131 స్కూళ్ల మూత
► యూపీ స్కూళ్లలో మిగులనున్న టీచర్లు 77 మంది
► ప్రైమరీ పాఠశాలల్లో మిగులు టీచర్లు 372 మంది
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వం చేపట్టిన పాఠశాలల రేషనలైజేషన్‌లో భాగంగా జిల్లావ్యాప్తంగా 131 స్కూళ్లు మూతపడనున్నాయి. ఇందులో 290 అప్పర్‌ప్రైమరీ(యూపీ) స్కూళ్లలో సున్న విద్యార్థుల సంఖ్య ఉన్న 34 పాఠశాలను మూసేయనున్నారు. అలాగే తక్కువగా పిల్లలు ఉన్న 26 స్కూళ్లను సమీపంలోని పాఠశాలల్లో కలపనున్నారు. మొత్తంగా 60 పాఠశాలలు మూతపడనున్నాయి. ప్రైమరీకి సంబంధించి 2215 స్కూళ్లకు గాను సున్న విద్యార్థులున్నవి 60 ఉండగా మరో ఎనిమిందింటిని పక్కవాటిలో కలపనున్నారు. మరో 3 జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటంతో వాటిని కూడా మూసివేయనున్నారు.
ఇలా జిల్లావ్యాప్తంగా ప్రైమరీ, యూపీ, ఉన్నత పాఠశాలలు కలిసి మొత్తంగా 131 మూతపడనున్నాయి. పదిమంది విద్యార్థులు ఉన్న 46 పాఠశాలలను మాత్రం ఈ ఏడాది కొనసాగించనున్నారు. వీటిల్లో వచ్చే ఏడాదిలోగా సంఖ్యను పెంచితే కొనసాగుతాయి లేకుంటే ఇవి కూడా మూతపడతాయి. 6,7 తరగతులు ఉన్న యూపీ స్కూల్స్‌కు సంబంధించి 30 మంది కంటే ఎక్కువ విద్యార్థులు ఉన్న 14 తెలుగు, 1 ఉర్దూ పాఠశాలకు ఉపాధ్యాయుడిని మంజూరు చేస్తారు. అలాగే 30 మంది కంటే తక్కువున్న 152 పాఠశాలలకు పోస్టులను మంజూరు చేయరు.
పులివెందుల నియోజక వర్గంలోని పెద్దరంగాపురం , ఉలిమెళ్ల యూపీ స్కూల్స్‌ను అంకాలమ్మపేట జెడ్పీ పాఠశాలలో కలపనున్నారు. చిన్నరంగాపుర యూపీ స్కూల్‌ను బ్రాహ్మణపల్లె జెడ్పీ స్కూల్లో తుమ్మలపల్లె యూపీ స్కూల్‌ను జెడ్పీ స్కూల్ ఇనగలూరులో కలపనున్నారు. ప్రైమరీ పాఠశాలలకు సంబంధించి టి.సుండుపల్లిలో రెండు, లింగాలలో రెండు , చిట్వేల్, సిద్దవటంలో, వేములలో ఒక్కో పాఠశాలను పక్క స్కూల్స్‌లో కలపనున్నారు.
జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలకు సంబంధించి 30 మంది లోపు విద్యార్థులున్న రాయచోటి మండలం అంబవరం పాఠశాలను 0 విద్యార్థులున్న చిట్వేల్ మండలం తిమ్మయ్యగారిపల్లె, కమలాపురం మండలం పి రాజుపాలెం పాఠశాలను మూసివేయనున్నారు. రాయచోటి మండలం దిగువ అబ్బవరం ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నందున దానిని నిబంధనల ప్రకారం చెన్నముక్కపల్లె ఉన్నత పాఠశాలలో కలపనున్నారు.
యూపీ స్కూల్లో మిగులు ఉపాధ్యాయుల వివరాలు
యూపీ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ లెక్కలకు సంబంధించి తెలుగు పాఠశాలల్లో 7 మంది మిగలగా 12 మంది అవసరం ఉన్నారు. ఫిజిక్స్ విభాగంలో 4 మిగలగా 12 మంది అవసరం ఉన్నారు. బయాలజీలో 28 మంది మిగలగా 21 మంది అవసరం ఉన్నారు. సైన్సుకు సంబంధించి 29 మంది మిగలగా 22మంది అవసరం ఉన్నారు. ఇంగ్లిషు విభాగంలో 41 మంది అవసరం ఉన్నారు. లాంగ్వేజ్ పండిట్ తెలుగుకు సంబంధించి 11 మంది మిగలగా 26 మంది అవసరం అన్నారు. హిందీకి సంబంధించి 7 మంది మిగలగా 29 మంది అవసరం ఉన్నారు.
ఉర్దూలో మాథ్స్‌కు ముగ్గురు, పీఎస్‌కు నలుగురు, బయాలజీకి నలుగురు, సైన్సుకు ఒక్కరు అవసరం ఉన్నారు.ప్రైమరీ సెక్షన్ ఇన్ యూపీ స్కూళ్లకు ఎస్‌జీటీ తెలుగుకు సంబంధించి 65 మంది మిగలగా 19 మంది అసవరం ఉన్నారు. ప్రైమరీ సెక్షన్ ఇన్ యూపీ పాఠశాలల్లో ఎస్‌జీటీ ఊర్దూకు సంబంధించి 6 మంది మిగలగా ఆరుగురు అవసరం ఉన్నారు.
ప్రైమరీ పాఠశాలల్లో..
ప్రైమరీ పాఠశాలల్లో ఎస్‌జీటీలకు సంబంధించి 372 పోస్టులు మిగలగా 137 మంది అవసరం ఉన్నారు. అలాగే ఉర్దూ విభాగంలో 35 మంది మిగలగా 11 మంది అవసరం ఉన్నారు. ప్రైమరీ స్కూల్స్‌లో ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి ఎస్‌జీటీలో ఐదుగురు, బ్లైండ్ స్పెషల్ స్కూల్‌లో ఏడుగురు మిగులుగా ఉన్నారు. వీరిని మాత్రం ఎక్కడికి మార్చేందుకు వీలు ఉండదు. మొత్తం 449 మంది మిగులుగా ఉండగా 156 మంది అవసరం అన్నారు. ఉర్దూ విభాగంలో 41 మంది మిగులు ఉండగా 17 మంది అవసరం ఉన్నారు. రేషనలైజేషన్ నిర్వహించగా మిగులు ఉపాధ్యాయులకు పని ఒకచోట కల్పించి జీతాలు మరో చోట ఇవ్వనున్నారు.
నెలాఖరు లోగా పూర్తి చేస్తాం
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉపాధ్యాయులకు సంబం«ధించిన కౌన్సెలింగ్ కార్యక్రమాన్ని ఈనెలాఖరులోగా పూర్తి చేస్తాం. జూలై ఒకటికల్లా బదిలీ అయిన ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో చేరేలా ఉత్తర్వులు ఇస్తాం. – పొన్నతోట శైలజ, జిల్లా విద్యాశాఖాధికారి