చర్చా వేదికలో పాల్గొన్న విద్యార్థులు
బాలాజీ చెరువు (కాకినాడ సిటీ): మూడు రాజధానులతోనే రాష్ట్రం సమగ్ర అభివృద్ధి చెందుతుందని విద్యార్థి, ఉపాధ్యాయ, మేధావుల ఫోరం అభిప్రాయపడింది. ఫోరం ఆధ్వర్యంలో ‘పరిపాలన వికేంద్రీకరణ–మూడు రాజధానుల ఆవశ్యకత–ఆంధ్రప్రదేశ్ సమతుల అభివృద్ధి’ అంశంపై జేఎన్‌టీయూ (కాకినాడ)లో మంగళవారం చర్చావేదిక నిర్వహించారు. ఇందులో విద్యార్థులతో పాటు అధ్యాపకులు, మేధావులు పాల్గొని తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దూరదృష్టితో ఆలోచించి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని, మూడు రాజధానుల ఏర్పాటుతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని ఫోరం అభిప్రాయపడింది.
రాష్ట్రానికి, యువతకు మేలు జరగాలంటే ఈ విధానమే సరైందని విద్యార్థులు, మేధావులు ముక్తకంఠంతో చెప్పారు. జేఎన్‌టీయూకే సివిల్ విభాగం ప్రొఫెసర్, గ్రీన్ ఎనర్జీ డైరెక్టర్ డాక్టర్ మురళీకృష్ణ మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు, జిల్లాల సమానాభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పరిపాలన వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నారని వివరించారు. పెట్టుబడులు, అభివృద్ధి అంతా ఒకేచోట ఉంటే మళ్లీ ప్రాంతాల మధ్య అసమానతలు, విద్వేషాలు రగులుతాయన్నారు.
వీలైనంత త్వరగా ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లు తీసుకువచ్చి, ప్రజల్లో ఉన్న గందరగోళానికి స్వస్తి చెప్పాలని పలువురు విద్యార్థులు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి, యువతకు మేలు జరగాలంటే మూడు రాజధానుల అంశంపై ప్రజలను చైతన్యపరచాలని ఫోరం నిర్ణయించింది. కార్యక్రమంలో జేఎన్‌టీయూకే ఇంజనీరింగ్ విద్యార్థులు, పలువురు అధ్యాపకులతో పాటు, స్మార్ట్ సిటీ కార్పొరేషన్ చైర్మన్ అల్లి రాజబాబు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment