- ‘మోడల్ స్కూళ్ల’ పథకాన్ని రాష్ట్రాలే నిర్వహించుకోవాలని కేంద్రం సూచన
- ఇప్పటికే నిధులు కేటాయించిన పాఠశాలల పనులపై స్పష్టత ఇవ్వని వైనం
- నిధులరాకపై అనుమానం
- అయోమయంలో ఆరు మోడల్ స్కూళ్లు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: మాధ్యమిక విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది.
దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం అమల్లోకి తెచ్చిన ఈ పథకాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి తేల్చిచెప్పారు. ఈ పథకం కింద కొనసాగుతున్న ఆదర్శ పాఠశాలల నిర్వహణ సంగతి అటుంచితే.. ఇప్పటికే మంజూరై నిర్మాణాలకు నోచుకోని మోడల్ స్కూళ్ల పరిస్థితి అయోమయంలో పడింది.
ఆర్‌ఎంఎస్‌ఏ పథకంలో భాగంగా జిల్లాకు 25 ఆదర్శ పాఠశాలలు మంజూరయ్యాయి. జిల్లాలో 37 మండలాలుండగా.. విద్య పరంగా వెనకబడిన ప్రాంతాలను గుర్తిస్తూ 25 మండలాలను ఎంపిక చేయగా.. వాటికి కేంద్ర ప్రభుత్వం 2010-11లో తొలివిడత కింద 19 పాఠశాలలు మంజూరు చేసింది. ప్రస్తుతం వీటి నిర్మాణ పనులు దాదాపు పూర్తికాగా.. 2012 -13 వార్షిక సంవత్సరంలో మంజూరైన ఆరు పాఠశాలలపై సందిగ్ధం నెలకొంది. తాజాగా ఆర్‌ఎంఎస్‌ఏ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకోవాలని సూచించింది. అయితే ఇప్పటికే మంజూరుచేసి నిధులు విడుదల చేయని వాటిపై స్పందించకపోవడంతో వాటి పురోగతి ప్రశ్నార్థకంగా మారింది.
రూ.19.32 కోట్ల సంగతేంటి?
ఆర్‌ఎంఎస్‌ఏ రెండో విడతలో వికారాబాద్, మొయినాబాద్, దోమ, యాలాల, ధారూరు, మోమీన్‌పేట మండలాలకు ఆదర్శ పాఠశాలలు మంజూరయ్యాయి. ఒక్కో పాఠశాలకు రూ.3.2 కోట్ల చొప్పున మొత్తం రూ.19.2 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో అధికారులు కాంట్రాక్టర్లను సైతం ఎంపిక చేసి పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం నిధుల విడుదలపై తాత్సారం చేసింది.
ఫలితంగా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో వీటి నిర్మాణాల సంగతి సందిగ్ధంలో పడింది. వాస్తవానికి 2012- 13 సంవత్సరంలో పనులు మంజూరు చేసినందున కేంద్ర ప్రభుత్వమే నిధులివ్వాలి. కానీ అప్పట్లో నిధులు విడుదల చేయకపోగా.. ప్రస్తుతం పథకాన్ని వదిలించుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపితే తప్ప నిర్మాణాల ప్రక్రియ కొలిక్కి రావడం కష్టమే.
మోడల్ స్కూళ్ల భారం మీదే!
Published Sat, Mar 7 2015 2:45 AM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM
Advertisement
Advertisement