పుట్టపర్తి అర్బన్: అనంతపురం జిల్లా పుట్టపర్తి సత్యసాయి బాబా 92వ జయంతి వేడుకలు శనివారం వేణుగోపాల స్వామి రథోత్సవంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.45 గంటల సమయంలో సత్యసాయి ట్రస్ట్ సభ్యులు ఆర్‌జే రత్నాకర్‌రాజు, ప్రసాదరావు, ప్రభుత్వ చీఫ్ విప్ పల్లె రఘునాథరెడ్డి, సత్యసాయి సేవా సంస్థల జాతీయ అధ్యక్షుడు నిమీష్‌పాండే, రాష్ట్ర అధ్యక్షుడు చలం తదితరులు ప్రశాంతి నిలయం ఉత్తర ద్వారం వద్ద కొబ్బరికాయలు కొట్టి రథోత్సవాన్ని ప్రారంభించారు. దారి వెంట సాయి నామస్మరణతో పుట్టపర్తి హోరెత్తింది.
అంతకు ముందు ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్ హాల్‌లో సత్యసాయి మహా సమాధిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. అక్కడే సీతారాముల కల్యాణం నిర్వహించారు. ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను రథంలో ప్రతిష్టించి ఊరేగించారు. కాగా, ప్రశాంతి నిలయం నార్త్ బ్లాక్ వద్ద ఏర్పాటుచేసిన వైద్య శిబిరంలో వివిధ దేశాలకు చెందిన సుమారు 55 మంది వైద్యులు పాల్గొన్నారు. వైద్య పరీక్షల అనంతరం ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరం 25వ తేదీ వరకు కొనసాగుతుందని సత్యసాయి ఐడిల్ హెల్త్‌కేర్ చైర్మన్ నరేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు.
20, 21 తేదీల్లో అంతర్జాతీయ వేద సమావేశం
దేశంలో తొలిసారిగా పుట్టపర్తిలో నిర్వహణ
సాక్షి, అమరావతి: ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు వాటికి వేదాల్లో సూచించిన పరిష్కారాలపై రెండు రోజుల అంతర్జాతీయ వేద సమావేశాలకు అనంతపురం జిల్లా పుట్టపర్తి వేదిక కానుంది. ఈనెల 20, 21 తేదీల్లో జరిగే ఈ అంతర్జాతీయ వేద సమావేశంలో వేద పండితులతో పాటు వివిధ మతాలకు చెందిన ప్రముఖులు పాల్గొంటున్నట్లు సత్యసాయి సేవా ఆర్గనైజేషన్ (ఇండియా) అధ్యక్షుడు నిమీష్ పాండే తెలిపారు. సత్యసాయి బాబా 92వ జయంతి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ సమావేశంలో వేదాలపై పరిశోధన చేసి వేద పండితులు ప్రస్తుత సమస్యలను ఏ విధంగా పరిష్కరించవచ్చో చర్చించనున్నట్లు తెలిపారు. మంచి నీటి ఎద్దడి, వ్యవసాయం, వాతావరణం, ఆహార కొరత వంటి సమస్యలకు వేదాల్లో పరిష్కారాలపై చర్చించనున్నారు. తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్ ప్రారంభిస్తారు. 1,500 మందికిపైగా సత్యసాయి శిష్యులతో పాటు 42 దేశాలకు చెందిన 600 మంది సామూహిక వేదపారాయణంలో పాల్గొననున్నారు.
వేడుకగా సత్యసాయి జయంతోత్సవాలు
Published Sun, Nov 19 2017 1:22 AM | Last Updated on Sun, Nov 19 2017 1:25 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment