వాషింగ్టన్: అమెరికా మరోసారి తుపాకీ మోతకు ఉలిక్కిపడింది. 19 ఏళ్ల మాజీ విద్యార్థి తాను చదివిన పాఠశాలలోనే విచ్చలవిడిగా కాల్పులకు దిగి 17 మందిని పొట్టనబెట్టుకున్నాడు. ఓ భారతీయ విద్యార్థి సహా మరో 15 మందిని గాయపరిచాడు. ఫ్లోరిడా రాష్ట్రంలో పార్క్‌లాండ్ నగరంలోని మేజరీ స్టోన్‌మన్ డగ్లస్ హైస్కూల్‌లో బుధవారం ఈ దారుణం జరిగింది.
నిందితుడు నికోలస్ క్రూజ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది అమెరికాలోని ఓ పాఠశాలలో కాల్పులు జరగడం ఇది 18వ సారి కావడం గమనార్హం. క్రమశిక్షణారాహిత్యానికి గతేడాది స్కూల్ నుంచి బహిష్కరణకు గురైన క్రూజ్ కక్షగట్టి మరీ ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. అతని సోషల్ మీడియా అకౌంట్లలో హింసను ప్రేరేపించే చిత్రాలున్నాయని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఎఫ్‌బీఐ అధికారుల సాయంతో స్థానిక పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.
అలారం లాగి..అలజడి సృష్టించి..: గ్యాస్ ముసుగు, స్మోక్ గ్రెనేడ్‌లు ధరించి, ఏఆర్–15 తుపాకీని వెంట తెచ్చుకున్న క్రూజ్ ముందుగా ఫైర్ అలారంను లాగి పాఠశాలలో అలజడి సృష్టించాడు. భయంతో విద్యార్థులు, సిబ్బంది బయటకు పరుగులు పెడుతుండగా విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. దీంతో 12 మంది అక్కడికక్కడే చనిపోయారు. మృతుల్లో విద్యార్థులు ఎందరు ఉన్నారన్నది తెలియరాలేదు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 15 మందిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.
ఆ స్కూల్‌లో ఇండో–అమెరికన్ విద్యార్థుల సంఖ్య ఎక్కువే అని తెలిసింది. షూటింగ్‌కు పాల్పడే ముందు క్రూజ్ తన సామాజిక మాధ్యమాల అకౌంట్లలో రెచ్చగొట్టే సందేశాలు అప్‌లోడ్ చేశాడని దర్యాప్తు అధికారులు వెల్లడించారు. అతని వద్ద చాలా తుపాకీ మేగజీన్లు కూడా ఉన్నాయని తెలిపారు. కాల్పులు ముగిసిన వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తన మాజీ ప్రియురాలి కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో గొడవకు దిగినందుకు క్రూజ్‌ను స్కూల్ నుంచి బహిష్కరించినట్లు మీడియాలో వార్తలొచ్చాయి.
అభద్రంగా ఉన్నామని భావించొద్దు
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాఠశాలలో కాల్పుల ఘటనపై విస్మయం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపిన ట్రంప్..పిల్లలు, ఉపాధ్యాయులెవరూ కూడా అమెరికా పాఠశాలలో అభద్రంగా ఉన్నామని భావించొద్దని అన్నారు. నిందితుడి మానసిక ఆరోగ్యంపై సందేహం వ్యక్తం చేశారు. ‘ఇది అమెరికాలో విషాదకర దినం. బాధితుల కోసం ఇండో–అమెరికన్లందరం ప్రార్థిస్తున్నాం’ అని కాల్పుల్లో గాయపడిన భారత విద్యార్థి తండ్రి స్నేహితుడు శేఖర్ రెడ్డి అన్నారు. 31 వేల జనాభా ఉన్న పార్క్‌లాండ్‌కు 2016లో అత్యంత సురక్షితమైన పట్టణంగా గుర్తింపు దక్కడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment