Ideal Schools
-
భోజనం నాణ్యత విషయంలో రాజీ లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలలో విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని, ఎక్కడైనా మెనూ సక్రమంగా అమలు కావడం లేదని ఫిర్యాదు వస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం అధికారులతో మాట్లాడుతూ.. ఇటీవల కొన్నిచోట్ల వస్తున్న ఫిర్యాదులను ఉన్నతాధికారులు పరిశీలించి నివేదిక అందించాలని కోరారు. భోజనం బిల్లులు రాలేదని కొందరు చెబుతున్నారని.. వాటిని సకాలంలో పోర్టల్‌లో ఎందుకు పొందుపరచలేకపోయారని ప్రశ్నించారు. అన్ని జిల్లాల్లో బకాయిల వివరాలను వెంటనే పోర్టల్‌లో పొందుపరిచి నివేదిక ఇవ్వాలన్నారు. త్వరలోనే వాటిని మంజూరు చేయించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రకాశం జిల్లా దర్శి, కడప జిల్లా కాజీపేట పాఠశాలల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో తక్షణమే నివేదికివ్వాలని ఆదేశించారు. కొన్నిచోట్ల టీచర్ల మధ్య అంతర్గత విభేదాలతో అసత్య కథనాలు బయటకు వస్తున్నాయని, ఇలాంటి వివాదాలకు కారణమైన టీచర్లపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీల పర్యవేక్షణకు అధికారులతో త్వరలో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. -
ఆదర్శ పాఠశాలల గుర్తింపు ఇలా..!
మచిలీపట్నం (చిలకలపూడి) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా గుర్తించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందని డీఈవో కె. నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. పంచాయతీలు, మునిసిపాల్టీలను ఒక యూనిట్‌గా తీసుకుని పంచాయతీ, మునిసిపాల్టీల్లో ప్రాథమిక పాఠశాలలో ఒక ప్రాథమిక పాఠశాలను మెయిన్ పాఠశాలగా గుర్తించాల్సి ఉంటుందన్నారు. గుర్తించిన పాఠశాలకు ఒక కిలోమీటరు లోపు 30 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలను గుర్తించాలని చెప్పారు. ఒక కిలో మీటరు లోపు 30 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులను మెయిన్ పాఠశాలలోని విద్యార్థులతో కలిపితే విద్యార్థుల సంఖ్య 80 కంటే ఎక్కువ ఉండాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల సంఖ్యను ఆధార్ నమోదు ప్రక్రియ ద్వారా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అలా గుర్తించిన పాఠశాలలను భవిష్యత్‌లో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టే విధంగా ఉండాల్సి ఉంటుందన్నారు. ఈ పాఠశాలలో కూడా కనీసం నాలుగు తరగతి గదులు ఉండాలని చెప్పారు. అలా గుర్తించిన పాఠశాలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారని వివరించారు. వీటికి మినహాయింపు అయితే 30 మందిలోపు విద్యార్థుల సంఖ్య కలిగి పంచాయతీ, మునిసిపాల్టీల్లో ఒకే ఒక్క ప్రాథమిక పాఠశాల ఉంటే మినహాయింపు ఉంటుంది. అలాగే 30 మంది విద్యార్థుల్లోపు ఉన్న పాఠశాలకు ఒక కిలోమీటరు లోబడి జాతీయ రహదారి, కాలువలు, రైల్వేట్రాక్‌లు అడ్డంకులు ఉంటే వాటికి కూడా మినహాయింపు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 30 మంది విద్యార్థుల్లోపు ఉన్న పాఠశాలలకు మినహాయింపు ఉంటుంది. మైనర్, మీడియం పాఠశాలలకు కూడా మినహాయింపు ఇవ్వాలని మార్గదర్శకాల్లో రూపొందించారు. ఈ మార్గదర్శకాల ద్వారా జిల్లాలోని ఆదర్శ పాఠశాలలను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని డీఈవో వివరించారు. -
‘ఆదర్శ’ విద్య.. వసతి మిథ్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా : రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ పథకంలో భాగంగా తలపెట్టిన ఆదర్శ పాఠశాలల లక్ష్యం గాడి తప్పింది. ఆంగ్ల మాధ్యమంలో ఉచిత వసతితో కూడిన బోధన అందించడం ఈ పాఠశాలల ముఖ్యోద్దేశం. ఇవి ప్రారంభమై ఐదేళ్లు కావస్తున్నా.. విద్యార్థులకు మాత్రం వసతి కల్పించకుండా.. కేవలం రోజువారీగా పాఠ్యాంశ బోధన (డే స్కాలర్)తో సరిపెడుతున్నారు. జూన్ రెండో వారంలో పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదర్శ పాఠశాలల్లో విద్యార్థుల వసతిపై సర్కారు ఇప్పటివరకూ ఊసెత్తలేదు. దీంతో ఈ ఏడాది కూడా విద్యార్థులకు హాస్టల్ వసతి మిథ్యేనని తెలుస్తోంది. పన్నెండు పాఠశాలలే.. విద్యాపరంగా వెనకబడిన ప్రాంతాల్లో ప్రభుత్వం మండలానికో ఆదర్శ పాఠశాలను మంజూరు చేసింది. రెండు విడతల్లో 25 పాఠశాలలు మంజూరయ్యాయి. ఇందులో తొలివిడతగా 19 పాఠశాలలు మంజూరు కాగా.. అందులోనూ కేవలం 12 పాఠశాలలు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, శంషాబాద్, చేవెళ్ల, మర్పల్లి, బంట్వారం, నవాబుపేట్, గండేడ్, కుల్కచర్ల, పూడూరు మండలాల్లో ఈ పాఠశాలలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. వీటిలో రోజువారీగా విద్యార్థులు తర గతులకు హాజరవుతున్నారు. వాస్తవానికి వసతితో కూడిన విద్యనందించేలా వీటి స్థాపన జరిగినప్పటికీ.. హాస్టల్ భవన నిర్మాణాలు సైతం ఇప్పటికీ పూర్తికాలేదు. దీంతో ఆదర్శ పాఠశాలలు లక్ష్యం కుదేలయింది. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. విద్యార్థులకు శాపం పాఠశాల భవనాలు నిర్మిస్తున్న కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం.. ‘ఆదర్శ’ విద్యార్థులకు శాపంగా మారింది. పాఠశాలల నిర్మాణం మొదలై ఐదేళ్లు పూర్తయింది. కానీ ఆ భవనాల నిర్మాణాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం 19 పాఠశాలలకుగాను 12 పాఠశాలలు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇందులో ఇప్పటివరకు ఐదు పాఠశాలల్లోనే హాస్టల్ భవనాలు పూర్తి చేసినట్లు టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. మంచాల, యాచారం, ఇబ్రహీంపట్నం, కందుకూరు, శంషాబాద్ మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో వసతి గృహాల నిర్మాణ పనులు కొలిక్కివచ్చాయి. మిగతా ఏడు పాఠశాలల్లో నిర్మాణాలు ఇప్పటికిప్పుడు పూర్తయ్యేలా లేవు.కేవలం భవన నిర్మాణాల పూర్తితో హాస్టళ్లు కొనసాగించే వీలు లేదు. హాస్టళ్లలో వార్డెన్‌తో సహా ఇతర కేటగిరీలకు సంబంధించి ఉద్యోగులను నియమించాలి. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకు ఈ వసతిగృహాల అంశాన్ని ప్రస్తావించడం లేదు. మరోవైపు ఆర్‌ఎమ్‌ఎస్‌ఏ పథకంపై కేంద్ర సర్కారు చేతులెత్తేసింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా నిర్వహించాల్సి ఉంది. కానీ సర్కారు వసతిగృహాల నిర్వహణపై నిర్ణయం తీసుకోకపోవడంతో ఈ ఏడాది ఆదర్శ విద్యార్థులకు వసతి కలగానే మిగలనుంది. -
‘ఆదర్శం’గా చదవండి
మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలు షురూ ఈ నెల 20 వరకు గడువు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ జిల్లాలో నలభై ఆదర్శ పాఠశాలలు ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సులు ఒక్కో కోర్సులో 20 చొప్పున మొత్తం 3200 సీట్లు 26న ఎంపికైన విద్యార్థుల జాబితా వెల్లడి ఆంగ్లమాధ్యమంలో బోధన, హాస్టల్ వసతి కరీంనగర్ ఎడ్యుకేషన్ : జిల్లాలోని మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాల)ల్లో 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈనెల 4 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా, 20 వరకు గడువు విధించారు. ఈలో గా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఈ నెల 26న ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆయా పాఠశాలల్లో ప్రదర్శిస్తారు. విద్యార్థులు ఆన్లైన్లో వెబ్సైట్ సీజీజీ.జీవోవీ.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఈనెల 21లోగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, పదో తరగతి హాల్‌టికెట్, స్టడీ సర్టిఫికెట్, ఒక పాస్‌పోర్టు సైజు ఫొటోతో సహా జిరాక్స్ కాపీలను దరఖాస్తు చేసుకున్న పాఠశాలలో సమర్పించాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పాఠశాలల వారీగా మెరిట్ జాబితాలు తయారు చేసి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈనెల 26న సంబంధిత పాఠశాలలో ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రదర్శిస్తారు. 27న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఈ షెడ్యూల్‌ను అనుసరించి విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.లింగయ్య సూచించారు. ఒక్కో గ్రూపుకు 20 సీట్లు.. ఆదర్శ పాఠశాల్లో విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలో కొననసాగుతోంది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 20 సీట్ల చొప్పున నాలుగు గ్రూపులకు కలిపి 80 సీట్లకు ప్రవేశాలు జరుగుతాయి. జిల్లాలో 40 ఆదర్శ పాఠశాలల్లో ఉన్న ఇంటర్ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో సుమారు 3200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంతో ఆర్ట్స్ గ్రూపుల్లో సగం సీట్లు కూడా నిండలేదు. దీంతో ఈ విద్యాసంవత్సరంలో అన్ని గ్రూపుల్లోనూ పూర్తిస్థాయిలో సీట్లు నిండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఇందుకు సంబంధించి ప్రయత్నాలను ప్రారంభించారు. కాగా... మోడల్ స్కూళ్లలో ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తుంది. 55 శాతం ఉత్తీర్ణత... ఎంసెట్ కోచింగ్ ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సు పూర్తిగా ఆంగ్లమాధ్యమంలో కొనసాగుతోంది. 2014-15 విద్యా సంవత్సరంలో ఒక బ్యాచ్ ఇంటర్మీడియల్ పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలి తాల్లో జిల్లాలో ఉన్న 40 ఆదర్శ పాఠశాలల నుంచి 1723 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హజరు కాగా ఇందులో 946 మందే ఉత్తీర్ణుల య్యూరు. ఉత్తీర్ణత 55 శాతం మాత్రమే నమోదు చేశా రు. ఈ నేపథ్యంలో ఆదర్శ పాఠశాలల్లో విద్యాబోధనను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఎంసెట్‌లో ఉచిత శిక్షణను ఇప్పిస్తున్నారు. బాలికలకు తిమ్మాపూర్ మోడల్ స్కూల్లో, బాలురకు గర్రెపల్లి మోడల్ స్కూల్లో ఎంసెట్ శిక్షణ నిర్వహిస్తున్నారు. మొత్తం రెండు వందల మంది విద్యార్థులు ఎంసెట్ శిక్షణ పొందుతున్నారని సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ నీలకంఠం రాంబాబు తెలిపారు. ఈ శిక్షణ 45 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. విద్యార్థులకు పాఠశాలల్లోనే భోజనం, వసతి కల్పిస్తున్నామని తెలిపారు. -
ఆదర్శ పాఠశాలలతో అసమానతలు తొలగాలి
సాక్షి, హైదరాబాద్: పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో ప్రారంభించిన ఆదర్శ పాఠశాలలను మాటల్లోగాక చేతల్లోనూ తీర్చిదిద్దాలని ఎమ్మెల్సీ చుక్కా రామయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశా రు. యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆదివారమిక్కడ ఆదర్శ పాఠశాలల ఉపాధ్యాయుల సదస్సు జరిగింది. దీనికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. ప్రైవేటీకరణ నేపథ్యంలో విద్యావ్యవస్థలో పెరిగిన అసమానతలను తగ్గించేలా ఆదర్శ పాఠశాలల నిర్వహణ ఉండాలని సూచించా రు. విద్యార్థి సమగ్ర అభివృద్ధిపై ఉపాధ్యాయులు దృష్టిపెట్టాలన్నారు. ఆదర్శ పాఠశాలల రాష్ట్ర సంచాలకులు సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ.. ఆదర్శ పాఠశాలల్లో టీజీటీ ఉపాధ్యాయుల నియామకాలను వెంటనే చేపడతామని, వారు అందుబాటులో లేనిచోట తాత్కాలిక ఉపాధ్యాయులను నియమిస్తామని చెప్పారు. యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నర్సిరెడ్డి, ప్రధానకార్యదర్శి ఐ.వెంకటేశ్వరరావు, కోశాధికారి మాణిక్యరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు లక్ష్మారెడ్డి, రాములు, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ఆదర్శ పాఠశాలల టీచర్లకు వెంటనే సర్వీసు రూల్స్ రూపొంది ంచాలని, సెలవుల వర్తింపుపై ఉత్తర్వులివ్వాలని, వేతనాలు ప్రతి నెలా మొదటితేదీనే టీచర్ల అకౌంట్లలో జమచేయాలని సదస్సులో తీర్మానించారు. ఇన్చార్జి ప్రిన్సిపాల్స్‌కు ప్రత్యేక అలవెన్స్ ఇవ్వాలని, పాఠశాల నిర్వహణ గ్రాంటును విడుదల చేయాలనీ తీర్మానించారు.