సర్కారు స్కూళ్లకు పోటెత్తిన అడ్మిషన్లు | Admissions Rises in Government Schools | Sakshi
Sakshi News home page

మన బడి!

Published Thu, Jun 27 2019 9:21 AM | Last Updated on Fri, Jul 26 2019 6:25 PM

Admissions Rises in Government Schools - Sakshi

నాగోలు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు

ప్రైవేటు పాఠశాలల్లో చదువు కోసం భారీగా ఖర్చు చేసినా..ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడం... ప్రభుత్వ పాఠశాలలల్లో క్వాలిఫైడ్‌ టీచర్లతో ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాబోధన, ఉచిత పుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం, ఎలాంటి ఫీజులు లేకపోవడంతో ఈ ఏడాది వేలాది మంది విద్యార్థులు ప్రైవేటును వీడి ప్రభుత్వ బడిబాటపడుతున్నారు. గతంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలికసదుపాయాలు మెరుగుపడటంతోనగరంలోని అనేక మంది పేద, మధ్య తరగతి విద్యార్థులు ఆయా పాఠశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఫలితంగా గ్రేటర్లోని పలు ప్రభుత్వపాఠశాలలు ఇప్పుడు విద్యార్థులతోకళకళలాడుతున్నాయి.

సాక్షి, సిటీబ్యూరో: సర్కారు బడులకు ఈ విద్యా సంవత్సరం అడ్మిషన్లు పోటెత్తాయి. గత విద్యా సంవత్సరంతో పోలిస్తే ఈసారి పదిశాతానికి పైగా అడ్మిషన్లు పెరిగాయి. పెరిగిన ఫీజుల భారాన్ని తట్టుకోలేక ప్రైవేటు స్కూళ్లను వీడి ఈ విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో చేరిన విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరగడం విశేషం. హైదరాబాద్‌లో కొత్త గా 14,533, రంగారెడ్డిలో 20,548 అడ్మిషన్లు వచ్చాయి. ఇప్పటి వరకు ప్రైవేటు పాఠశాలలో చదువుకుని..తాజాగా హైదరాబాద్‌ జిల్లాలో 5053 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చేరగా, రంగారెడ్డి జిల్లాలో 5572 మంది విద్యార్థులు చేరడం గమనార్హం. ఇదిలా ఉంటే గవర్నర్‌ పర్యవేక్షణలో కొనసాగుతున్న రాజ్‌భవన్‌ ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు, ఉపాధ్యాయుల నిష్పత్తికి మించి అడ్మిషన్లు వచ్చాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా తమ విద్యార్థులను ఇక్కడ చేర్పించేందుకు తల్లిదండ్రులు పోటీపడ్డారు. సీటు కోసం ఎమ్మెల్యేలు, ఎంపీల నుంచి ఒత్తిళ్లు రావడం విశేషం. ఒక్కో తరగతిలో1:30 చొప్పున విద్యార్థులు ఉండాల్సి ఉంది కానీ...ప్రస్తుతం 45 నుంచి 60 మంది వరకు ఉన్నారు. బోరబండ ప్రభుత్వ పాఠశాలలోనూ ఇంతే పోటీ ఉండటం విశేషం. ఇప్పటికీ కొత్తగా అడ్మిషన్ల కోసం అనేక మంది వస్తున్నప్పటికీ..... ఖాళీలు లేక పోవడంతో వచ్చిన వాళ్లను తిప్పిపంపుతున్నట్లు ఆయా పాఠశాలల్లో పని చేస్తున్న అధ్యాపకులు చెబుతుండటం కొసమెరుపు. ఆయా పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంలో నాణ్యమైన బోధన అందుతుండటమే ఇందుకు కారణం.

అక్కడితో పోలిస్తే..ఇక్కడే ఫలితాలు మెరుగు
జిల్లాలో మొత్తం 710 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వీటిలో ఇప్పటికే సుమారు లక్ష మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. 2019–20 విద్యా సంవత్సరం లో కొత్తగా 14, 533 మంది విద్యార్థులు చేరారు. వీరిలో 6990 మంది అబ్బాయిలు కాగా, 7543 మంది అమ్మాయిలు ఉన్నారు. తరగతుల వారీగా పరిశీలి స్తే...1వ తరగతిలో 4264 మంది విద్యార్థులు చేరగా, 2వ తరగతిలో 1524 మంది, 3వ తరగతిలో 1228 మంది, 4వ తరగతిలో 870 మంది, 5వ తరగతితో 751మం ది, 6వ తరగతిలో 4617 మంది, 7వ తరగతిలో 588 మంది, 8వ తరగతిలో 473 మంది, 9వ తరగతిలో 176 మంది, 10వ తరగతిలో 42 మంది కొత్తగా చేరారు. ఒకటి, ఆరో తరగతిలో చేరిన వారిని మినహాయిస్తే...మిగిలిన వారంతా ఇప్పటి వరకు ఆయా ప్రైవేటు స్కూళ్లలో చదువుకుని, అక్కడి ఫీజుల భారం మోయలేక ప్రభుత్వ స్కూళ్లకు వచ్చినవారే. 10వ తరగతి వార్షిక ఫలితాల్లో ప్రైవేటు స్కూళ్ల కంటే ఎక్కువగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న విద్యా ర్థులే ఎక్కువ ఉత్తీర్ణత సాధించారు. గ్రేడింగ్‌లోనూ వీరే ముందున్నారు. అంతేకాదు...గతంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు మెరగుప డ్డాయి. ఇంగ్లీషు మాధ్యమంలో బోధన, ఉచితంగా పుస్తకాలు, డ్రెస్సులు ఇవ్వడమే కాదు...మధ్యాహ్న భోజనం పథకంలో ఫౌష్టికాహారం అందజేస్తుండటం కూడా మరో కారణమని అధ్యాప కులు అభిప్రాయపడుతున్నారు.

రంగారెడ్డి జిల్లాలో 20,548 అడ్మిషన్లు
జిల్లాలో మొత్తం 1304 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. 2018–19 విద్యా సంవత్సరంలో ఆయా పాఠశాలల్లో 1,46,407 మంది విద్యార్థులు ఉండగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 1,46,505 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ నెలాఖరు వరకు అడ్మిషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే జిల్లాలో 479 పాఠశాలల్లో ఇంగ్లీషు మాధ్యమంలో విద్యాబోధన జరుగుతుండగా, వీటిలో 45 వేలమందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు. జిల్లాలో వరుసగా గత మూడేళ్ల నుంచి అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుండటంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. అంతేకాదు జిల్లా పరిధిలో వివిధ అంగన్‌వాడీ కేంద్రాల్లో 13వేల కుపైగా చిన్నారులు చదువుతుండగా, వీరందరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చాలని విద్యాశాఖ లక్ష్యంగా నిర్ణయించుకుంది. కానీ వీరిలో ఇప్పటి వరకు 3764 మంది పిల్లలను మాత్రమే చేర్పించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement