
వంట రగడ
‘ఏజెన్సీ’ వివాదం
గ్రామ యువకుల జోక్యంపై హెచ్‌ఎం వ్యాఖ్యలు
ఆగ్రహంతో రగిలినస్థానికులు చర్చలతో సర్దుబాటు
గట్టు : మండల కేంద్రమైన గట్టులోని ఉ న్నత పాఠశాలలో వంట ఏజన్సీ వ్యవహా రంపై సోమవారం ఉన్నత పాఠశాలలో గ్రామస్తులకు, పాఠశాల హెడ్మాస్టర్ మేరమ్మకు మధ్య రగడ జరిగింది. దీంతో ఉద్రికత్తత పరిస్థితులు నెలకొనగా మధ్యలో విద్యార్థులు పస్తులుండాల్సి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉన్నత పాఠశాలలో పాత వంట ఏజన్సీ వారు వంటను సక్రమంగా తయారు చేయడం లేదంటూ వారిని తొలగించేందుకు హెడ్మాస్టర్ మేరమ్మ ప్రయత్నించారు. ఈ క్రమంలో సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కొత్త వంట ఏజన్సీ వారితో పాటుగా పాత వంట ఏజన్సీ వారు అక్కడి చేరుకున్నారు. తాము వంట చేయడానికి సిద్ధంగా ఉన్నా, హెడ్మాస్టర్ తమకు బియ్యం ఇవ్వడం లేదని, తమను తొలగించినట్లుగా రాత పూర్వకంగా ఇస్తే తప్ప ఇక్కడి నుంచి కదిలేది లేదని పాత వంట ఏజన్సీ వారు భీష్మించుకుకూర్చున్నారు.
ఈ సమయణంలో గ్రామ యువకులు జోక్యం చేసుకుని, విద్యార్థులు పస్తులుండకుండా పాత వంట ఏజన్సీకి బియ్యం అందించాలని, అందరం కూర్చొని చర్చిం చుకుని సమస్యను పరిష్కరించుకుందామని అన్నారు. ఈ క్రమంలో కొందరు యువకులను ఉద్ధేశించి హెడ్మాస్టర్ మేరమ్మ జులాయిలు అనే పదం ఉపయోగించడంతో యువకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ హెడ్మాస్టర్‌ను నిలదీశారు. హెడ్మాస్టర్ క్షమాపణ చేప్పే దాకా వదిలేది లేద ంటూ మండి పడ్డారు. ఈ వ్యవహారం ఇన్‌చార్జ్ తహశీల్దార్ తిరుపతయ్య, ఎంఈఓ రాంగోపాల్ దాకా వెళ్లింది. వారు ఉన్నత పాఠశాలకు చేరుకుని విద్యార్థుల తల్లిదండ్రులు, ఎస్‌ఎంసీ సభ్యులు, యువకులు, హెడ్మాస్టర్‌తో కలసి మరో మారు చర్చలకు కూర్చున్నారు. మధ్యే మార్గంగా ఎంఈఓ పాత వంట ఏజన్సీకి 30 రోజుల గడువు ఇచ్చి చూద్దామని, వారి పని తీరును ఎంపీడీఓ, తహశీల్దార్, ఎంఈఓలతో కూడిన త్రీమెన్ కమిటీ పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటుందని చెప్పడంతో సమస్య సద్దుమణిగింది. పాఠశాలలో గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో విద్యార్థులు ఇంటిముఖం పట్టారు. వేరే గ్రామాల నుంచి వచ్చిన విద్యార్థులు పస్తులుండాల్సి వచ్చి ంది. కాగా హెడ్మాస్టర్ మేరమ్మ తమకు వద్దని, ఆమెను జిల్లా విద్యాధికారి కార్యాలయానికి సరెండర్ చేయాలన్న తీర్మాణించిన కొందరు ఆ కాపీని ఎంఈఓ రాంగోపాల్‌కు అందజేశారు.