Sathya Sai Seva Trust
-
సత్యసాయి మహా సమాధి దర్శనం రద్దు
పుట్టపర్తి అర్బన్: కరోనా నేపథ్యంలో సత్యసాయి మహాసమాధి దర్శనాన్ని ఈ నెల 28 నుంచి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ మంగళవారం తెలిపారు. సాయికుల్వంత్ మందిరంలో ప్రతి రోజూ జరిగే వేదపఠనం, భజన కార్యక్రమాలు కొనసాగుతాయని పేర్కొన్నారు. భక్తులు వీటిని ఆన్లైన్, ఫేస్‌బుక్‌లలో తిలకించవచ్చన్నారు. మహాసమాధి దర్శనం తిరిగి ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని త్వరలో తెలియజేస్తామన్నారు. -
వేడుకగా సత్యసాయి జయంతోత్సవాలు
పుట్టపర్తి అర్బన్: అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయి బాబా 92వ జయంతి వేడుకలు శనివారం వేణుగోపాల స్వామి రథోత్సవంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.45 గంటల సమయంలో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్జే రత్నాకర్రాజు, ప్రసాదరావు, ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్‌పాండే, రాష్ట్ర అధ్యక్షుడు చలం తదితరులు ప్రశాంతి నిలయం ఉత్తర ద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. దారి వెంట సాయి నామస్మరణతో పుట్టపర్తి హోరెత్తింది. అంతకు ముందు ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ హాల్లో సత్యసాయి మహా సమాధిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అక్కడే సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను రథంలో ప్రతిష్టించి ఊరేగించారు. కాగా, ప్రశాంతి నిలయం నార్త్ బ్లాక్ వద్ద ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో వివిధ దేశాలకు చెందిన సుమారు 55 మంది వైద్యులు పాల్గొన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరం 25వ తేదీ వరకు కొనసాగుతుందని సత్యసాయి ఐడిల్ హెల్త్‌కేర్ చైర్మన్ నరేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. 20, 21 తేదీల్లో అంతర్జాతీయ వేద సమావేశం దేశంలో తొలిసారిగా పుట్టపర్తిలో నిర్వహణ సాక్షి, అమరావతి: ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు వాటికి వేదాల్లో సూచించిన పరిష్కారాలపై రెండు రోజుల అంతర్జాతీయ వేద సమావేశాలకు అనంతపురం జిల్లా పుట్టపర్తి వేదిక కానుంది. ఈనెల 20, 21 తేదీల్లో జరిగే ఈ అంతర్జాతీయ వేద సమావేశంలో వేద పండితులతో పాటు వివిధ మతాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నట్లు సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ (ఇండియా) అధ్యక్షుడు నిమీష్ పాండే తెలిపారు. సత్యసాయి బాబా 92వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో వేదాలపై పరిశోధన చేసి వేద పండితులు ప్రస్తుత సమస్యలను ఏ విధంగా పరిష్కరించవచ్చో చర్చించనున్నట్లు తెలిపారు. మంచి నీటి ఎద్దడి, వ్యవసాయం, వాతావరణం, ఆహార కొరత వంటి సమస్యలకు వేదాల్లో పరిష్కారాలపై చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారు. 1,500 మందికిపైగా సత్యసాయి శిష్యులతో పాటు 42 దేశాలకు చెందిన 600 మంది సామూహిక వేదపారాయణంలో పాల్గొననున్నారు. -
ప్రభుత్వాసుపత్రుల్లో భోజన వసతి
నిడదవోలు : సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ప్రభుత్వాసుపత్రుల్లో పేద రోగులకు ప్రతి రోజూ భోజన వసతి కల్పించడం వారిలో ఉన్న సేవా సంకల్పానికి నిదర్శనమని జిల్లా కలెక్టర్ కాటంనేటి భాస్కర్ అన్నారు. పట్టణంలోని ప్రభుత్వాసుపత్రిలో సత్యపాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సత్యసాయి నిత్యాన్న సేవా పథకాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు. శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ రూ.6.25 లక్షల ఆర్థిక సహకారంతో ఆసుపత్రి ముఖద్వారం గేటు, ఆవరణలో నిర్మించిన సీసీ రోడ్డును కలెక్టర్ ప్రారంభించారు. పాత ఆసుపత్రి భవనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వంటశాలలో రోగులకు కలెక్టర్ స్వయంగా భోజనాలను వడ్డించి నిత్యాన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్ భాస్కర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో క్షేత్రస్థాయిలో మెరుగైన సేవలు అందడంతో రోగుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతున్నారని పేర్కొన్నారు. త్వరలో తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం ప్రభుత్వాసుపత్రుల్లో ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చామన్నారు. ఎంపీ మాగంటి మురళీమోహన్ మాట్లాడుతూ నిడదవోలు రైల్వేగేటు వద్ద 6 నెలల్లో ఆర్వోబీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తామని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు నిత్యన్నదాన కార్యక్రమానికి మా వంతు సహాయంగా సొంత నిధులు రూ.2 లక్షల విరాళాన్ని అందిస్తున్నట్టు ప్రకటించారు. మున్సిపల్ చైర్మన్ బొబ్బా కృష్ణమూర్తి లక్ష రూపాయలు విరాళంగా అందిస్తున్నట్టు ప్రకటించారు. ఎమ్మెల్సీ రాము సూర్యారావు, శశి విద్యాసంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, బూరుగుపల్లి శ్రీనివాస్, సత్యసాయి సేవా సంస్థల జిల్లా అధ్యక్షుడు కానుమిల్లి శశి శేఖరరావు, డీసీహెచ్ఎస్ కె.శంకరరావు, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కొమ్మిన వెంకటేశ్వరరావు, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గూడపాటి వెంకట్రావు పాల్గొన్నారు. -
సామాజిక సేవే సత్యసాయి ట్రస్టు లక్ష్యం
తాడిపత్రి టౌన్ : సేవా ధృక్పథమే శ్రీ సత్యసాయి బాబా లక్ష్యమని, వాటికి అనుగుణంగా శ్రీసత్యసాయి సేవా సంస్థలు, సత్యసాయి ట్రస్ట్ పని చేస్తున్నాయని సత్యసాయి సేవా సమితి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఆర్జె రత్నాకర్ పేర్కొన్నారు. స్థానిక వాటర్ వర్స్స్ రోడ్డులో సత్యసాయి సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన శ్రీ సత్యసాయి లక్ష్మీనారాయణ స్వామి వృత్తి విద్యా శిక్షణా కేంద్రాన్ని గురువారం సత్యసాయి సేవా సమితి సెంట్రల్ ట్రస్ట్ ట్రస్టీ ఆర్జే రత్నాకర్ ప్రారంభించారు. అనంతరం స్థానిక సత్యసాయి సేవా సమితి ఆధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రత్నాకర్ మాట్లాడుతూ సత్యసాయి స్పూర్తిగా తీసుకుని పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా గత 18 సంవత్సరాలు 1500 గ్రామాల్లో సత్యసాయి ట్రస్ట్ ద్వారా ప్రజలకు నీటి సదుపాయం కల్పిస్తున్నామన్నారు. సత్యసాయి సేవా ట్రస్టు ద్వారా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఉచిత వృత్తి విద్యా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. క్రమశిక్షణతో శిక్షణ పొందాలని నిరుద్యోగ యువకులకు ఆయన పిలుపు నిచ్చారు. సత్యసాయి సేవా ట్రస్ట్ అధ్యక్షుడు హెచ్‌జె దొర మాట్లాడుతూ ఉపాధి శిక్షణతోపాటు, ఆధ్యాత్మిక చింతన విద్యార్థులు అలవరచుకోవాలన్నారు. శ్రీ సత్యనాయి సాధన ట్రస్ట్ సభ్యుడు లక్ష్మినారాయణ, సత్యసాయి సేవా సంస్థల ఆల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రమణి, రాష్ట్ర అధ్యక్షుడు చలం, అనంతపురం సేవా సంస్థల అధ్యక్షుడు రామాంజప్ప,స్టేట్ కో ఆర్డినేటర్ కృష్ట కుమార్, తాడిపత్రి సత్యసాయి సేవా సమితి కన్వీనర్ వెంకట్రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం వృత్తి విద్యా శిక్షణ కోర్సు విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు దుస్తులు పంపిణీ చేశారు.