చదువులమ్మకు చక్కనైన గుడి.. కృత్తివెంటి పాఠశాల | Kruthiventi Perraju School Special Story Ramachandrapuram East Godavari | Sakshi
Sakshi News home page

చదువులమ్మకు చక్కనైన గుడి.. కృత్తివెంటి పాఠశాల

Published Sat, Jan 8 2022 12:10 PM | Last Updated on Sat, Jan 8 2022 12:17 PM

Kruthiventi Perraju School Special Story Ramachandrapuram East Godavari - Sakshi

నేడు : కృత్తివెంటి పేర్రాజు పంతులు పాఠశాల

రామచంద్రపురం: దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే రూపు దిద్దుకుంటుందన్న మాటకు సజీవసాక్ష్యంగా నిలుస్తుంది ఆ పాఠశాల. ఎంతోమంది విభిన్న రంగాల్లో రాణించడానికి ఇక్కడే పునాది పడింది. అదే రామచంద్రపురంలోని శత వసంతాల సరస్వతీ నిలయం.. కృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయోన్నత పాఠశాల. ఈ పాఠశాల వార్షికోత్సవం ఆదివారం జరగనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం.. 

పునాదిరాళ్లు పడ్డాయిలా.. 
కృష్ణా జిల్లా మచిలీపట్నం చెంతన ఉన్న కృత్తివెన్ను గ్రామానికి చెందిన కృత్తివెంటి కృష్ణారావు కుమారుడు పేర్రాజు పంతులు 1852లో కాకినాడలో జన్మించారు. వృత్తిరీత్యా న్యాయవాదిగా స్థిరపడిన ఆయన ఒక కేసు వాదించేందుకు రామచంద్రపురం వచ్చారు. ఆ కేసు విషయంలో నిరక్షరాస్యులైన ఇద్దరు అన్నదమ్ములు తీరు ఆయను కలచివేసింది. గుర్రపు బగ్గీలో కాకినాడ తిరిగి వెళ్తూ.. తన బంట్రోతుతో పేర్రాజు పంతులు ‘‘కాటన్‌ దొర ఆనకట్ట కట్టారు. దీనివల్ల ఈ ప్రాంతంలో పంటలు పండుతున్నాయి. కానీ దానితో సమానంగా ఇక్కడి వారి బుర్రలు మాత్రం పెరగడం లేదు.

నాడు : 1906 ప్రాంతంలో పాఠశాల ఇలా.. 

విద్య లేని విత్తం అనర్థదాయకం. ఇక్కడొక పాఠశాల ఉంటే బాగుండును’’ అని అన్నారట. ఇందులో భాగంగానే ఆయన 1905లో జాతీయ పాఠశాల పేరుతో రామచంద్రపురంలో మిడిల్‌ స్కూల్‌ను స్థాపించారు. 1910 వరకూ ఆయనే పర్యవేక్షించే వారు. తరువాత 1920 వరకూ జిల్లా బోర్డు నియమించిన కమిటీ, 1921 – 1969 మధ్య జిల్లా బోర్డు ఈ పాఠశాలను పర్యవేక్షించేవి. తొలి ప్రధానోపాధ్యాయునిగా వీఎస్‌ రామదాసు పంతులు నియమితులయ్యారు. అప్పట్లో ఇక్కడ 4 నుంచి 8వ తరగతి వరకూ బోధించేవారు. ఆలమూరు, అనపర్తి, వేళంగి, కోటిపల్లి తదితర సుదూర గ్రామాల నుంచి విద్యార్థులు వచ్చి ఈ స్కూల్‌లో చేరారు. 

ఎంతోమంది కృషితో.. 
ఆరంభంలోనే అందరినీ ఆకట్టుకున్న ఈ మిడిల్‌ స్కూల్‌ 1906లో ఉన్నత పాఠశాలగా రూపాంతరం చెందింది. దీనికి పేర్రాజు పంతులు 94 ఎకరాల 21 సెంట్ల భూమిని దానం చేసి, పాఠశాల అభివృద్ధికి వినియోగించాలని స్పష్టం చేశారు. 1909 తరువాత వచ్చిన సీకే గోవిందరావు సుమారు 23 ఏళ్ల పాటు ప్రధానోపాధ్యాయునిగా పని చేసి కృత్తివెంటి పాఠశాల శిల్పిగా చరిత్రలో నిలిచిపోయారు. పాఠశాల రజతోత్సవాన్ని పూర్తి చేసి, స్వర్ణోత్సవ కాలానికి అంకురార్పణ చేసిన గోవిందరావును ఆర్నాల్డ్‌తో పోల్చారు. దినదినాభివృద్ధి చెందుతూ వచ్చిన ఈ పాఠశాల.. పూర్వ విద్యార్థి, ఎమ్మెల్యే అయిన నందివాడ సత్యనారాయణరావు, అప్పటి మున్సిపల్‌ చైర్మన్‌ అడ్డూరి పద్మనాభరాజుల కృషితో కృత్తివెంటి పేర్రాజు పంతులు జాతీయోన్నత పాఠశాలగా మారింది.

పాఠశాలకు నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి వచ్చిన సందర్భంలో..

కపిలేశ్వరపురం జమీందార్‌ ఎస్‌బీపీబీకే సత్యనారాయణరావు కృషితో 1969లో జూనియర్‌ కళాశాలగా ఆవిర్భవించింది. ఇంకా పూర్వ విద్యార్థులైన శ్రీ రాజా కాకర్లపూడి రాజగోపాల నరసరావు, రాజా రామచంద్ర బహుద్దూర్, అడ్డూరి పద్మనాభరాజు, నందివాడ సత్యనారాయణరావు, చుండ్రు శ్రీహరిరావు తదితరుల కృషితో కృత్తివెంటి విద్యాసంస్థలు ఎంతో అభివృద్ధి చెందాయి. 2006లో శత వసంతాలను పూర్తి చేసుకుంది. 2009లో శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. నియోజకవర్గానికి తొలి మంత్రి అయిన ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఈ పాఠశాలను సందర్శించారు. తరగతి గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. వైఎస్సార్‌ హయాంలోనే కృత్తివెంటి ఉద్యాన పాలిటెక్నిక్, కృత్తివెంటి వెటర్నరీ పాలిటెక్నిక్‌ కళాశాలలు ఇక్కడ ఏర్పాటయ్యాయి. నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు హయాంలో కృత్తివెంటి డిగ్రీ కళాశాల ఏర్పాటు చేశారు. 

సినీ ప్రముఖులు మిత్తిపాటి కామేశ్వరరావు (గులేబకావళి కథ ఫేం), మాస్టర్‌ రాజు (తెనాలి రామకృష్ణ ఫేం), ఫొటోల నారాయణస్వామి (వింధ్యారాణి ఫేం), ప్రముఖ సంగీత దర్శకుడు జేవీ రాఘవులు, క్యారెక్టర్‌ నటుడు రాళ్లపల్లి, ప్రఖ్యాత ఛాయాగ్రాహ దర్శకుడు చోటా కె. నాయుడు, మెజీషియన్‌ బీవీ పట్టాభిరామ్, ఇంకా రావులపర్తి భద్రిరాజు, ఇంద్రగంటి శ్రీకాంత్‌శర్మ, పైడిపాల, ప్రముఖ సినీ గేయ రచయిత అదృష్ట దీపక్, వైణిక విద్వాంసుడు ద్విభాష్యం నగేష్‌బాబు, వెదురుపాక విజయదుర్గా పీఠం గాడ్‌... వీరే కాకుండా రాజవంశానికి చెందిన రాజగోపాల నరసరావు, రాజ బహుద్దూర్‌ రామచంద్రరాజు, రాజా గోపాలబాబు, నందివాడ సత్యనారాయణరావు వంటి వారెందరో ఇక్కడే విద్యనభ్యసించారు. 

ఎంతో ఖ్యాతి.. 
కృత్తివెంటి పేర్రాజు పంతులు చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యం కల్పించారు. ఆయన దానం చేసిన కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా మైదానం రామచంద్రపురం నడిబొడ్డున ఉంది. ఇక్కడి నుంచి ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులు తయారయ్యారు. కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణం బాస్కెట్‌బాల్‌కు అంతర్జాతీయ స్ధాయిలో పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చింది. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా నాటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ హయాంలో జాతీయ స్థాయి బాస్కెట్‌బాల్‌ పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
► ఈ పాఠశాలలో మధురకవి ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి తదితర ఎంతో మంది ప్రముఖులు అధ్యాపకులుగా సేవలందించారు. 
► భారత స్వాంతంత్య్ర ఉద్యమంలో తన ప్రాణాన్ని అర్పించిన విప్లవజ్యోతి అల్లూరి సీతారామరాజు ఈ స్కూలులో 6వ తరగతి చదివారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement