సర్దుబాట్లపై స్పష్టతేదీ? | Adjust the resolution, none of the bots? | Sakshi
Sakshi News home page

సర్దుబాట్లపై స్పష్టతేదీ?

Published Sat, Dec 26 2015 12:34 AM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

సర్దుబాట్లపై స్పష్టతేదీ? - Sakshi

సర్దుబాట్లపై స్పష్టతేదీ?

ప్రహసనంగా మారిన టీచర్ల సర్దుబాటు వివరాలు కోరుతున్న విద్యాశాఖ కమిషనర్
బదిలీలు ఉండవంటున్న ఎమ్మెల్సీలు ఉంటే టెన్త్ ఫలితాలపై ప్రభావం

 
మచిలీపట్నం :  ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటు వ్యవహారం గందరగోళంగా మారింది. పదో తరగతి ప్రీ పబ్లిక్ పరీక్షలు దగ్గరపడుతున్న వేళ ఉపాధ్యాయుల బదిలీలు ఎంతమేరకు సమంజసమనే వాదన వినిపిస్తోంది. సర్దుబాటు బదిలీల అంశంపై పాఠశాల విద్యాశాఖ కార్యదర్శితో ఎమ్మెల్సీలు ఎ.ఎస్.రామకృష్ణ, బచ్చల పుల్లయ్య, పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మత్తి కమలాకరరావు మాట్లాడినప్పుడు బదిలీలు ఇప్పట్లో ఉండవని సూచనప్రాయంగా చెప్పారు. ఆచరణలో మాత్రం వేరే విధంగా ఉండడం వివాదాస్పదమవుతోంది. ఉపాధ్యాయుల సర్దుబాటు బదిలీల్లో వెసులుబాటు ఇస్తామని విద్యాశాఖ కార్యదర్శి చెబుతుండగా, మరో వైపు జాబితా సిద్ధం చేయాలంటూ విద్యాశాఖ కమిషనరేట్ నుంచి డీఈవో కార్యాలయానికి ఆదేశాలు వస్తుండడం గమనార్హం. ఈ క్రమంలో సర్దుబాటు బదిలీలు జరుగుతాయా లేక వాయిదా పడతాయా అనే అంశంపై స్పష్టత లేకుండాపోయింది.
 
మండలాల నుంచి వివరాల్లేవు
 సర్దుబాటు బదిలీలకు సంబంధించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి డీఈవో కార్యాలయానికి మిగులుగా ఉన్న ఉపాధ్యాయుల వివరాలు పంపాల్సి ఉంది.  ఎక్కడ అవసరం ఉందో, ఎక్కడ మిగులు ఉన్నారో ఎంఈవోలు, డీవైఈవోల వద్ద వివరాలు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్సీలు ఇటీవల చేసిన ప్రకటనతో వాటిని డీఈవో కార్యాలయానికి పంపడం లేదు. అదేమని ప్రశ్నిస్తే.. ‘జరగని బదిలీలకు అంత తొందరెందుకు’ అంటూ సమాధానం ఎదురవుతోందని డీఈవో కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. శుక్రవారం కూడా డీఈవో కార్యాలయానికి సర్దుబాటు బదిలీల వివరాలు ఇవ్వాలని కమిషనర్ కార్యాలయం నుంచి ఉత్తర్వులొచ్చాయి. మండలాల నుంచి వివరాలు రాకపోవడంతో కమిషనర్ కార్యాలయానికి ఏం పంపాలో తెలియక డీఈవో కార్యాలయ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.
 
స్పష్టత లేని విధివిధానాలు
 ఉపాధ్యాయుల సర్దుబాటు బదిలీలకు సంబంధించి నివేదికలు విద్యాశాఖ ఉన్నతాధికారులు కోరుతున్నా స్పష్టమైన విధివిధానాలు ఇంతవరకు ప్రకటించలేదు. బదిలీల వివరాలు ఆన్‌లైన్‌లో ఉంచాలని చెప్పడమే తప్ప మార్గదర్శకాలు ఇంతవరకు ఇవ్వలేదని డీఈవో కార్యాలయ ఉద్యోగులు చెబుతున్నారు. సర్దుబాటు బదిలీలు కూడా వెబ్ కౌన్సెలింగ్ ద్వారా జరగాల్సిఉంది. అలా జరగాలంటే ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా, ఉద్యోగంలో చేరిన తేదీ, సీనియర్, జూనియర్ టీచర్ల వివరాలు సేకరించాల్సి ఉంది. జిల్లాలో 350 మందికి పైగా ఉపాధ్యాయులు మిగులుగా ఉన్నట్లు డీఈవో కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలి కాలంలో అప్‌గ్రేడ్ అయిన ఉన్నత పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల అవసరం ఉందని, ఈ తరహా పాఠశాలలు 12కు మించి ఉండవని సిబ్బంది అంటున్నారు. మార్చిలో జరిగే పదో తరగతి పరీక్షలకు సంబంధించి ఇప్పటికే సిలబస్ పూర్తయింది. ఈ తరుణంలో వేరే ప్రాంతానికి బదిలీ చేస్తే విద్యార్థులు ఇబ్బందిపడతారన్నది ఉపాధ్యాయుల వాదన.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement