సాక్షి, కడప : ప్రభుత్వ పాఠశాలల మనుగడ ఏడాదికేడాది ప్రశ్నార్థకమవుతోంది. జూన్ ఆరంభంలో బడి బాట అంటూ ప్రభుత్వం ప్రచార ఆర్భాటమే గానీ ఫలితం మాత్రం శూన్యం. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా నడుపుతున్నా అనేక ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయి. ఏడాదికేడాది విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంతో జిల్లాలో 2014-15కు సంబంధించి దాదాపు 25 పాఠశాలలు మూతపడ్డారుు. గత మూడు, నాలుగేళ్లలో దాదాపు 150కి పైగా పాఠశాలలు విద్యార్థులులేక మూతపడ్డాయి. ప్రైవేటు పాఠశాలల్లో ఎల్‌కేజీ నుంచి ఇంగ్లిషు మీడియం ప్రారంభం అవుతుండడం కూడా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించడానికి ఆసక్తి చూపుతున్నారని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. ప్రత్యేక దృష్టి సారించి 2015లో ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివిస్తేనే మంచి భవిష్యత్తు ఉంటుందన్న భరోసాను కల్పిస్తామని డీఈఓ ప్రతాప్‌రెడ్డి పేర్కొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎందుకు చేరడం లేదు.. ఉపాధ్యాయులు సక్రమంగా బోధించడం లేదా.. తదితర అంశాలపై వివరాలు సేకరించి భవిష్యత్తులో ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులు చేరేలా ఇప్పటి నుంచే విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.
నెలన్నరపాటు కొనసాగిన సర్వే
జిల్లాలోని అన్ని మండలాల్లో దాదాపు నెలన్నరపాటు డైస్(డిస్టిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్) సర్వే కొనసాగింది. రాజీవ్ విద్యామిషన్ ఇన్‌ఛార్జి ప్రాజెక్టు అధికారి ప్రతిభా భారతి ప్రత్యేక శ్రద్ధ తీసుకుని సర్వే పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. అన్ని మండలాల్లోని కంప్యూటర్ ఆపరేటర్లను కడపకు పిలిపించి కడపలోని ఉర్దూ పాఠశాలలో దాదాపు నెలన్నరపాటు వివరాలు సేకరించారు. ప్రధానోపాధ్యాయుల ద్వారా సమాచారం తెప్పించుకుని సర్వే చేపట్టారు.సర్వే దాదాపు పూర్తయింది.
అన్ని మండలాల్లో ప్రభుత్వ, ప్రైవేటు, ఇతర అన్ని విభాగాలకు సంబంధించిన మోడల్ పాఠశాలలు, నవోదయ, కేంద్రీయ, ఓరియంటల్, చెవిటి, మూగ అన్ని పాఠశాలలు, కళాశాలలు కలుపుకొని మరో 4601 మంది విద్యార్థులు ఉన్నట్లు తాజా సర్వేలో వెల్లడైంది. మొత్తమ్మీద జిల్లాలో ఒకటి నుంచి ఇంటర్ వరకు మొత్తం 488411 మంది విద్యార్థులున్నారు.
2015లో పాఠశాలలను పరిపుష్ఠి చేస్తాం! - ప్రతాప్‌రెడ్డి, డీఈఓ
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాపరంగానే కాకుండా అన్ని విషయాల్లో పాఠశాలలను మరింత పరిపుష్టం చేస్తామని డీఈఓ ప్రతాప్‌రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ పాఠశాలల పట్ల తల్లిదండ్రుల్లో నమ్మకం, భరోసా కల్పించేలా చర్యలుప్రారంభిస్తున్నామన్నారు. మధ్యాహ్న భోజన పథకంలో మార్పులు, చేర్పులు తీసుకురావడంతోపాటు...వారంలో ఒకరోజు ఒక పాఠశాలలో నిద్రించడం, విద్యార్థుల్లో చదువు పట్ల శ్రద్ధ పెంచడం, తల్లిదండ్రుల్లో అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలతో ముందుకు వెళతామన్నారు.
పడకేసిన బడి
Published Wed, Dec 24 2014 2:40 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM
Advertisement
Advertisement