మార్పు నిరంతర ప్రక్రియ. పాత వాటి స్థానంలో అంత కన్నా మెరుగైన కొత్త విధానాలు, వ్యవస్థలు రావడం అనివార్యం, అభిలషణీయం కూడా. జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) అమలులో భాగంగా మన రాష్ట్రంలో పాఠశాలల సర్దుబాటుకు చూపుతున్న చొరవను ఇందులో భాగంగానే చూడాలి. అర్థం చేసుకోకుండా ఒక విధానాన్ని వ్యతిరేకించడం సరైన చర్య కాదని విద్యార్థుల తల్లిదండ్రులు, విమర్శకులూ గ్రహించాలి.
కొంతమంది ‘మా పాఠశాలను తరలించవద్దు’ అంటూ ధర్నాలకు దిగడం మనం చూస్తున్నాం. ప్రభుత్వం పాఠశాలలను తరలిస్తున్నామని ఎప్పుడూ, ఎక్కడా చెప్పలేదు. మరి ఈ ఆందోళనకారులను ఎవరు తప్పుదోవ పట్టిస్తున్నారు?
మన రాష్ట్రంలో చాలా గ్రామాలలోని ప్రాథమిక పాఠశాలల్లో ఒకరు లేదా ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారు. వారు ఒకటి నుండి 5వ తరగతి వరకు రోజుకు 9 నుండి 18 సబ్జెక్టులను బోధించాల్సి ఉంటుందనే విషయం తల్లిదండ్రులకు చాలామందికి తెలియదు. బోధనేతర పనులైన మధ్యాహ్న భోజనం ఏర్పాటు, టాయిలెట్ మెయింటెనెన్స్, పాఠశాల ఆవరణ శుభ్రత వంటి పనులను కూడా వీరు రోజూ పర్యవేక్షించాలి.
ఈ పరిస్థితుల్లో పిల్లలకు హై క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించడం సాధ్యంకాదు. ఒక సబ్జెక్టును దానిలో నిష్ణాతుడైన ఒక టీచర్ బోధించినప్పుడే పిల్లలు ఎక్కువ ప్రయోజనం పొందుతారు. ఇదే మన ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి ఆశిస్తున్న నూతన విధానం. ఇది తెలియక పాఠశాలల ముందు ధర్నా చేస్తున్నారు.
జాతీయ విద్యా విధానాన్ని అనుసరించి మన రాష్ట్రంలో విద్యా విధానంలో మరిన్ని మార్పులు వస్తాయి. శాటిలైట్ ఫౌండేషన్, ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్, ప్రీ హై స్కూల్, హై స్కూల్, హై స్కూల్ ప్లస్‌లు విద్యా విధానంలో ప్రవేశిస్తాయి. ఈ విధానంలో ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లు... హైస్కూల్ ప్లస్‌లుగా మారిపోతాయి. ఈ ప్లస్ స్కూళ్లలో ఇంటర్మీడియట్ కూడా ఉంటుంది. అంటే మూడవ తరగతి నుంచీ ఇంటర్మీడియట్ వరకూ మన ప్రభుత్వ పాఠశాలలు ఒకే చోట విద్యను బోధిస్తాయన్నమాట.
ఎన్‌ఈపీలో భాగంగా ప్రాథమిక పాఠశాలల్లో చదువుకునే 3, 4, 5 తరగతులు చదువుతున్న విద్యార్థులను మూడు కిలోమీటర్ల లోపు ఉన్న అప్పర్ ప్రైమరీ లేదా హైస్కూల్‌లో చేర్చుతారు. దీనర్థం ఉన్న ప్రాథమిక పాఠశాలలను ఎత్తివేస్తారని కాదు. ప్రైవేటు పాఠశాలల్లో ఉండే ఎల్‌కేజీ, యూకేజీల్లాగానే గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్లలో ప్రీ పైమరీ–1(పీపీ–1), ప్రీ పైమరీ–2 (పీపీ–2) క్లాసులు ఏర్పాటు చేస్తారు. అలాగే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ తరగతులు కూడా ఉంటాయి. ఈ పాఠశాలల్లో రెండవ తరగతి వరకూ చదువుకున్న తర్వాత పిల్లలను మూడు కిలోమీటర్ల లోపు ఉన్న హైస్కూల్‌లో చేర్చుకుంటారు. ఇందువల్ల పిల్లలకు అపరిమిత ప్రయోజనాలు చేకూరుతాయి.
మూడు, నాలుగు, ఐదు తరగతులను హైస్కూళ్ళలో సర్దుబాటు చేయడం ద్వారా పిల్లలకు ఒక్కొక్క సబ్జెక్టుకు ఒక్కొక్క టీచర్ ఉంటారు. కాబట్టి, అక్కడ హైస్టాండర్డ్‌తో సబ్జెక్టు బోధించడానికి అవకాశం ఉంటుంది. ప్రైవేటు స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదివించడానికి ఏడెనిమిది మైళ్ల దూరంలో ఉన్న స్కూళ్లకు పంపించడంలో లేని ఇబ్బందులను మూడు కిలోమీటర్ల లోపలే... అన్ని హంగులతో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు పిల్లలను పంపించడానికి బాధపడటం సరికాదేమో తల్లిదండ్రులు ఆలోచించాలి.
పాఠశాలల సర్దుబాటు విషయంలో టీచర్లు కూడా అపోహాలను తొలగించుకోవాలి. వారి ఉద్యోగాలకు వచ్చే ముప్పు ఏమీ ఉండదు. కాంప్లెక్స్ లెవల్లో ఉపాధ్యాయులకు సర్దుబాటు, ఎన్‌ఈపీపై ప్రత్యక్ష తరగతులు అవసరం.
- వి. వి. రమణ
సామాజిక విశ్లేషకులు
Comments
Please login to add a commentAdd a comment