నిడదవోలు ప్రభుత్వాసుపత్రిలో నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న కలెక్టర్ కాటంనేని భాస్కర్, ఎంపీ మురళీమోహన్
నిడదవోలు : సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో పేద రోగులకు ప్రతి రోజూ భోజన వసతి కల్పించడం వారిలో ఉన్న సేవా సంకల్పానికి నిదర్శనమని జిల్లా కలెక్టర్ కాటంనేటి భాస్కర్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో సత్యపాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సత్యసాయి నిత్యాన్న సేవా పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ రూ.6.25 లక్షల ఆర్థిక సహకారంతో ఆసుపత్రి ముఖద్వారం గేటు, ఆవరణలో నిర్మించిన సీసీ రోడ్డును కలెక్టర్ ప్రారంభించారు. పాత ఆసుపత్రి భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వంటశాలలో రోగులకు కలెక్టర్ స్వయంగా భోజనాలను వడ్డించి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందడంతో రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నారని పేర్కొన్నారు.
త్వరలో తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చామన్నారు. ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ నిడదవోలు రైల్వేగేటు వద్ద 6 నెలల్లో ఆర్వోబీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు నిత్యన్నదాన కార్యక్రమానికి మా వంతు సహాయంగా సొంత నిధులు రూ.2 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి లక్ష రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు, శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, బూరుగుపల్లి శ్రీనివాస్, సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు కానుమిల్లి శశి శేఖరరావు, డీసీహెచ్‌ఎస్ కె.శంకరరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గూడపాటి వెంకట్రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment