‘బోరు’మంటున్న బాల్యం
నిరుపేదల విద్యాలయాలు నిర్లక్ష్యపు రోగంతో కొట్టుమిట్టాడుతున్నాయి. పాలకులు, అధికారుల అలసత్వంతో చావుకు చేరువవుతున్నాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతామని ప్రకటిస్తున్న ప్రజాప్రతినిధుల నయవంచనకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. సర్కారోళ్ల స్కూళ్లలో విద్యాబోధన సంగతి ఎలాగున్నా..మౌలిక వసతులు లేమితో విద్యార్థులు భోరుమంటున్నారు.
ప్రతి పాఠశాలలో మరుగుదొడ్లు నిర్మించి నీటి వసతి కల్పిస్తామంటున్న ప్రభుత్వం..తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేకపోతోంది. కురిచేడు మండలం బోధనంపాడు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో నేటికీ తాగునీటి వసతి లేకపోవడంతో మధ్యాహ్న భోజనం అనంతరం ఆ సమీపంలోని బోరు వద్ద విద్యార్థులు ఇలా పాట్లుపడుతున్నారు. అక్కడే ప్లేట్లు శుభ్రం చేసుకుని అదే నీటితో దాహం తీర్చుకుంటున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధుల్లో మార్పుకోసం వేచిచూస్తున్నారు.