
దాడి జరిగిన ప్రాంతానికి 20 అడుగుల దూరంలోనే వివేకానంద స్కూలు
మొదటి అంతస్తులో 6వ కిటికీ, రెండో అంతస్తులో 4వ కిటికీ తెరిచి ఉన్నట్లు గుర్తింపు
పాఠశాలకు 200 మీటర్ల దూరంలోనే సెంట్రల్ టీడీపీ ఆఫీసు
ఓ టీడీపీ నేత అనుచరుల వద్ద ఎయిర్‌గన్ వంటి మారణాయుధాలు
సాక్షి ప్రతినిధి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై విజయవాడ సింగ్‌నగర్ డాబాకొట్ల సెంటర్‌లో వివేకానంద సెంటినరీ హైస్కూల్ నుంచే ఎయిర్‌గన్‌తో దాడికి పాల్పడి ఉంటారని పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. దాడి సమయంలో ఈ పాఠశాల వెనుక వైపున రోడ్డులోనే సీఎం జగన్ యాత్ర సాగుతోంది. సీఎం జగన్ ఉన్న బస్సుకు, పాఠశాల కేవలం 20 అడుగుల దూరంలోనే ఉంది. పాఠశాల ఉన్న రామకృష్ణ సమితికి చెందిన ఈ జీ+2 భవనం మొదటి అంతస్తులో 6వ కిటికీ, రెండో అంతస్తులో 4వ కిటికీ తెరిచి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
పాఠశాలకు వాచ్‌మెన్ భద్రత లేదు. దీంతో గేటు దూకి ఎవరైనా సులభంగా లోపలికి ప్రవేశించే అవకాశం ఉంది. అక్కడి నుంచే దాడికి పాల్పడి, సులభంగా తప్పించుకొని పోయే అవకాశం ఉంది. ఈ పాఠశాలకు 200 మీటర్ల దూరంలోనే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టీడీపీ ఆఫీసు ఉండటం కూడా అనుమానాలకు బలం చేకూరుస్తోంది. 59వ డివిజన్‌కు చెందిన ఓ టీడీపీ నాయకుడి అనుచరుల్లో బ్లేడ్ బ్యాచ్, ఎయిర్‌గన్‌లు, క్యాటర్‌బాల్, ఇతర మారణాయుధాలు వాడేవాళ్లు ఉన్నట్టు తెలుస్తోంది. దాడి జరిగిన సమయంలో సీఎం జగన్ రోడ్‌షోను చిత్రీకరించిన స్థానికుల నుంచి వీడియోలు సేకరించి పోలీసులు పరిశీలిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment