
అనారోగ్య బాల్యం!
విద్యార్థుల సంక్షేమంపై సర్కారుకు చిత్తశుద్ధి కొరవడింది. విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం ప్రవేశపెట్టినజవహర్‌బాల ఆరోగ్యరక్ష పథకం అస్తవ్యస్తంగా తయారైంది.
విద్యార్థుల సంక్షేమంపై సర్కారుకు చిత్తశుద్ధి కొరవడింది. విద్యార్థుల ఆరోగ్య రక్షణ కోసం ప్రవేశపెట్టినజవహర్‌బాల ఆరోగ్యరక్ష పథకం అస్తవ్యస్తంగా తయారైంది. ఇప్పటి వరకూ రక్తహీనత పరీక్షలు చేయలేదు. ‘చిన్నారి డాక్టర్’ను ప్రవేశపెట్టి రెన్నెళ్లు దాటుతున్నా పురోగతి లేదు. ఇదేంటని ఆరాతీస్తే ఒక్క రూపాయి నిధులు లేకుండా పథకాన్ని ముందుకు నడపాలనే ధోరణిలో ప్రభుత్వం...సర్కారు తీరుకు తగ్గట్లుగా ‘మమ’ అనిపించేలా అధికారులు నివేదికలు తయారుచేసి చేతులు దులుపుకోవడం మినహా ఏమీ చేయలేకపోతున్నారు.
సాక్షి, కడప: జిల్లా జనాభా 28.82 లక్షలు. వీరిలో ఆరేళ్ల లోపు చిన్నారులు 3,13,455 మంది. అలాగే 15-18 ఏళ్ల వయసు మధ్య ఉన్న యువత 3.54 లక్షల మంది ఉంటారని ప్రభుత్వ పాఠశాలల గణాంకాలు చెబుతున్నాయి.
వీరికి ఎప్పటికప్పుడు వైద్యపరీక్షలు నిర్వహించడం, రక్తహీనతను తగ్గించే చర్యలకు ఉపక్రమించడంలో రాజీవ్‌విద్యామిషన్ అధికారులు పూర్తి నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. జవ హర్ బాల ఆరోగ్య రక్ష ఆధ్వర్యంలో 2012-13లో వైద్య పరీక్షలు నిర్వహించారు. 10-18 ఏళ్ల మధ్య ఉన్న 2,03,462 మందికి వైద్య పరీక్షలు నిర్వహిస్తే, అందులో1,36,661 మందికి రక్తహీనత ఉందని తేలినట్లు సమాచారం. దీనికి చికిత్స అందించడంలో ప్రభుత్వం గతేడాది ఘోరంగా విఫలమైంది. ఈ ఏడాది రక్తహీనత పరీక్షలు నిర్వహించి, వారికి చికిత్స చే యాల్సిన అధికారులు ఇప్పటి వరకూ ఆ దిశగా ఆలోచన చేయలేదు. గతేడాది కంటే ఈ ఏడాది మరో 10శాతం మంది విద్యార్థులకు అదనంగా రక్తహీనత ఉండొచ్చని కొందరు వైద్యులు చెబుతున్నారు. అయినా చిన్నారుల ఆరోగ్యంపై అధికారులు జాగ్రత్తలు తీసుకోలేదు.
ఇవేం పరీక్షలు:
అనారోగ్య పరిస్థితులకు దారితీసే రక్తహీనత సమస్యను గుర్తించడానికి ప్రభుత్వ యంత్రాంగం వద్ద పరీక్షల వ్యవస్థ లేదు. దీంతో విద్యార్థుల్లో రక్తహీనత సమస్య తీవ్రతను గుర్తించడంలో విఫలమవుతున్నారు. 15-18 ఏళ్ల మధ్య యువతకు డెస్సీ లీటర్ రక్తంలో 14 గ్రాములకు పైగా హిమోగ్లోబిన్ ఉండాలి. అయితే 9-13 మధ్య హెచ్‌బీ ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు.
ఘోరమేంటంటే 8 శాతం మందిలో 7 గ్రాములు మాత్రమే ఉంది. బాలికల్లో 12.5 గ్రాములు ఉండాల్సి ఉండగా 7-10 మధ్య ఉంటోందని అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ఇంతదారుణమైన పరిస్థితి ఉంటే ఈ ఏడాది రక్తహీనత పరీక్షలు నిర్వహించలేకపోతున్నారు. హెచ్‌బీ గుర్తించడానికి, రక్తపరీక్షలు నిర్వహించడానికి అవసరమైన ప్రత్యేక కిట్లు కూడా ప్రభుత్వం పంపిణీ చేయలేదు. రక్తహీనత సమస్య ఉన్నవారికి కనీసం ఐరన్ టాబ్లెట్‌లు కూడా పంపిణీ చేయడం లేదు.
కొరవడిన సమన్వయం:
విద్యార్థుల ఆరోగ్యం కోసం విద్యా, వైద్యం స్త్రీ శిశు సంక్షేమ శాఖలు పని చేయాలి. కానీ ఈ శాఖల మధ్య సమన్వయం సరిగా లేదు. కౌమార బాలికల్లో రక్తహీనత సమస్య ఉన్నవారికి పౌష్టికాహారంపై, శుభ్రతపై అవగాహన కల్పించాల్పిన బాధ్యత స్త్రీశిశు సంక్షేమ శాఖది. సమస్య ఉన్నట్లు గుర్తించాల్సింది వైద్య ఆరోగ్య శాఖది. చదువుకుంటున్న వారికి విద్యా సంస్థల్లో జవహర్ బాలఆరోగ్యరక్ష ఆధ్వర్యంలో శిబిరాలు నిర్వహించాలి. కానీ ఈ శాఖలు సమన్వయంతో వ్యవహరించడం లేదు.
బడ్జెట్ లేదు..సరైన యంత్రాంగం లేదు
జవహర్‌బాల ఆరోగ్యరక్ష పథకానికి నిధులు ఖర్చు చేయడంలో ప్రభుత్వం పూర్తి అలసత్వం ప్రదర్శిస్తోంది. ఒక్కరూపాయి నిధులు విడుదల చేయకుండా కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలనే దిశగా ఆలోచిస్తోంది. దీంతో జవహర్‌బాలఆరోగ్యరక్ష అధికారులు కూడా మొక్కుబడిగా బండి లాగిస్తున్నారు. ‘చిన్నారిడాక్టర్’ అనే కార్యక్రమాన్ని రెన్నెళ్ల కిందట ప్రవేశపెట్టారు. ఈ విషయం చాలామంది టీచర్లకే తెలీదు.
ఏ రకమైన నిధులు లేవు
చిన్నారిడాక్టర్ అమలుకు ఒక్కరూపాయి కూడా నిధులు విడుదల చేయలేదు. జవహర్ బాల ఆరోగ్యరక్ష పరిస్థితి అంతే! అయినప్పటికీ చిన్నారిడాక్టర్‌ను కొన్నిపాఠశాలల్లో కొనసాగిస్తున్నాం. రక్తహీనత పరీక్షలు త్వరలోనే చేపడతాం. విద్యార్థులకు ఆల్బెండజోల్ అందించాం. అది పూర్తయింది. వెంటనే రక్తహీనీత పరీక్షలు చేపడతాం. ఇప్పటికే కొన్నిచోట్ల ఐరన్‌టాబ్లెట్ల పంపిణీ చేపట్టారు. అయితే రియాక్షన్ ఇవ్వడంతో ఆపేశారు. ఐరన్‌సిరప్ కూడా వచ్చాయి. ప్రస్తుతం సెలవులో ఉన్నాను. రాగానే పరిస్థితిని సమీక్షిస్తా.
డాక్టర్ ప్రవీణ్ కుమార్,
జవహర్ బాల ఆరోగ్య రక్ష కోఆర్డినేటర్,