పూలసాగుతో అలరారుతున్న గ్రామం
1200 ఎకరాల్లో 800 ఎకరాల్లో పూల సాగే
పూలే అక్కడివారికి జీవనాధారం
సుమగంధ చందం.. తూర్పుగోదావరి జిల్లా కాకరపర్రు గ్రామం
పెరవలి : గోదారికి ఆనుకుని ఉన్న గ్రామం అది. ఊరు ఊరంతా పూల తోటలమయం. ఊళ్లోనే కాదు.. ఊరికి ఏ పక్కన వెళుతున్నా పూల సువాసనలు ముక్కు పుటాలను తాకి మనసుకు ఆహ్లాదాన్నిస్తాయి. రంగు రంగుల పూల మొక్కలు మనల్ని ఇట్టే కట్టిపడేస్తాయి. ఇక శీతాకాలంలో అయితే మంచు తెరల మధ్య ఆ గ్రామం భూతలస్వర్గమే! తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు గ్రామ ప్రత్యేకత ఇది.
పూల మార్కెట్‌లో జిల్లాకే తలమానికంగా నిలుస్తోంది. సుమారు 5 కిలో మీటర్ల పరిధిలో విస్తరించి ఉన్న ఈ గ్రామంలో 1100 కుటుంబాలున్నాయి. 3,500 మంది జనాభా ఉంది. 1200 ఎకరాలు పంట భూమి ఉండగా.. 800 ఎకరాల్లో వివిధ రకాల పూలనే సాగు చేస్తుండటం విశేషం.
ఏడాది పొడవునా ఉపాధి
గ్రామంలో నివసిస్తున్న 1100 కుటుంబాల్లో 900 కుటుంబాలు పూల వ్యాపారం, పూల సాగు పైనే ఆధారపడ్డాయి. గ్రామంలోని మహిళలంతా ఇంటి వద్దే ఉండి పూల మాలలు, దండలు కడుతూ ఉపాధి పొందుతున్నారు. కిలో పూలు మాలగా కట్టినందుకు బంతిపూలకు రూ.40, కనకాంబరాలకు రూ.150, కాగడాలు, మల్లెలు, విరజాజులు వంటి వాటికి రూ.100 తీసుకుంటారు.
ఇలా ప్రతి ఇంటి నుంచి ఒక్కో మహిళ రోజుకు రూ.200 నుంచి రూ.400 వరకు సంపాదిస్తోంది. శుభముహుర్తాలు, పండుగలప్పుడైతే రెట్టింపు ఆదాయాన్ని పొందుతారు. ఇక యువకులు పెండ్లి మండపాలకు పూలను డెకరేట్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ గ్రామంలోని పురుషులు చాలామంది తెల్లవారు జామున సైకిళ్లు, మోటారు సైకిళ్లపై వివిధ ప్రాంతాలకు వెళ్లి పూలను అమ్ముతుంటారు.
ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయలుదేరి వెళ్లి పూలను అమ్మి.. ఆ డబ్బుతో పూట మార్కెట్‌కు వెళ్లి కావాల్సిన పూలను కొనుగోలు చేసి ఇంటికొస్తారు. తిరిగి వాటిని మాలలుగా కట్టించుకుని మళ్లీ సాయంత్రం 4 గంటలకు వివిధ ప్రాంతాలకు వెళ్లి అమ్మకాలు జరుపుకొని రాత్రి 9 గంటలకు ఇళ్లకు చేరతారు. ఇలా ఏడాది పొడవునా వీరు ఉపాధి పొందుతూనే ఉంటారు.
చిరు వ్యాపారులు పూలను కొని మాకు అందిస్తే.. మేం మాలలుగా కట్టి ఇస్తాం. ఇంటి దగ్గరే ఉండి రోజుకు 200 నుంచి 400 దాకా ఆదాయాన్ని పొందుతున్నాం. – షేక్ హసేన్ బేబీ, గృహిణి, కాకరపర్రు
మా గ్రామంలో యువకులంతా పూలను సాగు చేయడంతో పాటు పెండ్లి మండపాలకు పూలను డేకరేట్ చేస్తూ ఉపాధి పొందుతున్నారు. చాలామంది యువకులు సైకిళ్లు, బైక్‌లపై పూల అమ్మకాలు చేస్తుంటారు. – కాపకా సూర్యనారాయణ, చిరువ్యాపారి, కాకరపర్రు
Comments
Please login to add a commentAdd a comment