ముద్ద అన్నం
ముద్ద అన్నం తినలేకపోతున్నాం..
కారంపూడి...
అన్నం ముద్దగా, సంకటి కంటే అధ్వానంగా ఉండడంతో తినలేకపోతున్నామని ఎంపీడీవో వై రాజగోపాల్, ఎంఈవో వీవీ ఆచారికి స్థానిక బ్రహ్మనాయుడు జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు ఫిర్యాదుచేశారు. పదో తరగతి
కు అధికారులు బుధవారం పరీక్షలపై పలు మార్గదర్శక సూచనలు చేశారు. అనంతరం మధ్యాహ్న భోజనం పరిశీలించారు. అన్నం, కూరలను రుచి చూశారు. అన్నం ముద్దగా ఉండడాన్ని అధికారులు గమనించారు. రోజూ ఇలాగే వుంటోందా అని విద్యార్థులను ఆరాతీశారు. కొద్దిరోజుల నుంచి ఇలాగే ఉంటున్నదని, తినలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తంచేశారు. బియ్యాన్ని మార్చి సరఫరా చేయాలని కోరారు. తహశీల్ధార్ దృష్టికి తీసుకెళ్లి మంచి బియ్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇచ్చారు. పరీక్షలు దగ్గరకొస్తున్న దృష్ట్యా విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి ఉంటుందని రుచికరంగా వండి పెట్టాలని వంటవాళ్లకు సూచించారు. ఇక్కడ 220 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నట్లు వంటవాళ్ళు తెలిపారు.
నూరుశాతం ఉత్తీర్ణత సాధించాలి
అంతకుముందు పాఠశాలలో చదువుతున్న 180 మంది పదో తరగతి విద్యార్థులకు ఎంపీడీవో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉన్న 40 రోజులు ప్రణాళికాబద్ధంగా చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. ఒత్తిడి లేకుండా, కచ్చితమైన సమయపాలనతో ఇష్టపడి చదువుకోవాలన్నారు. నూరు శాతం ఉత్తీర్ణత సాధించి మండలానికి మంచిపేరు తేవాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ఎంఇవో వీవీ ఆచారి, హెచ్‌ఎం కోమలాదేవి ఉపాధ్యాయులు పాల్గొన్నారు.