
న్యూఢిల్లీ: 2026 నుంచి ఏడాదిలో రెండుసార్లు పదో తరగతి బోర్డు పరీక్షలను నిర్వహించాలన్న ప్రతిపాదనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ)ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ఆన్‌లైన్‌లో ఉంచనుంది. దీనిపై మార్చి 9వ తేదీ వరకు సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు, సూచనలు సలహాలను అందివ్వవచ్చని అధికారులు వివరించారు. అనంతరం ఈ విధానం ఆమోదం పొందుతుందని తెలిపారు.
ఇక, ప్రతిపాదనలు అనుసరించి.. పదో తరగతి మొదటి దశ పరీక్షలు ఏటా ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6వ తేదీ వరకు, రెండో దశ పరీక్షలు మే 5 నుంచి 20వ తేదీల మధ్య జరగనున్నాయి. ‘రెండు దశల పరీక్షల్లోనూ సిలబస్ పూర్తి స్థాయిలో ఉంటుంది. అభ్యర్థులు రెండు దశల్లోనూ ఒకే కేంద్రంలో పరీక్ష రాస్తారు. దరఖాస్తు సమయంలో రెండింటికి కలిపి ఫీజును చెల్లించాలి. ఇవి సప్లిమెంటరీ పరీక్షలుగా కూడా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుగా ప్రత్యేకంగా పరీక్షలను నిర్వహించబోం’అని అధికారులు వివరించారు. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలంటే ప్రజల్లో నెలకొన్న తీవ్రమైన ఉత్కంఠను తొలగించాలన్న నూతన విద్యా విధానాన్ని అనుసరించి ఈ విధానాన్ని ప్రతిపాదించినట్లు సీబీఎస్‌ఈ వర్గాలు తెలిపాయి.