
భోజనం మంటలు
తాండవ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ వివాదాస్పదంగా మారింది. నిర్వాహకుల మధ్య వివాదం తలనొప్పిగా మారడంతో మనస్తాపం చెందిన ఉపాధ్యాయులు మూకుమ్మడి సెలవు పెట్టేందుకు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు.
- ఎండీఎం నిర్వాహకుల మధ్య వివాదం
- ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారిన వైనం
- మూకుమ్మడి సెలవుకు నిర్ణయం
నాతవరం : తాండవ హైస్కూల్‌లో మధ్యాహ్న భోజనం పథకం నిర్వాహకుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ హైస్కూల్‌లో తొలుత మాదాలమ్మ డ్వాక్రా గ్రూపునకు చెందిన బంగారి అచ్చుతాంబ పథకం వంటలు చేస్తుండేది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో మాదాలమ్మ, గంగాలమ్మ గ్రూపులకు చెందిన ఆరుగురు వంటలు చేస్తుండేవారు. నిర్వహణ విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తడంతో అచ్చుతాంబ, సత్యకళ, వేగి సత్యవతి ఒక వర్గంగా, సుర్ల కొండమ్మ, రాజు, సత్యవతి మరో వర్గంగా విడిపోయి గతేడాది గొడవ పడ్డారు.
అప్పట్లో ఈ విషయాన్ని హెచ్‌ఎం కామేశ్వరరావు మండల కమిటీకి ఫిర్యాదు చేశారు. తహశీల్దార్, ఎంపీడీవో, ఎస్‌ఐ, విద్యాకమిటీ సభ్యుల సమక్షంలో సమావేశమయ్యారు. ఏడాదిపాటు ఒక వర్గం చొప్పున వంటలు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది పాఠశాల పునఃప్రారంభం రోజున ఇరువర్గాలు హైస్కూలుకు వచ్చి వంటలు చేసేందుకు పోటీపడి గొడవపడ్డారు. ఈ వ్యవహారం తలనొప్పిగా మారడంతో హెచ్‌ఎం కామేశ్వరరావు అధికారులకు ఫిర్యాదు చేశారు.
ఎస్‌ఐ రవికుమార్ హైస్కూల్‌కు వెళ్లి తగదా లేకుండా చర్యలు తీసుకున్నారు. అదే రోజున డిప్యూటీ డీఈవో లింగేశ్వరరెడ్డి, ఎంఈవో అమృతకుమార్ భోజన పథకం నిర్వాహకులతో పాఠశాల సిబ్బంది సమావేశమయ్యారు. విద్యార్థులను ఇబ్బందులు పెట్టేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ వారు తీరులో మార్పురాలేదు. తరచూ ఉపాధ్యాయులతో వారు గొడవ పడుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఉపాధ్యాయులు శుక్రవారం తహశీల్దార్ కనకారావును కలిసి సమస్యను వివరించారు.
రెండు గ్రూపులను తొలగిస్తాం విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవిధంగా వ్యవహరిస్తే రెండు గ్రూపులను తొలగించి, మరొకరికి మద్యాహ్నన భోజనం నిర్వహణ అప్పగిస్తాం.
- లింగేశ్వరెడ్డి, డిప్యూటీ డీఈవో
మాకే ఆదేశాలు ఉన్నాయి
మాకు హైస్కూల్‌లో వంటలు చేసేందుకు డీఈవో ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. అందుకే మేమే వంటలు చేస్తున్నాం. ఈ విషయంలో తగ్గేది లేదు.
- అచ్చుతాంబ, సత్యకళ, సత్యవతి (మాదాలమ్మా డ్వాక్రా గ్రూపు)
మేమే వంటలు చేయాలి
గతంలో మేము వంటలు చేశాం. ఇప్పుడు మాకే అవకాశం ఇవ్వాలి. అవతలి గ్రూపువారు స్థానికంగా ఉండటం లేదు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు తాండవ గ్రామంలో లేవు.
- కొండమ్మ, రాజు, సత్యవతి (గంగాభవాని డ్వాక్రా గ్రూపు)
మూకుమ్మడి సెలవే మార్గం
నిర్వాహకుల వివాదాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కరించలేదు. వారినుంచి ఎదురయ్యే సమస్యలు తట్టుకోలేక మూకుమ్మడి సెలవు పెట్టాలని నిర్ణయించి, తహశీల్దార్‌కు తెలియజేశాం.
- డి.కామేశ్వరావు, హెచ్‌ఎం,
తాండవ హైస్కూల్