సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పథకంలో భాగంగా తలపెట్టిన ఆదర్శ పాఠశాలల లక్ష్యం గాడి తప్పింది. ఆంగ్ల మాధ్యమంలో ఉచిత వసతితో కూడిన బోధన అందించడం ఈ పాఠశాలల ముఖ్యోద్దేశం. ఇవి ప్రారంభమై ఐదేళ్లు కావస్తున్నా.. విద్యార్థులకు మాత్రం వసతి కల్పించకుండా.. కేవలం రోజువారీగా పాఠ్యాంశ బోధన (డే స్కాలర్)తో సరిపెడుతున్నారు. జూన్ రెండో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల వసతిపై సర్కారు ఇప్పటివరకూ ఊసెత్తలేదు. దీంతో ఈ ఏడాది కూడా విద్యార్థులకు హాస్టల్ వసతి మిథ్యేనని తెలుస్తోంది.
పన్నెండు పాఠశాలలే..
విద్యాపరంగా వెనకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వం మండలానికో ఆదర్శ పాఠశాలను మంజూరు చేసింది. రెండు విడతల్లో 25 పాఠశాలలు మంజూరయ్యాయి. ఇందులో తొలివిడతగా 19 పాఠశాలలు మంజూరు కాగా.. అందులోనూ కేవలం 12 పాఠశాలలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, శంషాబాద్, చేవెళ్ల, మర్పల్లి, బంట్వారం, నవాబుపేట్, గండేడ్, కుల్కచర్ల, పూడూరు మండలాల్లో ఈ పాఠశాలలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వీటిలో రోజువారీగా విద్యార్థులు తర గతులకు హాజరవుతున్నారు. వాస్తవానికి వసతితో కూడిన విద్యనందించేలా వీటి స్థాపన జరిగినప్పటికీ.. హాస్టల్ భవన నిర్మాణాలు సైతం ఇప్పటికీ పూర్తికాలేదు. దీంతో ఆదర్శ పాఠశాలలు లక్ష్యం కుదేలయింది.
కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం
పాఠశాల భవనాలు నిర్మిస్తున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. ‘ఆదర్శ’ విద్యార్థులకు శాపంగా మారింది. పాఠశాలల నిర్మాణం మొదలై ఐదేళ్లు పూర్తయింది. కానీ ఆ భవనాల నిర్మాణాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం 19 పాఠశాలలకుగాను 12 పాఠశాలలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇందులో ఇప్పటివరకు ఐదు పాఠశాలల్లోనే హాస్టల్ భవనాలు పూర్తి చేసినట్లు టీఎస్‌ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, శంషాబాద్ మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో వసతి గృహాల నిర్మాణ పనులు కొలిక్కివచ్చాయి.
మిగతా ఏడు పాఠశాలల్లో నిర్మాణాలు ఇప్పటికిప్పుడు పూర్తయ్యేలా లేవు.కేవలం భవన నిర్మాణాల పూర్తితో హాస్టళ్లు కొనసాగించే వీలు లేదు. హాస్టళ్లలో వార్డెన్‌తో సహా ఇతర కేటగిరీలకు సంబంధించి ఉద్యోగులను నియమించాలి. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఈ వసతిగృహాల అంశాన్ని ప్రస్తావించడం లేదు. మరోవైపు ఆర్‌ఎమ్‌ఎస్‌ఏ పథకంపై కేంద్ర సర్కారు చేతులెత్తేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా నిర్వహించాల్సి ఉంది. కానీ సర్కారు వసతిగృహాల నిర్వహణపై నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ ఏడాది ఆదర్శ విద్యార్థులకు వసతి కలగానే మిగలనుంది.
‘ఆదర్శ’ విద్య.. వసతి మిథ్య
Published Mon, May 25 2015 11:41 PM | Last Updated on Wed, Apr 3 2019 8:07 PM
Advertisement