Meal Scheme
-
అన్నపూర్ణ.. అక్షయ పాత్ర
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న హైదరాబాద్ అన్ని వర్గాలనూ అక్కున చేర్చుకుంటోంది. దేశంలోనే విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది. నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భరోసా సైతం లభిస్తోంది. రోజువారీగా వివిధ వృత్తులపై మనుగడ సాగిస్తున్న పేదలు, నైపుణ్యాభివృద్ధి ఉపాధికి శిక్షణ పొందుతున్న యువతకు ప్రభుత్వ పరంగా అన్నపూర్ణ భోజన పథంకం అక్షయ పాత్రగా మారింది. కేవలం రూ.5కే 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల పప్పుతో పాటు 15 గ్రాముల పచ్చడితో కూడిన పోషక విలువలున్న భోజనం లభిస్తోంది. జీహెచ్ఎంసీ చొరవతో 2014లో అన్నపూర్ణ భోజనం పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం దీని అమలు కోసం నిరంతరం పర్యవేక్షణ సాగిస్తోంది. ఎనిమిదేళ్లుగా.. ఎనిమిదేళ్లుగా అన్నపూర్ణ భోజనంతో పేదలు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగార్థులు ఆకలి తీర్చుకుంటున్నారు. 2014 నుంచి ఈ ఏడాది మే నెలాఖరు వరకు 9 కోట్ల 67 లక్షల 53 వేల 612 మంది అన్నపూర్ణ భోజనం చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు అన్నపూర్ణ భోజనానికి రూ.185 కోట్ల 89 లక్షలు ఖర్చయ్యాయి. కోవిడ్ విపత్తుకు ముందు 150 కేంద్రాల ద్వారా రోజుకు 45 వేల అన్నపూర్ణ భోజనాలను అందించారు. లాక్డౌన్ సమయంలో మధ్యాహ్నం పూట మొత్తం 373 రెగ్యులర్– మొబైల్ కేంద్రాల ద్వారా పూర్తిగా ఉచితంగా అందించారు. రాత్రి పూట సైతం 259 రెగ్యులర్– మొబైల్ కేంద్రాలు పనిచేశాయి. పేదల సౌకర్యవంతంగా భోజనం చేసేందుకు అన్నపూర్ణ కేంద్రాల్లో సిట్టింగ్ సదుపాయం కూడా కల్పించారు. మొదటి విడతగా 32 ఏరియాల్లో సిట్టింగ్ అన్నపూర్ణ కాంటీన్లను ఏర్పాటు చేసి సదుపాయాలు కల్పిస్తున్నారు. -
ప్రభుత్వాసుపత్రుల్లో భోజన వసతి
నిడదవోలు : సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో పేద రోగులకు ప్రతి రోజూ భోజన వసతి కల్పించడం వారిలో ఉన్న సేవా సంకల్పానికి నిదర్శనమని జిల్లా కలెక్టర్ కాటంనేటి భాస్కర్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో సత్యపాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సత్యసాయి నిత్యాన్న సేవా పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ రూ.6.25 లక్షల ఆర్థిక సహకారంతో ఆసుపత్రి ముఖద్వారం గేటు, ఆవరణలో నిర్మించిన సీసీ రోడ్డును కలెక్టర్ ప్రారంభించారు. పాత ఆసుపత్రి భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వంటశాలలో రోగులకు కలెక్టర్ స్వయంగా భోజనాలను వడ్డించి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందడంతో రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నారని పేర్కొన్నారు. త్వరలో తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చామన్నారు. ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ నిడదవోలు రైల్వేగేటు వద్ద 6 నెలల్లో ఆర్వోబీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు నిత్యన్నదాన కార్యక్రమానికి మా వంతు సహాయంగా సొంత నిధులు రూ.2 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి లక్ష రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు, శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, బూరుగుపల్లి శ్రీనివాస్, సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు కానుమిల్లి శశి శేఖరరావు, డీసీహెచ్ఎస్ కె.శంకరరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గూడపాటి వెంకట్రావు పాల్గొన్నారు. -
పార్లపల్లి పాఠశాల ఉపాధ్యాయురాలిపై సస్పెన్షన్ వేటు
నల్లగొండ రూరల్ : గుర్రంపొడు మండలం మక్కపల్లి గ్రామ పంచాయతీ పరిధి పార్లపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు రేణుకపై సస్పెన్షన్ వేటు వేసినట్టు జిల్లా విద్యాశాఖాధికారి చంద్రమొహన్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.మధ్యాహ్న భోజన పథకం అమలులో నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు విచారణలో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడిం చారు. ప్రస్తుతం ఆమె అదే మండలంలోని వీటీనగర్ పాఠశాలలో డిప్యుటేషన్‌పై విధులు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. -
భోజనం మంటలు
తాండవ హైస్కూల్లో మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ వివాదాస్పదంగా మారింది. నిర్వాహకుల మధ్య వివాదం తలనొప్పిగా మారడంతో మనస్తాపం చెందిన ఉపాధ్యాయులు మూకుమ్మడి సెలవు పెట్టేందుకు నిర్ణయించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు. - ఎండీఎం నిర్వాహకుల మధ్య వివాదం - ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారిన వైనం - మూకుమ్మడి సెలవుకు నిర్ణయం నాతవరం : తాండవ హైస్కూల్లో మధ్యాహ్న భోజనం పథకం నిర్వాహకుల మధ్య వివాదం తారాస్థాయికి చేరింది. ఈ హైస్కూల్లో తొలుత మాదాలమ్మ డ్వాక్రా గ్రూపునకు చెందిన బంగారి అచ్చుతాంబ పథకం వంటలు చేస్తుండేది. విద్యార్థుల సంఖ్య పెరగడంతో మాదాలమ్మ, గంగాలమ్మ గ్రూపులకు చెందిన ఆరుగురు వంటలు చేస్తుండేవారు. నిర్వహణ విషయంలో వీరి మధ్య వివాదం తలెత్తడంతో అచ్చుతాంబ, సత్యకళ, వేగి సత్యవతి ఒక వర్గంగా, సుర్ల కొండమ్మ, రాజు, సత్యవతి మరో వర్గంగా విడిపోయి గతేడాది గొడవ పడ్డారు. అప్పట్లో ఈ విషయాన్ని హెచ్ఎం కామేశ్వరరావు మండల కమిటీకి ఫిర్యాదు చేశారు. తహశీల్దార్, ఎంపీడీవో, ఎస్ఐ, విద్యాకమిటీ సభ్యుల సమక్షంలో సమావేశమయ్యారు. ఏడాదిపాటు ఒక వర్గం చొప్పున వంటలు చేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది పాఠశాల పునఃప్రారంభం రోజున ఇరువర్గాలు హైస్కూలుకు వచ్చి వంటలు చేసేందుకు పోటీపడి గొడవపడ్డారు. ఈ వ్యవహారం తలనొప్పిగా మారడంతో హెచ్ఎం కామేశ్వరరావు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రవికుమార్ హైస్కూల్‌కు వెళ్లి తగదా లేకుండా చర్యలు తీసుకున్నారు. అదే రోజున డిప్యూటీ డీఈవో లింగేశ్వరరెడ్డి, ఎంఈవో అమృతకుమార్ భోజన పథకం నిర్వాహకులతో పాఠశాల సిబ్బంది సమావేశమయ్యారు. విద్యార్థులను ఇబ్బందులు పెట్టేలా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అయినప్పటికీ వారు తీరులో మార్పురాలేదు. తరచూ ఉపాధ్యాయులతో వారు గొడవ పడుతున్నారు. దీంతో మనస్తాపం చెందిన ఉపాధ్యాయులు శుక్రవారం తహశీల్దార్ కనకారావును కలిసి సమస్యను వివరించారు. రెండు గ్రూపులను తొలగిస్తాం విద్యార్థులను, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టేవిధంగా వ్యవహరిస్తే రెండు గ్రూపులను తొలగించి, మరొకరికి మద్యాహ్నన భోజనం నిర్వహణ అప్పగిస్తాం. - లింగేశ్వరెడ్డి, డిప్యూటీ డీఈవో మాకే ఆదేశాలు ఉన్నాయి మాకు హైస్కూల్లో వంటలు చేసేందుకు డీఈవో ఇచ్చిన ఆదేశాలు ఉన్నాయి. అందుకే మేమే వంటలు చేస్తున్నాం. ఈ విషయంలో తగ్గేది లేదు. - అచ్చుతాంబ, సత్యకళ, సత్యవతి (మాదాలమ్మా డ్వాక్రా గ్రూపు) మేమే వంటలు చేయాలి గతంలో మేము వంటలు చేశాం. ఇప్పుడు మాకే అవకాశం ఇవ్వాలి. అవతలి గ్రూపువారు స్థానికంగా ఉండటం లేదు. రేషన్ కార్డు, ఆధార్ కార్డు తాండవ గ్రామంలో లేవు. - కొండమ్మ, రాజు, సత్యవతి (గంగాభవాని డ్వాక్రా గ్రూపు) మూకుమ్మడి సెలవే మార్గం నిర్వాహకుల వివాదాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పరిష్కరించలేదు. వారినుంచి ఎదురయ్యే సమస్యలు తట్టుకోలేక మూకుమ్మడి సెలవు పెట్టాలని నిర్ణయించి, తహశీల్దార్‌కు తెలియజేశాం. - డి.కామేశ్వరావు, హెచ్ఎం, తాండవ హైస్కూల్ -
‘సన్న బియ్యంతో అన్నం’ షురూ
నగరంలో పథకం ప్రారంభం పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు 161 హాస్టళ్లలోని విద్యార్థులకు లబ్ధి సిటీబ్యూరో: నూతన సంవత్సరం కానుకగా ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం పథకాన్ని గురువారం ప్రారంభించింది. ఈ మేరకు నగరంలోని ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్‌పూర్ బాలికల హాస్టల్లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిలు వేర్వేరుగా ప్రారంభించారు. మహేంద్రహిల్స్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో మంత్రి తలసాని పథకాన్ని ప్రారంభించారు. మరో మంత్రి పద్మారావు సికింద్రాబాద్‌లోని సితాఫల్‌మండి బీసీ హాస్టల్లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కింగ్‌కోఠిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రారంభించారు. 15,652 మంది విద్యార్థులకు లబ్ధి నగరంలో 161 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో ఉన్న 15,652 మంది విద్యార్థులకు సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధిచేకూరనుంది. అదేవిధంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి కూడా సన్నబియ్యం సరఫరా చేస్తుండటంతో.. నగరంలోని 612 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 83 వేల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. మంచి భోజనంతో విద్యార్థులు అనారోగ్య సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంటుందని హాస్టల్ వార్డెన్లు, పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలి: దత్తాత్రేయ ముషీరాబాద్: బడుగు, బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సంబంధిత అధికారులు పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం కార్యక్రమాన్ని భోలక్‌పూర్‌లోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ తో కలిసి దత్తాత్రేయ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, డ్రాఔట్స్ లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. కళ్లు తెరిచి అభివృద్ధిని చూడండి:నాయిని భోలక్‌పూర్‌లోని ఎస్సీ బాలికల వసతి గృహంలో సన్నబియ్యం పథకాన్ని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. ఈ పథకాలను చూసి ఓర్వలేని టీడీపీ, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా వారు కళ్లు తెరిచి తాము చేపట్టే అభివృద్ధికి సహకరించాలని కోరారు. పేద విద్యార్థుల పోరాట ఫలితమిది.. అఫ్జల్‌గంజ్: సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం సరఫరా పేద విద్యార్థుల పోరాట విజయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం కింగ్‌కోఠిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఆరు నెలలుగా సన్న బియ్యం సరఫరా కోసం విద్యార్థులు చేసిన పోరాటానికి స్పందించిన ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. సన్న బియ్యం సరఫరా విషయంలో భవిష్యత్తులో అక్రమాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రాధిక, బీసీ మహిళా సంఘం అధ్యక్షులు శారదాగౌడ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షులు కె.నర్సింహ నాయక్, విద్యార్థి నేతలు పి.సతీష్‌కుమార్, రేపాక రాంబాబు, సీహెచ్ శ్రీనివాస్ యాదవ్, ప్రభాకర్, రతన్, వెంకటేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. ఒకే పథకాన్ని వేర్వేరుగా ప్రారంభించిన దత్తాత్రేయ, నాయిని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఒకే హాస్టల్లో వేర్వేరుగా ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభానికి అధికారులు భోలక్‌పూర్‌లోని బాలికల ఎస్సీ వసతి గృహాన్ని ఎంపిక చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయకు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్‌కు సమాచారం అందించారు. దత్తాత్రేయ, లక్ష్మణ్‌లు అనుకున్న సమయానికి రాగా నాయిని నర్సింహారెడ్డి కోసం దాదాపు 45 నిమిషాలు వేచి చూశారు. ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ, లక్ష్మణ్‌లు ప్రారంభించి వెళ్లిపోయారు. ఆ తరువాత అరగంటకు మంత్రి నాయిని నర్సింహారెడ్డి హాస్టల్‌కు చేరుకున్నారు. హాస్టల్ వార్డెన్‌కు సన్న బియ్యం అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు విద్యార్థుల మధ్య న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు. -
ప్రజా సేవలో జీహెచ్ఎంసీ ముందడుగు
-
మధ్యాహ్న భోజన చార్జీలు పెంచాలి
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలల్లో అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి మెనూ చార్జీలు పెంచాలని మధ్యాహ్న భోజన పథక నిర్వాహక సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు జి.వరల క్ష్మి డిమాండ్ చేశారు. నిర్వాహకుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఆదివారం జిల్లాస్థాయి సదస్సు నిర్వహించారు. అంతకుముందు రైల్వేస్టేషన్ నుంచి ర్యాలీ నిర్వహించారు. అనంతరం కణపాక సమీపంలోని సీఐటీయూ కార్యాలయ ప్రాంగణంలో నిర్వహించిన సదస్సులో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం విధానాల వల్ల పిల్లకు సరైన పౌష్టికాహారం అందడం లేదన్నారు. మెనూ ప్రకటించినప్పటికీ అందుకు అనుగుణంగా ధరలు పెంచకపోవడం వల్ల ఈ దుస్థితి నెలకొందని మండిపడ్డారు. నిర్వాహకులపై రాజకీయ వేధింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం అమలు చేయాలని కోరారు. ప్రతి నెలా బిల్లులు, గౌరవ వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి తమ్మినేని సూర్యనారాయణ, వర్కింగ్ ఉమెన్స్ అధ్యక్షురాలు ఎం.ఉమామహేశ్వరి, మధ్యాహ్న భోజన పథక నిర్వాహకుల యూనియన్ జిల్లా కార్యదర్శి బి.సుధారాణి, సీఐటీయూ నాయకులు టీవీ.రమణ, పి.శంకరరావు, డేగల అప్పారావు, రెడ్డి శ్రీదేవి, పి.రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
రుచి‘కరవై’న భోజనం
మధ్య తరగతి, నిరుపేద కుటుంబాలకే కాదు...మధ్యాహ్న భోజన పథకానికీ కూరగాయల ధరలసెగ తాకింది. పాఠశాలలు ప్రారంభమై ఐదునెలలు గడిచినా ఇప్పటి వరకు పిల్లల దరికి రుచికర ఆహారం చేరలేదు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో మెనూ అమలుకు ఎక్కడికక్కడ బ్రేక్ పడింది. వారానికి రెండుకోడిగుడ్లే అందివ్వలేమని ఏజెన్సీల నిర్వాహకులు వాపోతుంటే... వారంలో ఆరురోజులు ఎలా అందించాలని హాస్టలు వార్డన్లు తలపట్టుకుంటున్నారు. సాక్షి, కడప: విద్యార్థుల డ్రాపౌట్స్ నివారించడం...అలాగే పిల్లల్లో పోషకాహారలేమి సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో భోజన పథకం అమలవుతోంది. ఈ పథకంలో భాగంగా రుచికరమైన ఆహారాన్ని అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కొండెక్కిన కూరగాయల ధరలతో ఇది సాధ్యపడటం లేదు. గతేడాది మధ్యాహ్న భోజన మెనూలో మార్పులు చేశారు. అన్నం, సాంబారు వరకే దీన్ని పరిమితం చేయకుండా ఆకుకూరలు, ఇతర కూరగాయలతో కూడిన వంటకాలను కూడా మెనూలో పొందుపర్చారు. జిల్లాలో 3,450 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అయితే ఈ విద్యాసంవత్సరం ఆరంభం నుంచి కూరగాయల ధరాఘాతం భోజన పథకాన్ని తాకింది. విద్యార్థుల చదువులు ముందుకు సాగాల్సిన సమయంలో రుచికరమైన ఆహారాన్ని అందించాల్సి ఉండగా పచ్చడి మెతుకులతోనే సరిపెడుతున్నారు. వారానికి రెండు కోడిగుడ్లు అందించాల్సి ఉండగా చాలాచోట్ల ఒక్కటీ ఇవ్వట్లేదు. ధరలు తగ్గాలి... లేదా భత్యం పెంచాలి: కూరగాయల ధరలు తగ్గడం లేదా ఏజె న్సీలకు ఇచ్చే భత్యం పెంపుదలతోనే భోజన పథకానికి తంటాలు తప్పనున్నాయి. గత విద్యా సంవత్సరం ముగింపు దశలో ఉన్న కూరగాయల ధరలకు ఇప్పటికి పెరుగుదల 70శాతానికి పైబడి ఉంది. గతంలో కందిపప్పు కిలో 53 రూపాయలు ఉంటే ఇప్పుడు 70-80 రూపాయలకు చేరింది. మొన్నటి వరకూ డజన్ కోడిగుడ్లు 34 రూపాయలు ఉంటే ప్రస్తుతం 48 రూపాయలకు చేరాయి. అదే విధంగా టమోటా ధరలు ఐదునెలలుగా ఆకాశం దిగని పరిస్థితి. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రోజుకు 4రూపాయలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రోజుకు 4.65 రూపాయల చొప్పున భోజనానికి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ నిధులతో సింగిల్ టీ కూడా రాదు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నిధులతో 100 గ్రాముల అన్నం, 150 గ్రాముల కూరగాయలను ఏజెన్సీలు వడ్డించాలి. వారానికి రెండు కోడిగుడ్లు, అరటికాయలు, పండ్లు, ఆకుకూరలతో కూడిన వంటకాలు అందించాలి. అయితే కోడిగుడ్డు ధర దాదాపు 4 రూపాయలు ఉంటే అంతే ధరకు విద్యార్థి రోజుకు అవసరమయ్యే భోజనం అందించాలంటే ఎలా? అని ఏజెన్సీల నిర్వాహకులు ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు. దీనికి తోడు బకాయిల బరువు కూడా ఏజెన్సీల నిర్వాహకులను బాధకు గురి చేస్తోంది. భోజన పథకం అమలుకు వంటగ్యాస్ ఇవ్వాల్సి ఉండగా కొన్ని మండలాల్లో నేటికీ ఇవ్వలేదు. ఉన్న మండలాల్లో సబ్సిడీ సిలెండర్లు ఏడాదికి 9మాత్రమే ఇవ్వాలనే నిబంధనతో నిర్వాహకులు అల్లాడుతున్నారు. దీనికి తోడు వంట సామగ్రి కూడా ఏజెన్సీలు బయట నుంచి అద్దెకు తీసుకోవాల్సి వస్తోంది. ఉన్నత పాఠశాలల్లో వందల మంది విద్యార్థులుంటారు. వారికోసం వంట చేసేందుకు, ఆహారం వడ్డించడానికి ఏజెన్సీల వద్ద సామాన్లు లేవు. ప్రభుత్వమే వాటిని అందించాలని గత కొన్నేళ్లుగా నిర్వాహకులు కోరుకుంటున్నా పట్టించుకోవడం లేదు. హాస్టళ్లలోనూ అదే పరిస్థితి: ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకూ ధరల సెగ తాకింది. జిల్లాలో 219 హాస్టళ్లలో 17,331 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ శనివారం మినహా తక్కిన అన్ని రోజుల్లో గుడ్లు అందించాలి. రోజూ ఆకు, కాయగూరల పప్పు, సాంబారు అందించాలి. పెరిగిన ధరలతో దాదాపు ఏ సంక్షేమ హాస్టలులో కూడా పూర్తిస్థాయి మెనూ అమలు కావడం లేదు. ఈ విషయాన్ని ఇటీవల సాంఘిక సంక్షేమశాఖ జేడీ సీఎస్ఏ ప్రసాద్ కూడా అంగీకరించారు. -
మధ్యాహ్న మె‘నో’
ఉదయగిరి, న్యూస్‌లైన్: అధికారుల పర్యవేక్షణ లోపం.. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శాపంగా మారింది. సర్కార్ స్కూళ్లల్లో చదివే పేద విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ద్వారా పౌష్టికాహారం అందించి హాజరు శాతాన్ని పెంచే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం భోజన పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే పౌష్టికాహారం విద్యార్థులకు అందని ద్రాక్షగా మిగిలింది. పౌష్టికాహార లోపంతో విద్యార్థులు రోగాలబారిన పడుతూ చదువులో వెనకపడుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరంలో మెనూ చార్జీలు పెంచినా నాణ్యమైన భోజనం అందడం లేదు. దీనిని పర్యవేక్షించాల్సిన ఎంఈఓలు పత్తాలేరు. జిల్లాలోని 4,052 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో 2.4 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజన పథకం ద్వారా లబ్ధిపొందుతున్నారు. వీటి నిర్వహణ బాధ్యతను 2,650 ఏజెన్సీలు తీసుకున్నాయి. విద్యార్థుల సంఖ్యను బట్టి ఈ ఏజెన్సీలకు ఒకటి నుంచి నలుగురు వరకు నెలకు రూ.1000 చొప్పున వేతనం ఇస్తోంది. ఈ ఏజెన్సీలకు ప్రభుత్వమే బియ్యం సరఫరా చేస్తుంది. మిగతా కిరాణా సరుకులు, కూరగాయలు, కోడిగుడ్లు కొనుగోలుకు నగదు చెల్లిస్తోంది. పెరిగిన మెనూ చార్జీలు గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వం ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4 ఇచ్చేది. ప్రాథమికోన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.4.65 చెల్లించేది. పెరిగిన నిత్యావసర వస్తువులు, కట్టెలు, నూనె, ఉప్పు, ఇతర సామగ్రి ధరలు అధికంగా ఉండటంతో నిర్వాహక ఏజెన్సీలు ఇబ్బందిపడేవి. నాణ్యమైన మెనూ అందించేందుకు పలుమార్లు తమ బాధలను నిర్వాహక ఏజెన్సీలు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో విద్యాశాఖ ఈ ఏడాది మెనూ చార్జీలు పెంచింది. ప్రాథమిక పాఠశాల స్థాయిలో ఒక్కో విద్యార్థికి రూ.4.35, ప్రాథమికోన్నత స్థాయిలో రూ.6 పెంచింది. దీంతో విద్యార్థులకు పౌష్టికాహారం అందుతుందని అధికారులు భావించారు. కాని క్షేత్ర పరిశీలనలో చూస్తే మెనూ మెరుగుపడలేదు. పౌష్టికాహారం అందటం లేదు. పత్తాలేని పర్యవేక్షణ కమిటీలు ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో పాఠశాలలో మధ్యాహ్న భోజనం సక్రమంగా అమలు జరిపేందుకు పౌష్టికాహారం అందించేందుకు ఎంపీడీఓ, ఎంఈఓ, ఈఓపీఆర్డీలతో విద్యాశాఖ ఓ కమిటీ వేసింది. ఈ కమిటీ సభ్యులు ప్రతిరోజూ ఏదో ఒక పాఠశాలను తనిఖీ చేసి మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించడంతో పాటు పారిశుధ్య కార్యక్రమాలు కూడా గమనించాల్సి ఉంది. వీరు తాము పరిశీలించిన పాఠశాలల వివరాలను ప్రతి 15 రోజులకోసారి డీఈఓకు పంపాలి. ఈ విధానం జిల్లాలో 90 శాతం అమలుకావడం లేదు. ఎక్కడో అరకొరగా తనిఖీలు చేసి మమ అనిపిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును పూర్తిస్థాయిలో పర్యవేక్షించాల్సిన ఎంఈఓలు పట్టించుకోవడం లేదు. దీంతో విద్యార్థులకు పౌష్టికాహారం కలగానే మిగులుతోంది. అందించాల్సిన మెనూ సోమ, గురువారాల్లో గుడ్డు, సాంబారు (కూరగాయలతో) అందించాలి. మంగళ, శుక్రవారాల్లో పప్పు, కూరగాయలు, బుధ, శనివారాల్లో పప్పు, ఆకుకూరలతో భోజనం పెట్టాలి. కాని చాలాచోట్ల గుడ్డు ఇవ్వడం లేదు. అక్కడక్కడ గుడ్డుకు బదులు అరటిపండ్లు ఇస్తున్నారు. కొన్ని పాఠశాలల్లో మాత్రం ఒక గుడ్డు ఇస్తున్నారు. రిఫైండ్ ఆయిల్‌కు బదులు పామాయిల్ వాడుతున్నారు. ప్రాథమిక స్థాయిలో ఒక్కో విద్యార్థికి రైస్ వంద గ్రాములు, పప్పు 30 గ్రాములు, కూరగాయలు ఐదు గ్రాములు, ప్రాథమికోన్నత స్థాయిలో రైస్ 150 గ్రాములు, పప్పు 30 గ్రాములు, కూరగాయలు 75 గ్రాములు, నూనె 7.5 గ్రాములు అందించాల్సి ఉంది. కాని చాలాచోట్ల పప్పు అరకొరగానే అందిస్తున్నారు. కూరగాయలు పత్తా కనిపించడం లేదు. గుడ్డుకు బదులు పప్పు, పప్పుకు బదులు రసం అందిస్తుండటంతో పౌష్టికాహారం పూర్తిగా లోపించింది. నిర్వాహక ఏజెన్సీల ఆవేదన ప్రస్తుతం పెరుగుతున్న ధరలకనుగుణంగా మెనూ చార్జీలు ప్రభుత్వం పెంచడం లేదని నిర్వాహక ఏజెన్సీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. దీంతో పౌష్టికాహారం అందించలేకపోతున్నామంటున్నాయి. కాగా మధ్యాహ్న భోజన పథకానికి జిల్లా అధికారులు ఈ విద్యా సంవత్సరానికి రూ.145 కోట్లు మంజూరు చేశామని చెబుతున్నా ఇంత వరకు ఏజెన్సీలకు చెల్లించలేదు. ఐదు నెలలుగా బిల్లులు రాలేదు ఐదు నెలలుగా బిల్లులు రాలేదు. జీతం కూడా రాలేదు. అప్పుచేసి కొంతవరకు నెట్టుకురాగలిగాం. ప్రస్తుతం దుకాణదారులు అప్పు ఇవ్వడం లేదు. వీటికితోడు కట్టెల ధరలతో పాటు నిత్యావసర ధరలు కూడా పెరిగాయి. నెలనెలా బిల్లులు సక్రమంగా ఇస్తే మంచి భోజనం పెట్టే వీలుంటుంది. నల్లిపోగు నాగలక్ష్మి, ఏజెన్సీ నిర్వాహకుడు మెనూ అమలు చేయని ఏజెన్సీలు రద్దు మెనూచార్జీలు పెరిగాయి. మధ్యాహ్న భోజన పథక నిధులు కూడా విడుదల చేశాం. త్వరలోనే ఏజెన్సీ నిర్వాహకులకు బిల్లులు అందిస్తాం. మధ్యాహ్న భోజన పథకాన్ని పర్యవేక్షణ కమిటీలు తనిఖీలు చేయాలి. అవకతవకలు జరిగితే ఎంఈఓలు పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుంది. మెనూ అమలుపరచని నిర్వాహక ఏజెన్సీలను రద్దుచేసి కొత్త వారికి అప్పగిస్తాం. మువ్వా రామలింగం,డీఈఓ