హాస్టళ్లను దశలవారీగా మూసివేస్తున్న సర్కారు
ఇప్పటికే 22 మూసివేత
మరో 20 మూసివేసేందుకు రంగం సిద్ధం
విద్యార్థులకు శాపంగా మారనున్న ప్రభుత్వ నిర్ణయంస
పిఠాపురం : నిరుపేద విద్యార్థుల చదువుకు తోడ్పడుతున్న సంక్షేమ వసతి గృహాలకు ప్రభుత్వం ఎసరు పెడుతోంది. వాటిని దశల వారీగా మూసివేస్తూ.. పేదలకు చదువును దూరం చేస్తోంది. వార్డెన్‌కు సైతం తెలియకుండా ‘వసతి’కి ప్రభుత్వం ఎసరు పెడుతున్న తీరుపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్ధి సంఘాల నాయకులు మండిపడుతున్నారు.
వాస్తవానికి వసతి గృహాలను దశలవారీగా మూసివేసే పనికి ప్రభుత్వం గత ఏడాదే శ్రీకారం చుట్టింది. గత ఏడాది ఎస్సీ వసతి గృహాలను మాత్రమే మూసివేయగా దానిని ఈ ఏడాది ఎస్టీ, బీసీ హాస్టళ్లకు కూడా విస్తరించింది. జిల్లాలో సాంఘిక సంక్షేమ వసతి గృహాలు 94, బీసీ సంక్షేమ వసతి గృహాలు 120 ఉన్నాయి. వీటిలో సుమారు 9400 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు.
గత ఏడాది 22 సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న ఎస్సీ వసతి గృహాలను మూసివేయగా, ఈ ఏడాది మరో 20 ఎస్సీ, బీసీ వసతి గృహాలను మూసివేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. దీంతో సుమారు 1500 మంది విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని విద్యార్థి సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
వారి వేలితోనే వారి కన్ను పొడిచేలా..
వార్డెన్ల వేలితోనే వారి కన్ను పొడిచేలా వ్యవహరిస్తోంది ప్రభుత్వం. జిల్లాలోని హాస్టళ్లలో గత మూడేళ్లకు సంబంధించిన విద్యార్థుల వివరాలతో నివేదికలు ఇవ్వాలని ఉన్నతాధికారులు మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. విద్యార్థులు తక్కువగా (వందలోపు) ఉన్న హాస్టళ్లను వెంటనే మూసివేయాల్సిందిగా ఆయా వార్డెన్లే అభ్యర్థించినట్లుగా నివేదికలను మారుస్తూ, వాటిని మూసివేస్తున్నట్లు ఉత్తర్వులు ఇస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఎవ్వరికీ అనుమానం రానివిధంగా వేసవి సెలవుల్లో విద్యార్థులు ఇళ్లకు వెళ్లినప్పుడు ఈ తతంగం చేపడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇతర శాఖలకు వార్డెన్ల బదిలీ!
మూసివేసే హాస్టళ్ల వార్డెన్లను ఇతర శాఖలకు బదిలీ చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ మేరకు ఎవరు ఏ శాఖకు వెళతారో ఆప్షన్ ఇవ్వాల్సిందిగా వార్డెన్లను అధికారులు ఆదేశిస్తున్నారు. కొందరు గ్రామ కార్యదర్శులుగానూ మరికొందరు వీఆర్‌ఓలుగాను వెళ్లేందుకు సుముఖత వ్యక్తం చేస్తూ దరఖాస్తులు ఇచ్చినట్లు సమాచారం.
వీధిన పడనున్న సిబ్బంది కుటుంబాలు
హాస్టళ్ల మూసివేత పుణ్యమా అని.. వాటిల్లో పని చేసే ఆయాలు, వాచ్‌మన్‌లు, వంటపనివారు, సహాయకులు సుమారు 120 మంది ఉపాధి కోల్పోనున్నారు. ప్రభుత్వ నిర్ణయంతో తమ కుటుంబాలు వీధిన పడతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వార్డెన్లకు ప్రత్యామ్నాయం కల్పిస్తున్న ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదంటూ సిబ్బంది వాపోతున్నారు.
క్రమబద్ధీకరణ మాత్రమే..
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నచోట హాస్టళ్లను మూసివేస్తున్నాం. అలాగే, అద్దె భవనాల్లో ఉన్న వసతి గృహాలను మూసివేసి, అక్కడి విద్యార్థులకు అందుబాటులో ఉన్న హాస్టళ్లలో ఆ విద్యార్థులకు వసతి కల్పిస్తాం. వార్డెన్లను ఇతర శాఖలకు బదిలీ చేసే ప్రక్రియ ఏదీ చేపట్టలేదు. ప్రభుత్వ నిర్ణయాన్నిబట్టి తదుపరి చర్యలుంటాయి. అన్ని హాస్టళ్లూ మూసివేస్తారన్న దానిలో నిజం లేదు.
- ఎంసీ శోభారాణి, డీడీ, సాంఘిక సంక్షేమ శాఖ, కాకినాడ
మాకు ఇబ్బందే..
మా అమ్మానాన్న నిరుపేదలు. వాళ్లు చదువు చెప్పించలేని పరిస్థితుల్లో హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. నాలాగే చాలామంది వసతి గృహాల వల్లే చదువుకుంటున్నారు. వీటిని మూసివేస్తే మాకు ఇబ్బందే.
- ఆర్.పవన్‌కుమార్, విద్యార్థి, ఉప్పాడ
హాస్టళ్లే దొరికాయా?
పేద విద్యార్థులకు విద్యనందించడానికి ఉద్దేశించిన హాస్టళ్లే దొరికాయా మూసివేయడానికి? ఎటువంటి ప్రయోజనం లేని పథకాలు ఎన్నో ఉన్నాయి. అలాంటివాటిని తగ్గించి ఆదాయం పెంచుకోవాలి. అంతేకానీ మాలాంటి నిరుపేదల ఆసరాను తొలగించడం చాలా అన్యాయం.
- సీహెచ్ చిన్న, విద్యార్థి, ఉప్పాడ
‘వసతి’కి ఎసరు!
Published Wed, Apr 6 2016 12:53 AM | Last Updated on Sun, Sep 3 2017 9:16 PM
Advertisement