సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరం వైపు అడుగులు వేస్తున్న హైదరాబాద్ అన్ని వర్గాలనూ అక్కున చేర్చుకుంటోంది. దేశంలోనే విద్య, నైపుణ్య శిక్షణ, ఉపాధికి హైదరాబాద్ కేంద్ర బిందువుగా మారింది. నగరానికి వచ్చిన ప్రతి ఒక్కరికి భరోసా సైతం లభిస్తోంది. రోజువారీగా వివిధ వృత్తులపై మనుగడ సాగిస్తున్న పేదలు, నైపుణ్యాభివృద్ధి ఉపాధికి శిక్షణ పొందుతున్న యువతకు ప్రభుత్వ పరంగా అన్నపూర్ణ భోజన పథంకం అక్షయ పాత్రగా మారింది.
కేవలం రూ.5కే 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబారు, 100 గ్రాముల పప్పుతో పాటు 15 గ్రాముల పచ్చడితో కూడిన పోషక విలువలున్న భోజనం లభిస్తోంది. జీహెచ్‌ఎంసీ చొరవతో 2014లో అన్నపూర్ణ భోజనం పథకం ప్రవేశపెట్టిన ప్రభుత్వం దీని అమలు కోసం నిరంతరం పర్యవేక్షణ సాగిస్తోంది.
ఎనిమిదేళ్లుగా..
ఎనిమిదేళ్లుగా అన్నపూర్ణ భోజనంతో పేదలు, విద్యార్థులు, కార్మికులు, ఉద్యోగార్థులు ఆకలి తీర్చుకుంటున్నారు. 2014 నుంచి ఈ ఏడాది మే నెలాఖరు వరకు 9 కోట్ల 67 లక్షల 53 వేల 612 మంది అన్నపూర్ణ భోజనం చేసినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటి వరకు అన్నపూర్ణ భోజనానికి రూ.185 కోట్ల 89 లక్షలు ఖర్చయ్యాయి. కోవిడ్ విపత్తుకు ముందు 150 కేంద్రాల ద్వారా రోజుకు 45 వేల అన్నపూర్ణ భోజనాలను అందించారు.
లాక్‌డౌన్ సమయంలో మధ్యాహ్నం పూట మొత్తం 373 రెగ్యులర్– మొబైల్ కేంద్రాల ద్వారా పూర్తిగా ఉచితంగా అందించారు. రాత్రి పూట సైతం 259 రెగ్యులర్– మొబైల్ కేంద్రాలు పనిచేశాయి. పేదల సౌకర్యవంతంగా భోజనం చేసేందుకు అన్నపూర్ణ కేంద్రాల్లో సిట్టింగ్ సదుపాయం కూడా కల్పించారు. మొదటి విడతగా 32 ఏరియాల్లో సిట్టింగ్ అన్నపూర్ణ కాంటీన్లను ఏర్పాటు చేసి సదుపాయాలు కల్పిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment