ఐదుగురు టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో గుబులు | No Tickets in next elections Sitting MLAs in Anantapur TDP leaders | Sakshi
Sakshi News home page

ఐదుగురు టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలలో గుబులు

Published Sun, Feb 25 2018 12:27 PM | Last Updated on Fri, Aug 10 2018 9:42 PM

No Tickets in next elections Sitting MLAs in Anantapur TDP leaders - Sakshi

సార్వత్రిక ఎన్నికలకు ఏడాది ముందే టీడీపీలో టిక్కెట్ల లొల్లి మొదలైంది. ఐదుగురు సిట్టింగ్‌లకు టిక్కెట్లు ఇవ్వకూడదని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారని కొన్ని నెలలుగా ఆ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. ఆ దిశగా అధిష్టానం తొలి పావు కదిపింది. శింగనమల టిక్కెట్‌ హామీతో మంత్రి కాలవ శ్రీనివాసులు ఎమ్మార్పీఎస్‌ నాయకుడు ఎంఎస్‌ రాజును టీడీపీలో చేర్పించడం  చర్చనీయాంశంగా మారింది. ఈ నిర్ణయంపై విప్‌ యామినీబాల.. ఆమె తల్లి, ఎమ్మెల్సీ శమంతకమణి ఒంటి కాలిపై లేస్తున్నారు. శింగనమల పరిణామంతో మిగిలిన నలుగురు సిట్టింగ్‌లలోనూ వణుకు మొదలైందని సమాచారం.

సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లాలో గత ఎన్నికల్లో రెండు ఎంపీ, 12 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఎన్నికల తర్వాత వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే చాంద్‌బాషా టీడీపీలో చేరారు. వీరిలో ఐదుగురు సిట్టింగ్‌లకు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వకూడదని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుందనే ప్రచారం కొద్దినెలలుగా సాగుతోంది. ఈ క్రమంలో ఎమ్మార్పీఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎంఎస్‌ రాజును మంత్రి కాలవ శ్రీనివాసులు అమరావతిలో చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేర్పించారు. శింగనమల టిక్కెట్టు రాజుకు ఇప్పిస్తానని కాలవ హామీ ఇచ్చి పార్టీలో చేర్పించినట్లు ఆ పార్టీలోని కీలక ఎమ్మెల్యే ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.

ఈ చేరికపై శింగనమల ఎమ్మెల్యే, విప్‌ యామినీబాల.. ఎమ్మెల్సీ శమంతకమణి తీవ్రస్థాయిలో స్పందించినట్లు తెలిసింది. మంత్రులు దేవినేని ఉమామహేశ్వరావుతో పాటు కాలవ శ్రీనివాసులను గట్టిగా నిలదీసినట్లు సమాచారం. ఎంఎస్‌ రాజు వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడని, అలాంటి వ్యక్తిని చంద్రబాబు సమక్షంలో చేర్పించడం వెనుక ఉద్దేశం ఏంటని ప్రశ్నించినట్లు తెలిసింది. పైగా శింగనమల టిక్కెట్టు ఇప్పిస్తామని మాట ఇచ్చారంట? మాకంటే రాజుకు ఉన్న స్థాయి ఏమిటి? అసలు రాజు గురించి మీకు పూర్తిగా తెలుసా? అని అడిగినట్లు చర్చ జరుగుతోంది.

రాజు చరిత్ర ఏంటో వివరంగా ఓ నివేదికను మీకు పంపిస్తామని, పార్టీ కూడా విచారించాలని, స్వతంత్రంగా అనంతపురంలో ఓ వార్డు మెంబర్‌గా కానీ, లేదా శింగనమల నియోజకవర్గంలోని ఓ పంచాయతీ నుంచి సర్పంచ్‌గా గెలుస్తారని కానీ మీకు అనిపిస్తే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటామని వారు గట్టిగా చెప్పినట్లు తెలుస్తోంది. అయితే టిక్కెట్టు విషయాలు తమకేమీ తెలియదని, పార్టీలో కలిసి పనిచేసేందుకు ఎవరు వచ్చినా చేర్పించే బాధ్యత తమపై ఉందని వారు శమంతకమణి, యామినీబాలకు చెప్పినట్లు సమాచారం. మీకేదైనా సందేహాలుంటే ముఖ్యమంత్రితో మాట్లాడాలని సూచించినట్లు తెలుస్తోంది.

ఆ నలుగురిలో అలజడి
అనంతపురం ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరికి టిక్కెట్టు ఇవ్వకుండా మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి, ఎస్‌ఆర్‌ కన్‌స్ట్రక్షన్స్‌ అధినేత అమిలేని సురేంద్రబాబులో ఒకరికి టిక్కెట్టు ఇవ్వాలని టీడీపీలోని ఓ వర్గం పట్టుబట్టినట్లు తెలిసింది. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి కూడా అనంతపురం టిక్కెట్టు కచ్చితంగా మార్చాలని ముఖ్యమంత్రితో గట్టిగా చెప్పినట్లు సమాచారం. కొత్త అభ్యర్థి ఎవరు అనే సంగతి పక్కనపెడితే చౌదరిని మార్చడం ఖాయమని టీడీపీలో చర్చ నడుస్తోంది.

కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరికి వయసైపోయింది. వచ్చే ఎన్నికల్లో ఆయన కుమారుడు మారుతి.. లేదంటే కోడలు వరలక్ష్మికి టిక్కెట్టు వస్తుందని చౌదరి ఆశిస్తున్నారు. అయితే వారిపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, అవినీతి ఆరోపణలు కూడా తీవ్రంగా ఉన్నాయనే కారణంతో బెళుగుప్పకు చెందిన ఉమామహేశ్వరావుకు టిక్కెట్టు ఇప్పించాలని టీడీపీలోని ఓ కీలక ప్రజాప్రతినిధి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.

గుంతకల్లు ఎమ్మెల్యే జితేంద్రగౌడ్‌కు టిక్కెట్టు దక్కే పరిస్థితి లేదని సమాచారం. గుంతకల్లు నుంచి మంత్రి కాలవ శ్రీనివాసులు పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

ఇక పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె రఘునాథరెడ్డికి కూడా టిక్కెట్టు దక్కదనే ప్రచారం ఉంది. అయితే సామాజికవర్గ సమీకరణాలు బేరీజు వేస్తే తనకు టిక్కెట్టు ఖాయమనే ఆలోచనలో పల్లె ఉన్నారు.

కాలవపై గుర్రు
అనంతపురం, శింగనమల, గుంతకల్లు, కళ్యాణదుర్గంతో పాటు పుట్టపర్తిలో సిట్టింగ్‌లను మారుస్తారనే ప్రచారం టీడీపీలో సాగుతోంది. రాజు చేరిక శింగనమలలో అలజడి రేపగా.. తక్కిన నాలుగు స్థానాల్లోని అభ్యర్థుల్లోనూ ఆందోళన నెలకొంది. ఇన్‌చార్జ్‌ మంత్రితో పాటు అధిష్టానంతో మాట్లాడి, పార్టీ నిర్ణయం అదే అయితే ప్రత్యామ్నాయం చూసుకోవడం మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి కాలవ శ్రీనివాసులు ఈ విషయాల్లో సీఎంకు తప్పుడు సమాచారం అందిస్తున్నారని, వీరంతా ఆయనపై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద శింగనమల విషయంలో రేగిన చిచ్చు టీడీపీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాల్సిందే.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement