రాజస్తాన్‌లో కూలిన పందిరి | 14 killed, 50 injured as tent collapses in Barmer | Sakshi
Sakshi News home page

రాజస్తాన్‌లో కూలిన పందిరి

Published Mon, Jun 24 2019 4:44 AM | Last Updated on Mon, Jun 24 2019 8:22 AM

 14 killed, 50 injured as tent collapses in Barmer - Sakshi

పందిరి కుప్పకూలిన ప్రాంతం వద్ద గుమికూడిన జనం

బెర్మర్‌/జైపూర్‌: రాజస్తాన్‌లోని బెర్మర్‌ జిల్లాలో ఘోరప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆలయం సమీపంలోని పాఠశాల మైదానంలో ఏర్పాటుచేసిన పందిరి ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో 14 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. జసోల్‌ ప్రాంతంలో ఉన్న రాణి భతియానీ ఆలయం వద్ద వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారీ పందిరిని ఏర్పాటుచేసిన నిర్వాహకులు ‘రామకథ’ నాటకాన్ని ప్రదర్శించారు. దీంతో వేడుకకు హాజరైన వందలాది మంది ప్రజలు అక్కడే కూర్చుని రామకథను చూస్తుండగా బలమైన గాలులకు పందిరి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ విషయమై ఏఎస్పీ రతన్‌లాల్‌ భార్గవ మాట్లాడుతూ.. ‘రామ కథ ప్రదర్శన జరుగుతుండగా ఒక్కసారిగా బలమైన గాలులు వీచాయి.

దీంతో పందిరి ఓవైపు నుంచి కూలిపోవడం ఆరంభమైంది. ఈ నాటకానికి నేతృత్వం వహిస్తున్న మురళీధర్‌ మహరాజ్‌ దీన్ని గమనించి భక్తులను అప్రమత్తం చేశారు. దీంతో అక్కడినుంచి బయటపడేందుకు అందరూ ఒకేసారి ప్రయత్నించడంతో తొక్కిసలాటలాంటి పరిస్థితి నెలకొంది. చూస్తుండగానే ఈ పందిరి భక్తులపై కుప్పకూలిపోయింది’ అని తెలిపారు. ఇనుపరాడ్లు–టెంట్ల కింద చిక్కుకున్న ప్రజలను కాపాడేందుకు ప్రయత్నించిన తమకు విద్యుత్‌ షాక్‌ తగిలిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారన్నారు. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని జిల్లాలోని వేర్వేరు ఆసుపత్రులకు తరలించామని చెప్పారు. 14 మంది చనిపోవడానికి గల కారణం పోస్ట్‌మార్టం తర్వాతే తెలుస్తుందని స్పష్టం చేశారు.  

ప్రధాని మోదీ దిగ్భ్రాంతి
ఈ దుర్ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘రాజస్తాన్‌లోని బర్మర్‌లో పందిరి కూలిపోవడం నిజంగా దురదృష్టకరం. తమ కుటుంబ సభ్యులను కోల్పోయినవారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నా. అలాగే ఈ ప్రమాదంలో గాయపడ్డవారు వీలైనంత త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నా’ అని ప్రధాని ట్వీట్‌ చేశారు. మరోవైపు రాజస్తాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఈ ప్రమాద విషయమై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ దుర్ఘటనలో చనిపోయినవారికి రూ.5 లక్షలు, గాయపడ్డవారికి రూ.2 లక్షల వరకూ నష్టపరిహారం అందజేస్తామని సీఎం తెలిపారు.

ఈ ప్రమాదంపై జోధ్‌పూర్‌ డివిజినల్‌ కమిషనర్‌ బీఎల్‌ కోఠారి నేతృత్వంలో విచారణకు ఆదేశించామని చెప్పారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని యంత్రాంగాన్ని ఆదేశించారు.అనంతరం ఈ దుర్ఘటనపై విచారణ జరపాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. ఈ ప్రమాదంపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement