
రాష్ట్రంలో 11.95 శాతం పిల్లలు స్కూల్ డ్రాపౌట్
ఉన్నత పాఠశాల స్థాయిలోనే అధికంగా బడికి దూరం
భూపాలపల్లి జిల్లాలో అత్యధికంగా 29.82 %
పల్లె ప్రాంతాల్లోనే అధికంగా బడి మానేస్తున్న విద్యార్థులు
తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్–2024లో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలతోపాటు గురుకులాలు, ఇతర హాస్టల్ వసతి ఉన్న స్కూళ్లు కావాల్సినన్ని ఉన్నా.. బడి మధ్యలోనే మానేస్తున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ప్రాథమిక స్థాయిలో కొంతవరకు బాగానే ఉన్నప్పటికీ.. ఉన్నత పాఠశాల స్థాయికి వచ్చేసరికి చాలామంది విద్యార్థులు బడి మానేస్తున్నారు. ప్రాథమికోన్నత స్థాయిలో 0.34 శాతం, ఉన్నత పాఠశాలల్లో 11.92 శాతం డ్రాపౌట్స్ నమోదయ్యాయి.
ప్రాథమిక స్థాయిలో ఇది మైనస్ 2.23 శాతంగా ఉంది. ప్రధానంగా పల్లెల్లోనే డ్రాపౌట్లు ఎక్కువగా ఉన్నాయి. సోమవారం రాష్ట్ర ప్రణాళికా విభాగం విడుదల చేసిన ‘తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్‌స్ట్రాక్ట్–2024’లో ఈ వివరాలను పొందుపర్చింది. హనుమకొండ, కరీంనగర్, రంగారెడ్డి, మేడ్చల్–మల్కాజ్‌గిరి, హైదరాబాద్ జిల్లాల్లో డ్రాపౌట్లు తక్కువగా ఉన్నాయి.
నివేదికలోని ప్రధానాంశాలు
⇒ రాష్ట్రంలో 40,975 స్కూళ్లున్నాయి. ఇందులో ప్రాథమిక పాఠశాలలు 20,539, ప్రాథమికోన్నత పాఠశాలలు 7,482, ఉన్నత పాఠశాలలు 11,561, హయ్యర్ సెకండరీ 1,393 స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో మొత్తం 65,41,085 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఒక్కో పాఠశాలకు సగటున 160 మంది విద్యార్థులు ఉన్నారు. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 533 స్కూళ్లు ఉండగా.. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 2,907 ఉన్నాయి.
⇒ హైస్కూల్ పరిధిలో 39,92,429 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రాథమిక పాఠశాలల్లో 8,98,588, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 9,16,869, హయ్యర్ సెకండరీలో 7,33,199 మంది పిల్లలున్నారు. అత్యధికంగా హైదరాబాద్ జిల్లాలో 9,02,674 మంది విద్యార్థులుండగా.. అతి తక్కువగా ములుగు జిల్లాలో 41,061 మంది మాత్రమే ఉన్నారు.
⇒ 6 నుంచి 10 ఏళ్లలోపు చిన్నారులు రాష్ట్రంలో 26,62,200 మంది ఉండగా, పాఠ శాలల్లో నమోదైనవారు 29,28,678 ఉన్నా రు. ప్రాథమిక పాఠశాలల్లో గ్రాస్ ఎన్‌రో ల్‌మెంట్ రేషియో(స్థూల నమోదు నిష్పత్తి) 110 శాతంగా ఉంది. ఇది అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 175 శాతం ఉండగా, అతి తక్కువగా జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో 70 శాతం ఉంది.
⇒ ప్రాథమికోన్నత పాఠశాలల్లో జీఈఆర్ 107 శాతం ఉంది. రాష్ట్రంలో 11 నుంచి 13 సంవత్సరాల వయసున్న పిల్లలు 16,53,800 మంది ఉండగా, ఆరోతరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు స్కూళ్లలో నమోదైన పిల్లలు 17,73,298 (కుటుంబాల వలస ఇతరత్రా కారణాల వల్ల) ఉన్నారు. అతి తక్కువగా జయశంకర్ భూపా లపల్లి జిల్లాలో 59 శాతం ఉండగా, ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలో 173 శాతంగా ఉంది.
⇒ ఉన్నత పాఠశాలల్లో జీఈఆర్ 95 శాతంగా ఉంది. రాష్ట్రంలో 14 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసున్న పిల్లలు 11,44,600 మంది ఉండగా, ఉన్నత పాఠశాలల్లో నమోదైన పిల్లలు 10,82,551 మంది మాత్రమే. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 55 శాతం, అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 149 శాతం నమోదైంది.
⇒ రాష్ట్రంలో సగటున 19 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. ప్రాథమిక స్థాయిలో 18 మందికి, ప్రాథమికోన్నత స్థాయిలో 14 మందికి, ఉన్నత పాఠశాల స్థాయిలో 20 మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. హయ్యర్ సెకండరీ స్థాయిలో 17 మందికి ఒక టీచర్ ఉన్నారు. టీచర్–స్టూడెంట్ నిష్పత్తి 22 జిల్లాల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది. ప్రాథమికోన్నత స్థాయిలో 21 జిల్లాల్లో, ఉన్నత స్థాయిలో 23 జిల్లాలు, హయ్యర్ సెకండరీ స్థాయిలో 13 జిల్లాల్లో ఇది రాష్ట్ర సగటు కంటే తక్కువగా ఉంది. మెదక్, రంగారెడ్డి, మేడ్చల్– మల్కాజిగిరి, హైదరాబాద్, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో టీచర్–స్టూడెంట్ నిష్పత్తి రాష్ట్ర సగటు కంటే ఎక్కువగా ఉంది.
⇒ రాష్ట్రంలో లింగనిష్పత్తి 988గా ఉంది. ప్రతి వెయ్యి మంది పురుషులకు 988 మహిళలు ఉన్నారు. అత్యంత తక్కువ లింగనిష్పత్తి ఉన్న జిల్లా రంగారెడ్డి. ఆ తర్వాత స్థానాల్లో హైదరాబాద్, మేడ్చల్– మల్కాజిగిరి, వనపర్తి జిల్లాలున్నాయి. పురుషుల కంటే మహిళలు ఎక్కువ ఉన్న జిల్లాలు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి.
Comments
Please login to add a commentAdd a comment