చిన్న చూపు | 3.654 There are public schools in the district | Sakshi
Sakshi News home page

చిన్న చూపు

Published Sun, Feb 9 2014 2:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:29 AM

3.654 There are public schools in the district

కంటి చూపు తగ్గిపోతున్నదంటే వృద్ధాప్యం దగ్గరపడుతున్నట్లు ఒకప్పటి లెక్క. జీవనశైలి, ఆహారపు అలవాట్లు... వెరసి వయసుతో పని లేకుండా కంటిచూపు తగ్గుతోంది. బాధాకరమేంటంటే పట్టుమని పదేళ్లు కూడా నిండని చిన్నారుల్లో కంటి చూపు ఊహించని విధంగా తగ్గుతోంది. పదేళ్ల నుంచి 19 ఏళ్ల వయస్సున్న వారి కంటిచూపు మరింత భయపెడుతోంది. తల్లిదండ్రులు, విద్యా సంస్థలు జాగ్రత్తలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో ప్రతి చిన్నారి కళ్లజోళ్లతో పాఠశాలకు వెళ్లాల్సినపరిస్థితులు ఉత్పన్నమయ్యే ప్రమాదముంది.
 
 గతేడాది కంటిపరీక్షలు చేసి దృష్టి లోపం ఉందన్నారు.. కళ్ల జోళ్లు ఇచ్చారు.. ఏడాది కాకముందే ఆ అద్దాలు పనిచేయడం లేదు. కొత్తవి ఇవ్వలేదు. వెనక కూర్చుంటే బోర్డుపైన అక్షరాలు ఎంత పెద్దగా రాసినా కన్పించడం లేదు. ముందు వరుసలోకి వచ్చి కూర్చుంటున్నా ఇబ్బందిగానే ఉంది. నేనొక్కదాన్నే కాదు... మా పాఠశాలలో చాలామంది ఇలాగే బాధపడుతున్నారు.. మాలాంటి వాళ్ల గురించి ప్రభుత్వం పట్టించుకోవాలి.     
 - లక్ష్మిదేవి, విద్యార్థిని, దువ్వూరు
 
 సాక్షి, కడప: జిల్లాలో 3,654 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. వీరిలో 2,54,459మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. జవహర్‌బాల ఆరోగ్య రక్ష ద్వారా 2012-13కు సంబంధించి 3,101 పాఠశాలల్లో 2,03,462మంది విద్యార్థులకు(పదేళ్లలోపు ఉన్నవారికి) ‘చిన్నారిచూపు’ ద్వారా కంటిపరీక్షలు నిర్వహించారు.
 
 వీరిలో 14, 059 మంది విద్యార్థులకు దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించారు. వీరిలో 13,321మందికి  పరీక్షలు నిర్వహించారు.  5,046 మందికి జిల్లా అంధత్వ నివారణ  సంస్థ ద్వారా ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేశారు. తక్కిన వారికి మందులు అందించారు. వీరిలో 96మంది విద్యార్థులకు కళ్లజోళ్లతో చూపు కన్పించే స్థాయి దాటిపోయింది.  నెల్లూరు, హైదరాబాద్ ఆస్పత్రులలో ఆపరేషన్లు చేయించారు. పదేళ్ల వయసులోని విద్యార్థులకు కళ్లజోళ్లు, ఆపరేషన్లు చేయించడం అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే తెలుస్తోంది.
 
 10-19 ఏళ్ల వారిలోమరింత అధికం:
 పదేళ్ల వయస్సున్న వారిలో  ప్రతి వందమందిలో 7.2 శాతం కంటిచూపుతో బాధపడుతుంటే, 10-19 ఏళ్ల వయసు ఉన్నవారిలో ఈ సంఖ్య దాదాపు రెండు రెట్లు అధికంగా ఉంది. ప్రతి  వందమందిలో 21.7 శాతం మందికి కంటి చూపు సమస్య ఉన్నట్లు తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ 2013 మార్చి వరకు సంబంధించినవి. విద్యార్థుల్లో దృష్టిలోపం ప్రమాదకర స్థాయిలో ఉందని తెలిసినా ఈ ఏడాది అధికారులు ‘చిన్నారిచూపు’ను పట్టించుకోలేదు. ఈ ఏడాది ఎక్కడా కంటిపరీక్షలు నిర్వహించలేదని తెలుస్తోంది. గతేడాది ఇచ్చిన కళ్లజోళ్లు వాడినా చాలామందికి ప్రయోజనం ఉండటం లేదు. ఈ ఏడాది కొత్త అద్దాలు ఇవ్వకపోవడంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికస్థోమత  లేని తల్లిదండ్రులు పిల్లలకు కళ్ల జోళ్లు ఇప్పించలేకపోతున్నారు. పిల్లలు అలాగే పాఠశాలలకు వెళుతున్నారు.
 
 జాగ్రత్తలు తీసుకోకపోతే కష్టమే!    
 చిన్నారులలో  దృష్టిలోపాల అంశాన్ని తల్లిదండ్రులు సీరియస్‌గా తీసుకోకపోతే భవిష్యత్తులో వారి  చూపును తగ్గించినవాళ్లవుతారు. సరైన ఆహార అలవాట్లతో  పాటు  సరిపడ నిద్ర ఉండేలా జాగ్రత్త పడాలి. వీలైతే చేపలను ఎక్కువ గా తినిపించాలి. తగిన జాగ్రత్తలు తీసుకుంటే చిన్నారులు రంగుల ప్రపంచాన్ని  ఆనందంగా చూడగలుగుతారు.
 
 కొత్తగా వచ్చాను.. చూస్తాను:
 కొత్తగా బాధ్యతలు తీసుకున్నా, రెగ్యులర్‌గా కంటిపరీక్షలు నిర్వహిస్తున్నటు్లు సమాచారం ఉంది. కళ్లజోళ్లకు సిఫార్సులు చేశాం. రాగానే విద్యార్థులకు పంపిణీ చేస్తాం.
 నాగశశిభూషణ్‌రెడ్డి,
 కోఆర్డినేటర్,
 జవహర్‌బాల ఆరోగ్యరక్ష.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement