మచిలీపట్నం (చిలకలపూడి) : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా గుర్తించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసిందని డీఈవో కె. నాగేశ్వరరావు బుధవారం తెలిపారు. పంచాయతీలు, మునిసిపాల్టీలను ఒక యూనిట్‌గా తీసుకుని పంచాయతీ, మునిసిపాల్టీల్లో ప్రాథమిక పాఠశాలలో ఒక ప్రాథమిక పాఠశాలను మెయిన్ పాఠశాలగా గుర్తించాల్సి ఉంటుందన్నారు. గుర్తించిన పాఠశాలకు ఒక కిలోమీటరు లోపు 30 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలను గుర్తించాలని చెప్పారు.
ఒక కిలో మీటరు లోపు 30 మంది విద్యార్థుల కంటే తక్కువ ఉన్న ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థులను మెయిన్ పాఠశాలలోని విద్యార్థులతో కలిపితే విద్యార్థుల సంఖ్య 80 కంటే ఎక్కువ ఉండాల్సి ఉంటుందన్నారు. విద్యార్థుల సంఖ్యను ఆధార్ నమోదు ప్రక్రియ ద్వారా పరిగణనలోకి తీసుకుంటామని చెప్పారు. అలా గుర్తించిన పాఠశాలలను భవిష్యత్‌లో అదనపు తరగతి గదుల నిర్మాణం చేపట్టే విధంగా ఉండాల్సి ఉంటుందన్నారు. ఈ పాఠశాలలో కూడా కనీసం నాలుగు తరగతి గదులు ఉండాలని చెప్పారు. అలా గుర్తించిన పాఠశాలను ఆదర్శ ప్రాథమిక పాఠశాలలుగా గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతారని వివరించారు.
వీటికి మినహాయింపు
అయితే 30 మందిలోపు విద్యార్థుల సంఖ్య కలిగి పంచాయతీ, మునిసిపాల్టీల్లో ఒకే ఒక్క ప్రాథమిక పాఠశాల ఉంటే మినహాయింపు ఉంటుంది. అలాగే 30 మంది విద్యార్థుల్లోపు ఉన్న పాఠశాలకు ఒక కిలోమీటరు లోబడి జాతీయ రహదారి, కాలువలు, రైల్వేట్రాక్‌లు అడ్డంకులు ఉంటే వాటికి కూడా మినహాయింపు ఇస్తారు. ఎస్సీ, ఎస్టీ కాలనీల్లో 30 మంది విద్యార్థుల్లోపు ఉన్న పాఠశాలలకు మినహాయింపు ఉంటుంది. మైనర్, మీడియం పాఠశాలలకు కూడా మినహాయింపు ఇవ్వాలని మార్గదర్శకాల్లో రూపొందించారు. ఈ మార్గదర్శకాల ద్వారా జిల్లాలోని ఆదర్శ పాఠశాలలను గుర్తించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని డీఈవో వివరించారు.
ఆదర్శ పాఠశాలల గుర్తింపు ఇలా..!
Published Thu, Jun 11 2015 12:27 AM | Last Updated on Sun, Sep 3 2017 3:31 AM
Advertisement
Advertisement