పిల్లల కూడు తినేస్తున్నారు
చింతలపూడి బాలికల ఇంటిగ్రేటెడ్ హాస్టల్‌లో అక్రమాలు
నెలకు రూ.50 వేలకు పైనే కైంకర్యం
హాస్టళ్లలో వేళ్లూనుకున్న అవినీతికి ఇదో మచ్చుతునక
ఏసీబీ తనిఖీలో బట్టబయలు
స్టాక్ , అటెండెన్స్ రిజిస్టర్లు స్వాధీనం
చింతలపూడి, న్యూస్‌లైన్ : పేద విద్యార్థుల పేరుచెప్పి జేబులు నింపుకోవడం సంక్షేమ హాస్టళ్ల అధికారులకు మామూలైపోరుుంది. పిల్లల సంఖ్యను ఎక్కువగా చూపిస్తూ ప్రజాధనాన్ని కైంకర్యం చేస్తున్నారు. చింతలపూడిలోని బాలి కల సమగ్ర సంక్షేమ వసతి గృహం (ఇంటిగ్రేటెడ్ హాస్టల్)లో ఇలాంటి బాగోతమే సోమవారం వెలుగుచూసింది. 67 మంది పిల్లల్ని అదనంగా చూపించి నిధులను పక్కదారి పట్టిస్తున్న అధికారుల బండారం అవినీతి నిరోధక శాఖ అధికారుల తనిఖీల్లో బయటపడింది. ఒక్కో విద్యార్థి పేరిట రూ.27 చొప్పున రోజుకు రూ.1,800, నెలకు రూ.50 వేలకు పైగా నిధులను స్వాహా చేస్తున్నట్టు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. స్టాక్ రిజిస్టర్లు, హాస్టల్ అటెండెన్స్ రిజిస్టర్లను సీజ్ చేశారు. జిల్లాలోని ఇతర సాధారణ హాస్టళ్లలోనూ ఇలాంటి పరిస్థితులే ఉన్నాయనడానికి ఇదే ఓ ఉదాహరణ. వివరాల్లోకి వెళితే...చింతలపూడి సాంఘిక సంక్షేమ శాఖ బాలికల సమగ్ర వసతి గృహంలో సోమవారం అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏలూరు ఏసీబీ డీఎస్పీ ఐ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సీఐలు యూజే విల్సన్, టి.కొమరయ్య, ఉదయం 6 గంటలకే హాస్టల్‌కు చేరుకున్నారు. బృందాలుగా విడిపోయి తనిఖీలు చేపట్టారు. వసతి గృహంలో ఆశ్రయం పొందుతున్న బాలి కల సంఖ్యపై ఆరా తీశారు. ఏఎస్‌డబ్ల్యువో జీవీ సత్యనారాయణ సమక్షంలో వసతి గృహం సంక్షేమాధికారి మంగారత్నం నుంచి వివరాలు సేకరించారు.
67 మందిని అదనంగా చూపించారు
తనిఖీల అనంతరం ఏసీబీ డీఎస్పీ వెంకటేశ్వర్లు విలేకరులతో మాట్లాడారు. వసతి గృహంలో 400 మంది బాలికలకు వసతి కల్పించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. హాజరు పట్టీ ప్రకారం 3 నుంచి 10వ తరగతి వరకు చదివే 365 మంది బాలికలు హాస్టల్‌లో ఉంటున్నట్టు నమోదు చేశారని చెప్పారు. అరుుతే, 298 మాత్ర మే వసతి గృహంలో ఉంటున్నట్టు తనిఖీల్లో తేలిందన్నారు. ఈ హాస్టల్ పిల్లలు చదువుతున్న జిల్లా పరిషత్ బాలికల హైస్కూల్ హాజరు పట్టీని పరిశీలించగా, సుమారు 67 మంది బాలికలను హాస్టల్ రికార్డుల్లో అదనంగా చూపించినట్టు తేలిందని తెలిపారు. హాస్టల్ రికార్డుల ప్రకారం 365 మంది విద్యార్థినులు జిల్లా పరిషత్ హైస్కూల్‌లో చదువుతున్నట్టు ఉందని, వారందరి పేర్లు స్కూల్ హాజరుపట్టీలో నమోదైనా 67 మంది విద్యార్థులు ఒక్కసారి కూడా పాఠశాలకు వెళ్లిన దాఖలాలు లేవన్నారు.
స్కూల్ హాజరు పట్టీలో వారందరికీ గైర్హాజరు పడుతుండగా, హాస్టల్ రికార్డుల్లో మాత్రం హాజరు నమోదవుతోందని వివరించారు. స్టాక్ రిజిస్టర్లలో కూడా తేడాలు ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ హాస్టల్‌లో ఏడాది మొత్తంమీద జరిగిన అవకతవకలపై సమగ్ర దర్యాప్తు చేపట్టామని చెప్పారు. స్టాక్ రిజిస్టర్లు, జిల్లా పరిషత్ హైస్కూల్, హాస్టల్ అటెండెన్స్ రిజిస్టర్లను సీజ్ చేసినట్లు వెల్లడించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తనిఖీలు చేశామన్నారు. దర్యాప్తు పూర్తయిన అనంతరం ఉన్నతాధికారులకు నివేదిక సమర్పిస్తామని, వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని డీఎస్పీ చెప్పారు.