బడిలో ‘బైలింగ్యువల్‌’ భళా! | Bilingual textbooks in schools | Sakshi
Sakshi News home page

బడిలో ‘బైలింగ్యువల్‌’ భళా!

Published Mon, Jul 17 2023 4:12 AM | Last Updated on Mon, Jul 17 2023 4:12 AM

Bilingual textbooks in schools - Sakshi

గుంటూరు చౌత్ర సెంటర్‌లోని ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతి వరకు 545 మంది విద్యార్థినులు  చదువుతున్నారు. గతేడాదితో పోలిస్తే 40 మంది పెరిగారు. ప్రవేశాలు ఇంకా నమోదవుతున్నాయి.

గతంలో ఇక్కడ ఉర్దూ మీడియం మాత్రమే ఉండగా ఇప్పుడు ఇంగ్లిష్లోనూ బోధిస్తున్నారు. పాఠ్య పుస్తకాలు ఇంగ్లి ష్–ఉర్దూలో ఉండడంతో ఆంగ్ల భాషను సులభంగా ఆకళింపు చేసుకుంటున్నారు. నగరంలోని రెండు ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలల్లో ఇదే పరిస్థితి. ఇటీవల ప్రభుత్వం సమకూర్చిన ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్ల ద్వారా మరింత మెరుగ్గా బోధన కొనసాగుతోంది.

గుంటూరు నుంచి నానాజీ అంకంరెడ్డి, సాక్షి ప్రతినిధి:సంస్కరణలు చేపట్టి విద్యా రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం తెలుగేతర మాతృభాష విద్యార్థులు సైతం చదువుల్లో రాణించేలా బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలను రూపొందించింది.

రెండో అధికార భాషకు సముచిత ప్రాధా­న్యం కల్పిస్తూ 5,286 ఉర్దూ మీడియం పాఠశాలల్లో చదువుతున్న 62,777 మంది విద్యార్థులకు బైలింగ్యువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ను సమకూర్చింది. రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని స్కూళ్లలో చదివే విద్యార్థుల సౌలభ్యం కోసం కన్నడ, తమిళం, ఒడియా భాషల్లో బైలింగ్యువల్‌ పుస్తకాలను ముద్రించి అందిస్తోంది.
 
నాలుగు మైనర్‌ భాషల్లో 85,469 మంది 
బడికెళ్లే వయసున్న ప్రతి చిన్నారి చదువుకోవాలన్న సంకల్పంతో తెలుగేతర మాతృభాషల విద్యా­ర్థు­లను సైతం రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తమిళం మాతృభాషగా ఉన్న 1,316 మంది విద్యార్థుల కోసం బైలింగ్యువల్‌ పాఠ్య పుస్తకాలను ముద్రించారు. ఒడియా మాధ్యమంలో 8,599 మంది, కన్నడలో 10,485 మంది విద్యార్థులు చదువుతున్నారు.

ఆరు నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న వీరి కోసం కూడా ప్రభుత్వం బైలింగ్యువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ అందించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉర్దూ, కన్నడ, ఒడియా, తమిళం భాషల్లో 85,469 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. దేశంలో మైనర్‌ భాషల్లో బైలింగ్యువల్‌ టెక్ట్స్‌ బుక్స్‌ను అందుబాటులోకి తెచ్చిన ఏకైక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ కేంద్ర విద్యాశాఖ ప్రశంసలు అందుకుంది.

కచ్చితంగా మెరుగైన ఫలితాలు.. 
గతంలో సైన్స్‌ పాఠం ఎన్నో ఉదాహరణలతో చెప్పినా చాలామందికి అంతుబట్టేది కాదు. విద్యార్థులు ఎవరికి తోచినట్లు వారు ఊహించుకునేవారు. ఇప్పుడు ఐఎఫ్‌పీ స్క్రీన్లు వచ్చాక ప్రతి అంశాన్ని విపులంగా ఆడియో, వీడియో రూపంలో చెప్పగలుగుతున్నాం. విద్యార్థులు బాగా అర్థం చేసుకుంటున్నారు.

కచ్చితంగా మెరుగైన ఫలితాలు వస్తాయి. మౌలిక సదుపాయాల విషయంలో ప్రభుత్వం విప్లవాత్మక మార్పులు తెచ్చింది. గతంలో మరుగుదొడ్లు లేక బాలికలు చదువులకు దూరమైన సందర్భాలున్నాయి. ఇప్పుడు అన్ని వసతులు ఉండడంతో గౌరవంగా చదువుకుంటున్నారు.   – డి.యల్లమందరావు (ఫిజిక్స్‌ ఉపాధ్యాయుడు), ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాల, గుంటూరు

 వేగంగా అద్భుతమైన మార్పులు.. 
గతంలో ఉర్దూ మీడి­యం విద్యార్థులు అదే భాషలో రాసేవారు. ఇప్పు­డు బైలింగ్యువల్‌ పుస్తకాలు ఉర్దూ–ఇంగ్లిష్‌లో ఉండడంతో బోధన, అర్థం చేసుకోవడంలో చాలా మార్పులు వచ్చా­యి. ఇటీవల ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెల్స్‌ ఏర్పాటు చేయడంతో ప్రతి అంశాన్ని చక్కగా గ్రహించి ఇంగ్లిష్లోనే నోట్స్‌ రాస్తున్నారు. తక్కువ సమయంలోనే అద్భుతమైన మార్పు వచ్చింది.   – అబ్దుల్‌ కయ్యూమ్, మ్యాథ్స్‌ ఉపాధ్యాయుడు, ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాల, గుంటూరు

ఇప్పుడెంతో బాగుంది.. 
మా ఇంట్లో మాక­­ంటే ముందు చదువుతున్న వారు పుస్తకా­లు కొనేందుకు చాలా ఇబ్బంది పడేవారు. మాకు అలాంటి పరిస్థితి లేదు. బ్యాగు నుంచి పుస్తకాలు, యూనిఫారం వరకు అన్నీ ప్రభుత్వమే ఇస్తోంది. మధ్యా­హ్నం మంచి భోజనం పెడుతున్నారు. వాష్‌రూమ్‌లు పరిశుభ్రంగా ఉన్నాయి. బడిలో దేనికీ లోటు లేదు. కొత్తగా ఐఎఫ్‌పీ స్క్రీన్లతో పాఠాలు చెప్పడం ఎంతో బాగుంది.   – మహ్మద్‌ తనాజ్, పదో తరగతి విద్యార్థిని, ప్రభుత్వ బాలికల ఉర్దూ ఉన్నత పాఠశాల, గుంటూరు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement