‘సన్న బియ్యంతో అన్నం’ షురూ
నగరంలో పథకం ప్రారంభం
పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు
161 హాస్టళ్లలోని విద్యార్థులకు లబ్ధి
సిటీబ్యూరో: నూతన సంవత్సరం కానుకగా ప్రభుత్వం సంక్షేమ హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం పథకాన్ని గురువారం ప్రారంభించింది. ఈ మేరకు నగరంలోని ఆయా ప్రాంతాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ముషీరాబాద్ నియోజకవర్గంలోని భోలక్‌పూర్ బాలికల హాస్టల్‌లో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డిలు వేర్వేరుగా ప్రారంభించారు. మహేంద్రహిల్స్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో మంత్రి తలసాని పథకాన్ని ప్రారంభించారు. మరో మంత్రి పద్మారావు సికింద్రాబాద్‌లోని సితాఫల్‌మండి బీసీ హాస్టల్‌లో విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. కింగ్‌కోఠిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య ప్రారంభించారు.
15,652 మంది విద్యార్థులకు లబ్ధి
నగరంలో 161 సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఇందులో ఉన్న 15,652 మంది విద్యార్థులకు సన్న బియ్యం పథకం ద్వారా లబ్ధిచేకూరనుంది. అదేవిధంగా పాఠశాలల్లో మధ్యాహ్న భోజనానికి కూడా సన్నబియ్యం సరఫరా చేస్తుండటంతో.. నగరంలోని 612 ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న 83 వేల మంది విద్యార్థులకు మేలు జరుగుతుంది. మంచి భోజనంతో విద్యార్థులు అనారోగ్య సమస్యల నుంచి బయట పడే అవకాశం ఉంటుందని హాస్టల్ వార్డెన్లు, పలువురు ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు.
సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేయాలి: దత్తాత్రేయ
ముషీరాబాద్: బడుగు, బలహీన వర్గాల కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను సంబంధిత అధికారులు పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాస్టల్ విద్యార్థులకు సన్న బియ్యంతో అన్నం కార్యక్రమాన్ని భోలక్‌పూర్‌లోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఎమ్మెల్యే కె.లక్ష్మణ్ తో కలిసి దత్తాత్రేయ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో కనీస సౌకర్యాలు కల్పించాలని, డ్రాఔట్స్ లేకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు.
కళ్లు తెరిచి అభివృద్ధిని చూడండి:నాయిని
భోలక్‌పూర్‌లోని ఎస్సీ బాలికల వసతి గృహంలో సన్నబియ్యం పథకాన్ని రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి కూడా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బంగారు తెలంగాణను సాకారం చేసేందుకు సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారన్నారు. ఈ పథకాలను చూసి ఓర్వలేని టీడీపీ, కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఇకనైనా వారు కళ్లు తెరిచి తాము చేపట్టే అభివృద్ధికి సహకరించాలని కోరారు.
పేద విద్యార్థుల పోరాట ఫలితమిది..
అఫ్జల్‌గంజ్: సంక్షేమ హాస్టళ్లలో సన్నబియ్యం సరఫరా పేద విద్యార్థుల పోరాట విజయమని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్.కృష్ణయ్య అన్నారు. గురువారం కింగ్‌కోఠిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రభుత్వ బీసీ కళాశాల బాలుర వసతి గృహంలో సన్న బియ్యం పథకాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత ఆరు నెలలుగా సన్న బియ్యం సరఫరా కోసం విద్యార్థులు చేసిన పోరాటానికి స్పందించిన ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించిందన్నారు. లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల తరఫున ప్రభుత్వానికి ధన్యవాదాలు చెబుతున్నానన్నారు. సన్న బియ్యం సరఫరా విషయంలో భవిష్యత్తులో అక్రమాలు జరగకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రాధిక, బీసీ మహిళా సంఘం అధ్యక్షులు శారదాగౌడ్, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి సంఘం అధ్యక్షులు కె.నర్సింహ నాయక్, విద్యార్థి నేతలు పి.సతీష్‌కుమార్, రేపాక రాంబాబు, సీహెచ్ శ్రీనివాస్ యాదవ్, ప్రభాకర్, రతన్, వెంకటేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు.
ఒకే పథకాన్ని వేర్వేరుగా ప్రారంభించిన దత్తాత్రేయ, నాయిని
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హాస్టళ్లలో సన్న బియ్యంతో భోజనం కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి దత్తాత్రేయ, రాష్ట్ర మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఒకే హాస్టల్‌లో వేర్వేరుగా ప్రారంభించారు. ఈ పథకం ప్రారంభానికి అధికారులు భోలక్‌పూర్‌లోని బాలికల ఎస్సీ వసతి గృహాన్ని ఎంపిక చేశారు. కేంద్ర మంత్రి దత్తాత్రేయకు, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్‌కు సమాచారం అందించారు. దత్తాత్రేయ, లక్ష్మణ్‌లు అనుకున్న సమయానికి రాగా నాయిని నర్సింహారెడ్డి కోసం దాదాపు 45 నిమిషాలు వేచి చూశారు. ఫోన్ చేసినా అందుబాటులోకి రాలేదు. దీంతో ఈ కార్యక్రమాన్ని దత్తాత్రేయ, లక్ష్మణ్‌లు ప్రారంభించి వెళ్లిపోయారు. ఆ తరువాత అరగంటకు మంత్రి నాయిని నర్సింహారెడ్డి హాస్టల్‌కు చేరుకున్నారు. హాస్టల్ వార్డెన్‌కు సన్న బియ్యం అందజేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. అంతకుముందు విద్యార్థుల మధ్య న్యూ ఇయర్ కేక్ కట్ చేశారు.