
కామాంధుడికి రిమాండ్
చిత్తూరు (అర్బన్): చిత్తూరులోని ఓ ఉన్నత పాఠశాలలో చదివే బాలికపై లైంగిక దాడి కేసులో నిందితుడుగా ఉన్న శ్యామ్యూల్ ప్రఫుల్లా (54)ను సోమవారం వన్‌టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. చిత్తూరు డీఎస్పీ లక్ష్మీనాయుడు, సీఐ నిరంజన్‌కుమార్ వివరాలు వెల్లడించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భర్త శామ్యూల్ ప్రఫుల్లా ఈ నెల 2న లైంగిక దాడికి పాల్పడ్డాడు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రఫుల్లాపై నిర్భయ యాక్టు, ఐపీసీ 376 (2), (ఐ), సెక్షన్ 4, 10, బాలికలపై లైగింక దాడుల నిరోధక చట్టం (పోక్సా)-2012 కింద కేసులు నమోదు చేశామన్నారు. బాలికను ఇప్పటికే వైద్య పరీక్షలకు పంపి, ఆధారాల కోసం హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు నమూనాలు పంపామన్నారు. నిందితుడి నుంచి సైతం రక్త నమూనాలు సేకరించి, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతామన్నారు. కాగా నిందితున్ని చిత్తూరులోని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా ఇతనికి 14 రోజుల రిమాండు విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో నిందితున్ని చిత్తూరులోని జిల్లా జైలుకు తరలించారు.