ఖమ్మం : దొడ్డు బియ్యంతో వండిన ముద్ద అన్నం తినలేక.. ఆలాగని పస్తులు ఉండలేక ఇబ్బంది పడుతున్న పేద విద్యార్థులకు మంచిరోజులు వస్తున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే మాధ్యాహ్న భోజనంతో పాటు సంక్షేమ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలల విద్యార్థులకు పెట్టే భోజనానికి జనవరి ఒకటో తేదీ నుంచి సన్న బియ్యం(ఫైన్ రైస్) అందజేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలనే ప్రభుత్వ నిర్ణయం పట్ల విద్యావేత్తలు, సంక్షేమ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పథకం అమలు తీరు ఎలా ఉంటుందోననే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కాగా, ప్రతిష్టాత్మకంగా అమలు చేసేందుకు ఉన్నతాధికారులు ఆయా శాఖల అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు.
4 లక్షల మందికి ప్రయోజనం...
సన్నబియ్యం పథకంతో జిల్లాలో 2400 ప్రాథమిక పాఠశాలల్లో చదివే 1,17,013 మం ది, 474 ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే 63,679 మంది, 411 ఉన్నత పాఠశాలల్లో చదివే 43,458 మంది విద్యార్థులకు, 63 బీసీ హాస్టళ్లకు చెందిన 5,977 మంది, 71 ఎస్సీ హాస్టళ్లలో ఉండే 5,620 మంది విద్యార్థులకు ప్రయోజనం కలుగనుంది. 33 కేజీబీవీల్లో చదువుతున్న 5,470 బాలికలు, 121 ఎస్టీ ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 35 వేల మందితోపాటు ఇతర ఇంటిగ్రేటెడ్, మెట్రిక్, పోస్టు మెట్రిక్ పాఠశాలలు, హాస్టళ్లలో ఉండే విద్యార్థులు ఇక నాణ్యమైన భోజనం అందనుంది.
తీరనున్న ‘దొడ్డు’ బాధలు
హాస్టళ్లు, మధ్యాహ్న భోజనం తయారీలో కూరగాయలు, వంట సామగ్రి కోసం గతంలో కంటే నిధులు పెంచినా.. దొడ్డు బియ్యం.. అవికూడా పురుగులు పట్టినవి, ముక్కిపోయినవి పంపడంతో గత్యంతరం లేక వాటినే వండిపెట్టేవారు. బియ్యం నాణ్యంగా లేకపోవడంతో భోజనం ముద్దగా అయ్యేది. ఇందులో ఏ కూర వడ్డించినా రుచించదు. దీనికి తోడు ఇదే అదునుగా మధ్యాహ్న భోజన ఏజెన్సీలు, హాస్టల్ మేనేజ్‌మెంట్ కాంట్రాక్టర్లు ప్రతి రోజూ నీళ్ల చారుతోనే సరిపెట్టేవారు. దీంతో విద్యార్థులు ముద్ద అన్నం, నీళ్ల చారు తినలేక.. ఆలాగని పస్తులు ఉండలేక అర్ధాకలితో అలమటించేవారు. సన్న బియ్యం సరఫరా అయితే కూరలు ఎలా ఉన్న అన్నం మాత్రం తినడానికి అనువుగా ఉంటుందని, పస్తులుండే సరిస్థితి రాదని విద్యార్థులు అంటున్నారు.
నెలకు 1208 మెట్రిక్ టన్నులు సరఫరా...
జిల్లాలోని వివిధ పాఠశాలలు, సంక్షేమ, ఇతర ఆశ్రమ, కస్తూర్బాగాందీ బాలికల పాఠశాలల్లో విద్యార్థులకు, అంగన్‌వాడీ కేంద్రాలకు నెలకు 1208 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు. ఇందులో ఎస్సీ హాస్టళ్లకు 73 మెట్రిక్ టన్నులు, ఎస్టీ హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలకు 333 మెట్రిక్ టన్నులు, బీసీ హాస్టళ్లకు 60, ఇతర వసతి గృహాలకు 100, పీఎస్‌లకు 142, యూపీఎస్‌లకు 118, 9,10 తరగతుల విద్యార్థులకు 112 , అంగన్‌వాడీ కేంద్రాలకు 270 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా చేస్తున్నారు.
అమలుపై అనుమానాలు..
విద్యార్థులకు సన్న బియ్యం సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించడం హర్షణీయమే అయినా... ఈ పథకం అమలు తీరు ఏలా ఉంటుందో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పాఠశాలలకు బియ్యం సరఫరా చేసేందుకు ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారుల నుంచి తహశీల్దార్లకు ఆర్‌వోలు వెళ్తాయి. వారు అంగీకరిస్తే ఎంఎల్‌ఎస్ పాయింట్ల ద్వారా బియ్యం సరఫరా అవుతాయి.
అక్కడి నుంచి డీలర్లు పేదలకు అందించే బియ్యంతోపాటు, పాఠశాలలకు అందించే బియ్యం కూడా తీసుకొస్తుంటారు. ఈ పరిస్థితుల్లో సన్న బియ్యం పాఠశాలలకు పంపడంలో చేతులు మారే అవకాశం ఉంది. గతంలో ఎంఎల్‌ఎస్ పాయింట్లకు వచ్చిన బియ్యంలో మేలిమి రకమైనవి పాఠశాలలకు అందజేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినా డీలర్లు, ఎంఎల్‌ఎస్ పాయింట్ అధికారులు కుమ్మక్కై మేలిమి బియ్యాన్ని పక్కదారి పట్టించిన సందర్బాలున్నాయి.
దీంతోపాటు పాఠశాలల్లో బియ్యం మాయం కావడం వంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ఇప్పుడు సన్న బియ్యం సరఫరా అయినా ఇలాంటివి ఇంకా పెరిగే ప్రమాదం ఉందనే ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం లెవీ తగ్గించడంతో పాటు ఈ సంవత్సరం ఉత్పత్తి కూడా తగ్గింది. సాగైన పంటలో సగానికి పైగా దొడ్డు రకం ధాన్యమే. ఇలాంటి పరిస్థితిలో సన్న బియ్యం సరఫరాకు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.
‘సంక్షేమానికి’ సన్నబియ్యం
Published Sat, Dec 27 2014 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 6:47 PM
Advertisement
Advertisement