అమరావతి: ‘డీఎస్సీ నుంచి మినహాయించి.. తమను కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్స్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఏడాది మూడు నెలల చంటి బిడ్డను ఒడిలో పెట్టుకుని ధర్నా చేస్తున్న ఈమె పేరు పి.పర్శిక. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా కూనవరం గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయంలో సైన్స్ టీజీటీగా పనిచేస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీలో తమ పోస్టులు కూడా ఉండడంతో ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న తన ఉద్యోగం పోతోందని ఆందోళన వ్యక్తం చేస్తోంది.దాదాపు 237 కిలోమీటర్ల దూరంలోని కూనవరం నుంచి విజయవాడకు వచ్చి తన ఉద్యోగానికి భరోసా కల్పించేలా కాంట్రాక్ట్ రెగ్యులర్ టీచర్ (సీఆర్టీ)గా కన్వర్ట్ చేయాలని రోజుల తరబడి ధర్నా చేస్తోంది’.
పర్శిక టీచర్‌తోపాటు వందలాది మంది తమ ఊరు, వాడ, గూడు వదిలి వచ్చి విజయవాడ ధర్నా చౌక్‌లో గత 13 రోజులుగా శాంతియుత నిరసన కొనసాగిస్తున్నా సర్కార్ కనికరించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తమ డిమాండ్లను పరిష్కరిస్తామని లోకేశ్ ఓఎస్డీ చెప్పిన గడువు శుక్రవారంతో ముగుస్తుందని, తమ డిమాండ్లపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో చూసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని గిరిజన గురుకులాల ఔట్ సోర్సింగ్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మీనాయక్ గురువారం నాటి కార్యక్రమంలో తెలిపారు. ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను కొనసాగిస్తామని స్పష్టంచేశారు. – సాక్షి, అమరావతి
Comments
Please login to add a commentAdd a comment