకి మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు.. ఊరంతా ఒక ఎత్తయితే...ఉలికిపిట్టది మరోదారి అన్నట్లు...రాష్ట్రమంతా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తుందని చెబుతుంటే...చంద్రబాబు అండ్ కో మాత్రం టీడీపీ అధికారంలోకి వస్తుందని చెబుతున్నారు. దీంతో బెట్టింగ్‌రాయుళ్లు గందరగోళంలో పడ్డారు. ఎవరి మాటలు నమ్మాలి.. ఎలా పందెం కాయాలో అని తికమక పడుతున్నారు.
సాక్షి, కడప: జనం కొట్టిన ఓటుదెబ్బకు దిమ్మతిరిగిపోయిన టీడీపీ నేతలు నైరాశ్యంలో మునిగిపోయారు. ఎన్నికల్లో ఖర్చుచేసిన కోట్ల రూపాయలను తలుచుకుని కుమలిపోతున్నారు. ఏకపక్షంగా జరిగిన పోలింగ్‌తో తాము మూడోసారి ప్రతిపక్షంలో కూర్చోవాల్సి ఉండటంతో తలలు పట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో ఒక్కస్థానం అయినా దక్కుతుందానని ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో పది అసెంబ్లీ, 2 పార్లమెంట్ స్థానాలకు సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఓటర్లు డబ్బులకు ప్రలోభపడతారని డబ్బున్న వారికే టిక్కెట్లు ఇవ్వాలని చంద్రబాబు భావించారు. తాను చెప్పిన వారికి టిక్కెట్లు ఇస్తే జిల్లాలో పదింటిలో 8 స్థానాలు గెలుస్తామని సీఎం రమేష్ చంద్రబాబుకు భరోసా ఇచ్చారు. పలు సందర్భాల్లో మీడియాతో కూడా ఇదే చెప్పారు.
గట్టిగా ప్రయత్నిస్తే కనీసం 3స్థానాలైనా దక్కుతాయని తెలుగుతమ్ముళ్లు భావించారు. ఈ ఫలితాలు రాబట్టుకునేందుకు గట్టి ప్రయత్నమే చేశారు. విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేశారు. ముఖ్యంగా మైదుకూరు, రాజంపేటలో ఓటుకు వెయ్యిరూపాయల చొప్పున పంపిణీ చేశారు. అవసరమైతే 1500-2వేల వరకూ ఖర్చు చేశారు. దీంతోపాటు స్థానిక నాయకుల కొనుగోలు...ఇతర ఖర్చులకు భారీగానే ఖర్చు చేశారు. ప్రొద్దుటూరు, జమ్మలమడుగులో కూడా డబ్బులు విరివిగా ఖర్చు చేశారు. ఇలా ఎన్నికల కోసం టీడీపీ నేతలంతా కలిసి 300 కోట్ల రూపాయలదాకా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. అయినా ఒక్కస్థానంలో కూడా విజయం దక్కే సూచనలు కన్పించకపోవడంతో ఖర్చయిపోయిన డబ్బులు తలుచుకుని కుమిలిపోతున్నారు.
ఇప్పటికీ గెలుస్తామనే ధీమా:
మైదుకూరు నియోజకవర్గంలో తనకు సహకరించినందుకు డీఎల్ రవీంద్రారెడ్డికి పుట్టా సుధాకర్‌యాదవ్ కృత జ్ఞతలు తెలిపారు. తాను కచ్చితంగా ఎన్నికల్లో గెలవబోతున్నానని డీఎల్‌కు చెప్పారు. అయితే డీఎల్ మాత్రం ‘పుట్టా చెబుతున్నాడు...కానీ రఘురామిరెడ్డి గెలవబోతున్నాడు. ఓటింగ్ ‘ఫ్యాన్’కు అనుకూలంగా జరిగిందని పుట్టా వెళ్లిపోయిన తర్వాత అనుచరులతో చెప్పినట్లు తెలిసింది.
పుట్టా ఇంట్లో మాత్రం డబ్బులు ఖర్చయిపోవడం గురించి పెద్ద గొడవే జరుగుతున్నట్లు తెలుస్తోంది. అలాగే మేడా మల్లికార్జునరెడ్డి కూడా తనను డబ్బు గెలిపిస్తుందనే ధీమాతో పైకి కన్పిస్తున్నారు. లోన మాత్రం డబ్బు పోయినందుకు కుమిలిపోతూనే దాన్ని రాబట్టుకునేందుకు అనుచరులతో వైఎస్సార్‌సీపీ విజయావకాశాలపై భారీగా పందెం కాసినట్లు తెలుస్తోంది. కమలాపురంలో విజయం మాదే అని బీరాలు పలికిన పుత్తా నరసింహారెడ్డి కూడా చల్లబడిపోయారు.
డబ్బులు పోయినందుకు బాధపడకపోయినా ముచ్చటగా మూడోసారి ఓడిపోతే నియోజకవర్గంలో పరువు పోతుందని వేదనపడుతున్నారు. తన గెలుపు సంగతి పక్కనపెట్టి రవీంద్రనాథరెడ్డి మెజార్టీపై పందేలు కాస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి వస్తే...ఎమ్మెల్యే పదవితో పాటు ఉద్యోగం పోతున్నదని, ఫలితాల తర్వాత తనను పలకరించేవారు కూడా ఉండరేమోనని విజయజ్యోతి మథనపడుతోంది. జమ్మలమడుగులో రామసుబ్బారెడ్డి కూడా తన ఓటమిపై ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది. రమేష్‌రెడ్డి మాత్రం ఏదోఒక బలమైన పార్టీలో ఉండాలనే ఉద్దేశంతోనే టీడీపీలో చేరానని ఓటమి తనకు ముందే తెలుసనే ధోరణిలో ఉన్నారు.
బెట్టింగ్ రాయుళ్లలో గందరగోళం
నూటికి వెయ్యిశాతం ప్రభుత్వం మాదే అని చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు బెట్టింగ్‌రాయుళ్లలో గందరగోళాన్ని సృష్టించాయి. కేసీఆర్‌తో సహా అంతా జగన్ సీఎం కాబోతున్నారని చె బితే బాబు మాత్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడంపై అయోమయంలో పడ్డారు. కొందరు నిజంగా బాబు మాటలు నమ్మి టీడీపీ అభ్యర్థుల విజయంపై కోట్ల రూపాయల పందేలు కాస్తున్నారు. ఫలితాలు వచ్చిన తర్వాత ‘బాబు’ మాటలు నమ్మి పందేలు కాసినవారు కూడా నిండా మునిగిపోయే ప్రమాదముందని తెలుస్తోంది.
శ్మశాన వైరాగ్యం...!
Published Sat, May 10 2014 1:56 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement