నలుగురి మృతి
9 మందికి గాయాలు
అదుపులో 14 ఏళ్ల టీనేజర్
విండర్: అమెరికాలో మళ్లీ కాల్పుల మోత వినిపించింది. జార్జియా రాష్ట్రంలోని విండర్ పట్టణంలో అపలాచీ హైస్కూల్‌లో జరిగిన కాల్పుల ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. 9 మంది గాయపడ్డారు. అయితే 30 మంది గాయపడినట్లు తొలుత వార్తలొచ్చాయి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం ఉదయం 9.30 గంటలకు స్కూల్లో కాల్పులు మొదలయ్యాయి. దీంతో విద్యార్థులు ప్రాణభయంతో దగ్గర్లోని ఫుట్‌బాల్ స్టేడియంలో తలదాచుకునేందుకు పరుగులుపెట్టారు. కాల్పుల విషయం తెల్సి పోలీసులు నిమిషాల్లో పాఠశాలను చుట్టుముట్టారు.
అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రులకు తరలించారు. కాల్పుల్లో ఎంతమంది చనిపోయారు, ఎందరు గాయపడ్డారనే వివరాలను అధికారికంగా వెల్లడించలేదు. కాల్పులు జరిపింది 14 ఏళ్ల టీనేజర్ అని మీడియాలో వార్తలొచ్చాయి. అతను ఆ స్కూల్ విద్యార్థేనా అనేది తెలియాల్సి ఉంది. కాల్పులకు కారణాలను పోలీసులు వెల్లడించలేదు. ‘‘ తుపాకీ శబ్దాలు వినిపించినపుడు రసాయనశాస్త్ర తరగతి గదిలో ఉన్నా. ఒక టీచర్ పరుగున వచ్చి కాల్పులు జరుగుతున్నాయి. గడియ పెట్టుకోండి అని చెప్పి వెళ్లిపోయారు. తర్వాత ఎవరో వచ్చి తలుపు తెరవండని గట్టిగా పలుమార్లు అరిచారు.
మేం తీయలేదు. తర్వాత కాల్పుల శబ్దాలు, అరుపులు వినిపించాయి. మేం తర్వాత దగ్గర్లోని ఫుట్‌బాల్ మైదానంలోకి పరుగులు తీశాం’ అని ప్రత్యక్ష సాక్షి, 17 ఏళ్ల విద్యార్థి సెర్గియో కాల్డెరా చెప్పారు. విషయం తెల్సి విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలకు తరలివచ్చి తమ పిల్లలను ఇళ్లకు తీసుకెళ్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో కనిపించాయి. అమెరికాలో తుపాకీ సంస్కృతికి ఏటా పెద్దసంఖ్యలో జనం ప్రాణాలు కోల్పోతున్న విషయం విదితమే. ఘటనపై దేశాధ్యక్షుడు బైడెన్ స్పందించారు. ‘‘అమెరికా విద్యార్థులు చదవడం, రాయడం అనే వాటితోపాటు దాక్కోవడం, తమను తాము కాపాడుకోవడం అనేవి నేర్చుకోవాల్సిన దుస్థితి దాపురించింది. అమెరికాలో కాల్పులు మామూలే అనే ధోరణిని ఆమోదించబోం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment