
ప్రమాదంలో కాబోయే దంపతులు దుర్మరణం
మృతుల్లో అబ్బాయిది వైఎస్సార్ కడప జిల్లా పెనికలపాడు
యువతిది ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేల
ముద్దనూరు/పుట్రేల(విస్సన్నపేట): ఆ రెండు మనసులను పనిచేసే ప్రాంతమే పరిచయం చేసింది.. ప్రేమను చిగురించేలా చేసింది. పెళ్లిపీటల కోసం సిద్ధ పరచింది. మరో రెండు నెలల్లో ఒక్కటి చేయాలని చూసింది. కానీ ఇంతలోనే మృత్యువు ఆ ఇద్దరినీ కబళించింది. ఆ పనిచేసే ప్రాంతంలోనే పాశాన్ని విసిరింది. అనుకోని విపత్తు వారి ఆశలను ఆహుతి చేసింది. ఎన్నో ఆకాంక్షలతో కొత్త జీవితాన్ని ఆరంభించాలకున్న ఆ జంట.. ఇంట పెను విషాదాన్ని నింపింది.
తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పాశమైలారం ఫార్మా పరిశ్రమలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో రాష్ట్రానికి చెందిన యువతీ, యువకులు ప్రాణాలు కోల్పోయారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండలం పెనికలపాడు గ్రామానికి చెందిన నిఖిల్ కుమార్‌రెడ్డి(25), ఎన్టీఆర్ జిల్లా విస్సన్నపేట మండలం పుట్రేలకు చెందిన రామాల. శ్రీరమ్య ఫార్మా పరిశ్రమలో ఉద్యోగులు. ఇక్కడే వారి మధ్య పరిచయం ఏర్పడింది. ఇరువురూ తమ పెద్దలను ఒప్పించారు. మరో రెండునెలల్లోనే పెళ్లిపీటలు ఎక్కాల్సిన తరుణంలో విషాదం వెంటాడింది. సోమవారం ఇద్దరూ పరిశ్రమలో విధుల్లో ఉన్నారు. ఒక్కసారిగా పేలుడు సంభవించింది. దీంతో వారిద్దరూ మృతి చెందారు. ఈ ఘటనతో పెనికలపాడు, పుట్రేల గ్రామాల్లో మంగళవారం తీవ్ర విషాదం అలముకుంది.
రెండునెలల్లో పెళ్లి చేద్దామనుకున్నాం...
రామాల నారయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, పెద్ద కుమార్తె జ్యోత్స్న బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తోంది. చిన్న కుమార్తె శ్రీరమ్య తిరుపతి పద్మావతి యూనివర్సిటీలో ఎమ్మెస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేసి ఆరు నెలల క్రితమే సిగాచి ఫార్మా కంపెనీలో ఉద్యోగంలో చేరింది. ఇంతలో ఘోర విపత్తులో చిన్న కుమార్తె ప్రాణాలు కోల్పోవడాన్ని తలచుకుంటూ తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. నిఖిల్ రెడ్డి కుటుంబంతో మాట్లాడి ఆషాఢం వెళ్లిన తర్వాత పెళ్లి చేద్దామనుకున్నామని తీరా ఈ విషాద సంఘటనలో ఇరువురు చనిపోయారని మృతురాలి తల్లి పద్మ కన్నీరు మున్నీరుగా విలపించింది.