‘ఆదర్శం’గా చదవండి | Model schools admissions started | Sakshi
Sakshi News home page

‘ఆదర్శం’గా చదవండి

Published Wed, May 6 2015 3:47 AM | Last Updated on Sat, Sep 29 2018 6:18 PM

Model schools admissions started

మోడల్ స్కూల్స్‌లో ప్రవేశాలు షురూ
ఈ నెల 20 వరకు గడువు
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
జిల్లాలో నలభై ఆదర్శ పాఠశాలలు
ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సులు
ఒక్కో కోర్సులో 20 చొప్పున మొత్తం 3200 సీట్లు
26న ఎంపికైన విద్యార్థుల జాబితా వెల్లడి
ఆంగ్లమాధ్యమంలో బోధన, హాస్టల్ వసతి

 
కరీంనగర్ ఎడ్యుకేషన్ : జిల్లాలోని మోడల్ స్కూల్స్ (ఆదర్శ పాఠశాల)ల్లో 2015-16 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్‌లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమయ్యింది. ఈనెల 4 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తుండగా, 20 వరకు గడువు విధించారు. ఈలో గా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, ఈ నెల 26న ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆయా పాఠశాలల్లో ప్రదర్శిస్తారు. విద్యార్థులు ఆన్‌లైన్‌లో వెబ్‌సైట్ సీజీజీ.జీవోవీ.ఇన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఈనెల 21లోగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఆధార్, పదో తరగతి హాల్‌టికెట్, స్టడీ సర్టిఫికెట్, ఒక పాస్‌పోర్టు సైజు ఫొటోతో సహా జిరాక్స్ కాపీలను దరఖాస్తు చేసుకున్న పాఠశాలలో సమర్పించాల్సి ఉంటుంది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, పాఠశాలల వారీగా మెరిట్ జాబితాలు తయారు చేసి విద్యార్థులను ఎంపిక చేస్తారు. ఈనెల 26న సంబంధిత పాఠశాలలో ఎంపికైన విద్యార్థుల జాబితాను ప్రదర్శిస్తారు. 27న విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలిస్తారు. ఈ షెడ్యూల్‌ను అనుసరించి విద్యార్థులు ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి కె.లింగయ్య సూచించారు.

ఒక్కో గ్రూపుకు 20 సీట్లు..
 ఆదర్శ పాఠశాల్లో విద్యాబోధన ఆంగ్ల మాధ్యమంలో కొననసాగుతోంది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 20 సీట్ల చొప్పున నాలుగు గ్రూపులకు కలిపి 80 సీట్లకు ప్రవేశాలు జరుగుతాయి. జిల్లాలో 40 ఆదర్శ పాఠశాలల్లో ఉన్న ఇంటర్ కోర్సుల్లో ప్రథమ సంవత్సరంలో సుమారు 3200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. గతేడాది ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడంతో ఆర్ట్స్ గ్రూపుల్లో సగం సీట్లు కూడా నిండలేదు.

దీంతో ఈ విద్యాసంవత్సరంలో అన్ని గ్రూపుల్లోనూ పూర్తిస్థాయిలో సీట్లు నిండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు ఆదర్శ పాఠశాలల ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఇందుకు సంబంధించి ప్రయత్నాలను ప్రారంభించారు. కాగా... మోడల్ స్కూళ్లలో ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలను ప్రభుత్వమే కల్పిస్తుంది.

 55 శాతం ఉత్తీర్ణత... ఎంసెట్ కోచింగ్
 ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ కోర్సు పూర్తిగా ఆంగ్లమాధ్యమంలో కొనసాగుతోంది. 2014-15 విద్యా సంవత్సరంలో ఒక బ్యాచ్ ఇంటర్మీడియల్ పూర్తి చేసుకుంది. ఇటీవల విడుదలైన ఇంటర్మీడియట్ ఫలి తాల్లో జిల్లాలో ఉన్న 40 ఆదర్శ పాఠశాలల నుంచి 1723 మంది విద్యార్థులు ద్వితీయ సంవత్సరం పరీక్షలకు హజరు కాగా ఇందులో 946 మందే ఉత్తీర్ణుల య్యూరు. ఉత్తీర్ణత 55 శాతం మాత్రమే నమోదు చేశా రు. ఈ నేపథ్యంలో ఆదర్శ పాఠశాలల్లో విద్యాబోధనను మెరుగుపర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

ఆదర్శ పాఠశాలల్లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఎంసెట్‌లో ఉచిత శిక్షణను ఇప్పిస్తున్నారు. బాలికలకు తిమ్మాపూర్ మోడల్ స్కూల్‌లో, బాలురకు గర్రెపల్లి మోడల్ స్కూల్‌లో ఎంసెట్ శిక్షణ నిర్వహిస్తున్నారు. మొత్తం రెండు వందల మంది విద్యార్థులు ఎంసెట్ శిక్షణ పొందుతున్నారని సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ నీలకంఠం రాంబాబు తెలిపారు. ఈ శిక్షణ 45 రోజుల పాటు కొనసాగుతుందన్నారు. విద్యార్థులకు పాఠశాలల్లోనే భోజనం, వసతి కల్పిస్తున్నామని తెలిపారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement