విద్యార్థుల డ్రాపౌట్స్ నివారించడం...అలాగే పిల్లల్లో పోషకాహారలేమి సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో భోజన పథకం అమలవుతోంది.
మధ్య తరగతి, నిరుపేద కుటుంబాలకే కాదు...మధ్యాహ్న భోజన పథకానికీ కూరగాయల ధరలసెగ తాకింది. పాఠశాలలు ప్రారంభమై ఐదునెలలు గడిచినా ఇప్పటి వరకు పిల్లల దరికి రుచికర ఆహారం చేరలేదు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో మెనూ అమలుకు ఎక్కడికక్కడ బ్రేక్ పడింది. వారానికి రెండుకోడిగుడ్లే అందివ్వలేమని ఏజెన్సీల నిర్వాహకులు వాపోతుంటే... వారంలో ఆరురోజులు ఎలా అందించాలని హాస్టలు వార్డన్లు తలపట్టుకుంటున్నారు.
సాక్షి, కడప: విద్యార్థుల డ్రాపౌట్స్ నివారించడం...అలాగే పిల్లల్లో పోషకాహారలేమి సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో భోజన పథకం అమలవుతోంది. ఈ పథకంలో భాగంగా రుచికరమైన ఆహారాన్ని అందించాల్సి ఉంది. అయితే ప్రస్తుతం కొండెక్కిన కూరగాయల ధరలతో ఇది సాధ్యపడటం లేదు. గతేడాది మధ్యాహ్న భోజన మెనూలో మార్పులు చేశారు. అన్నం, సాంబారు వరకే దీన్ని పరిమితం చేయకుండా ఆకుకూరలు, ఇతర కూరగాయలతో కూడిన వంటకాలను కూడా మెనూలో పొందుపర్చారు. జిల్లాలో 3,450 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. అయితే ఈ విద్యాసంవత్సరం ఆరంభం నుంచి కూరగాయల ధరాఘాతం భోజన పథకాన్ని తాకింది. విద్యార్థుల చదువులు ముందుకు సాగాల్సిన సమయంలో రుచికరమైన ఆహారాన్ని అందించాల్సి ఉండగా పచ్చడి మెతుకులతోనే సరిపెడుతున్నారు. వారానికి రెండు కోడిగుడ్లు అందించాల్సి ఉండగా చాలాచోట్ల ఒక్కటీ ఇవ్వట్లేదు.
ధరలు తగ్గాలి...
లేదా భత్యం పెంచాలి:
కూరగాయల ధరలు తగ్గడం లేదా ఏజె న్సీలకు ఇచ్చే భత్యం పెంపుదలతోనే భోజన పథకానికి తంటాలు తప్పనున్నాయి. గత విద్యా సంవత్సరం ముగింపు దశలో ఉన్న కూరగాయల ధరలకు ఇప్పటికి పెరుగుదల 70శాతానికి పైబడి ఉంది.
గతంలో కందిపప్పు కిలో 53 రూపాయలు ఉంటే ఇప్పుడు 70-80 రూపాయలకు చేరింది. మొన్నటి వరకూ డజన్ కోడిగుడ్లు 34 రూపాయలు ఉంటే ప్రస్తుతం 48 రూపాయలకు చేరాయి. అదే విధంగా టమోటా ధరలు ఐదునెలలుగా ఆకాశం దిగని పరిస్థితి.
ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో చదివే విద్యార్థులకు రోజుకు 4రూపాయలు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రోజుకు 4.65 రూపాయల చొప్పున భోజనానికి ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. ఈ నిధులతో సింగిల్ టీ కూడా రాదు. కానీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఈ నిధులతో 100 గ్రాముల అన్నం, 150 గ్రాముల కూరగాయలను ఏజెన్సీలు వడ్డించాలి. వారానికి రెండు కోడిగుడ్లు, అరటికాయలు, పండ్లు, ఆకుకూరలతో కూడిన వంటకాలు అందించాలి. అయితే కోడిగుడ్డు ధర దాదాపు 4 రూపాయలు ఉంటే అంతే ధరకు విద్యార్థి రోజుకు అవసరమయ్యే భోజనం అందించాలంటే ఎలా? అని ఏజెన్సీల నిర్వాహకులు ఆక్రోశం వెలిబుచ్చుతున్నారు.
దీనికి తోడు బకాయిల బరువు కూడా ఏజెన్సీల నిర్వాహకులను బాధకు గురి చేస్తోంది.
భోజన పథకం అమలుకు వంటగ్యాస్ ఇవ్వాల్సి ఉండగా కొన్ని మండలాల్లో నేటికీ ఇవ్వలేదు. ఉన్న మండలాల్లో సబ్సిడీ సిలెండర్లు ఏడాదికి 9మాత్రమే ఇవ్వాలనే నిబంధనతో నిర్వాహకులు అల్లాడుతున్నారు. దీనికి తోడు వంట సామగ్రి కూడా ఏజెన్సీలు బయట నుంచి అద్దెకు తీసుకోవాల్సి వస్తోంది.
ఉన్నత పాఠశాలల్లో వందల మంది విద్యార్థులుంటారు. వారికోసం వంట చేసేందుకు, ఆహారం వడ్డించడానికి ఏజెన్సీల వద్ద సామాన్లు లేవు. ప్రభుత్వమే వాటిని అందించాలని గత కొన్నేళ్లుగా నిర్వాహకులు కోరుకుంటున్నా పట్టించుకోవడం లేదు.
హాస్టళ్లలోనూ అదే పరిస్థితి:
ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలకూ ధరల సెగ తాకింది. జిల్లాలో 219 హాస్టళ్లలో 17,331 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ శనివారం మినహా తక్కిన అన్ని రోజుల్లో గుడ్లు అందించాలి. రోజూ ఆకు, కాయగూరల పప్పు, సాంబారు అందించాలి. పెరిగిన ధరలతో దాదాపు ఏ సంక్షేమ హాస్టలులో కూడా పూర్తిస్థాయి మెనూ అమలు కావడం లేదు. ఈ విషయాన్ని ఇటీవల సాంఘిక సంక్షేమశాఖ జేడీ సీఎస్‌ఏ ప్రసాద్ కూడా అంగీకరించారు.