జైపూర్: లోక్‌సభ ఎన్నికల వేళ రాజస్థాన్ రాజకీయం రసవత్తరంగా మారింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసులో మాజీ సీఎం అశోక్ గెహ్లాట్‌పై అతని మాజీ ఓఎస్డీ లోకేష్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో, పొలిటికల్ వాతావరణం హీటెక్కింది.
కాగా, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్, రీట్ (రాజస్థాన్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) పరీక్ష పేపర్ లీక్ వ్యవహారాల్లో గెహ్లాట్‌పై మాజీ లోకేశ్ శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్క రోజు తనకు సీఎం పీఎస్‌ఓ రాం నివాస్ నుంచి ఫోన్ వచ్చిందన్నారు. సీఎం గెహ్లాట్ నివాసానికి రావాలని చెప్పారు. దీంతో, అక్కడికి వెళ్లాను. ఈ సందర్భంగా కొన్ని ఆడియో క్లిప్‌లతో కూడిన పెన్ డ్రైవ్‌ను గెహ్లాట్ తనకు అందజేశారని, ఆ తర్వాత అవి మీడియాకు లీక్ అయ్యాయని అన్నారు. అవి ఫోన్ సంభాషణలు అని తనకు చెప్పారని, అయితే అవి చట్టబద్ధమైనవో కాదో తనకు తెలియదని పేర్కొన్నారు. తనను ఒక హోటల్‌కు పిలిపించి వీటి గురించి మాట్లాడినట్టు చెప్పుకొచ్చారు. రీట్ పేపర్ లీక్ వ్యవహారంలో తన సన్నిహితులకు అశోక్ గెహ్లాట్ రక్షణ కల్పించారని శర్మ ఆరోపించారు.
అనంతరం, ఆడియో సంభాషణను లోకేష్ శర్మ లీక్ చేశారంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ దర్యాప్తు చేస్తోంది. ఇదివరకే లోకేశ్ శర్మను విచారణకు పిలిచి ప్రశ్నించారు. లోకేశ్ శర్మ ప్రస్తుతం బెయిల్‌పై ఉన్నారు. అయితే, ఈ విషయంపై గెహ్లాట్‌పై లోకేశ్ శర్మ పరువు నష్టం దావా వేశారు. ఇక, ఈ ఆరోపణలపై అశోక్ గెహ్లాట్ ఇప్పటివరకు స్పందించలేదు.
Gehlot, in order to save his Govt, tapped Sachin Pilot and other’s phone, and made it appear as if Gajendra Singh Sekhawat and the BJP tried to topple his Govt.
- Lokesh Sharma, Ashok Gehlot’s former OSD pic.twitter.com/PuxYilQkZn— Rishi Bagree (@rishibagree) April 25, 2024
అయితే, 2020 జూలైలో కాంగ్రెస్ సీనియర్ నేత సచిన్ పైలట్ మొత్తం 19 మంది ఎమ్మెల్యేలతో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారు. ఆ సమయంలో ఎమ్మెల్యేలుగా ఉన్న విశ్వేంద్ర సింగ్, భన్వర్ లాల్ శర్మ వంటి తిరుగుబాటు ఎమ్మెల్యేల ఫోన్ సంభాషణ లీక్ అయ్యింది. తిరుగుబాటు ఎమ్మెల్యే భన్వర్ లాల్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ మధ్య జరిగిన సంభాషణ ఆడియో క్లిప్ కూడా వీటిలో ఉంది. ఈ క్రమంలో అశోక్ గెహ్లాట్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నించిందంటూ రాజకీయంగా పెను దుమారం రేగింది.
ఇదిలా ఉండగా.. లోకేష్ శర్మ ఆరోపణలను కాంగ్రెస్ నేతలు ఖండిస్తున్నారు. తాజాగా శర్మ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి స్వర్ణిమ్ చతుర్వేదీ స్పందిస్తూ.. లోకేష్ శర్మ ప్రభుత్వ అధికారి కాదు. పైగా అతను బీజేపీ నాయకులతో టచ్‌లో ఉన్నాడు. వారి సూచనలు మేరకు మాత్రమే అతను ఇలాంటి కామెంట్స్ చేశాడని చెప్పుకొచ్చారు. అయితే, రాజస్థాన్‌లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శర్మ వ్యాఖ్యలు కాంగ్రెస్‌కు నష్టం కలిగిస్తాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment